ఏ మహిళా వెళ్లని జలధి అగాధంలోకి.. | American Space Women Catherine Sullivan | Sakshi
Sakshi News home page

గగన సాగరిక

Published Thu, Jun 11 2020 9:38 AM | Last Updated on Thu, Jun 11 2020 9:39 AM

American Space Women Catherine Sullivan - Sakshi

క్యాథరీన్‌ సలవీన్‌: అంతరిక్షంలో నడిచిన తొలి అమెరికన్‌ మహిళ (1984 అక్టోబర్‌ 11) సముద్రగర్భంలోని లోతైన ‘చాలెంజర్‌ డీప్‌’ను చేరిన తొలి ప్రపంచ మహిళ  (2020 జూన్‌ 7)

కలల నిర్మాణాన్ని కాంట్రాక్టుకివ్వొద్దంటారు క్యాథరీన్‌. ‘మనల్ని బాగు చేయనివ్వొద్దు.. పాడు చేయనివ్వొద్దు..’ క్యాథరీన్‌ ఎవరికైనా చెప్పే మాట! అంతరిక్షంలో నడిచిన ఈ తొలి అమెరికన్‌ మహిళ..నేడు కడలి ‘అడుగు’ను తాకివచ్చిన తొలి సాగరిక! భూ ఉపరితలాన, గగన వీధుల్లో, సముద్రపు లోతుల్లో... ఆమె కెరీర్‌ కలలన్నీ ఇష్టంగా ఆమె నిర్మించుకున్నవే.

భూమి పుట్టి జ్ఞానమెరిగాక ఏ మహిళా వెళ్లని జలధి అగాధంలోకి వెళ్లి విజేతగా తిరిగి వచ్చారు క్యాథరీన్‌ సలవీన్‌! భూఉపరితలం నుంచి సముద్ర గర్భంలోకి ఏ ప్రాంతంలోనైతే లోతు ఎక్కువగా ఉంటుందో అంత అడుగుకూ వెళ్లగలిగారు క్యాథరీన్‌. కేవలం దీన్నొక సాహసంగా చూస్తే మాత్రం ఆమెను మనం తక్కువ చేసినట్లే. ‘దుస్సాహసం’ అనాలి. నింగిపైన భూకక్ష్య చుట్టూ తిరుగుతుండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రూట్‌ మ్యాప్‌ను చూసుకుంటూ సముద్రం లోపలికి 35 వేల అడుగుల గమ్యస్థానానికి చేరుకోవడం అంటే మత్స్యయంత్రాన్ని కొట్టడమే! నీళ్లలో కాదు, శూన్యంలో ఈదడం అది. ముప్పైఏడేళ్ల క్రితమే అంతరిక్షంలో నడిచిన ఈ తొలి అమెరికన్‌ మహిళ ఇప్పుడు సముద్ర గర్భంలోని ‘ఛాలెంజర్‌ డీప్‌’ వరకు వెళ్లిన తొలి ప్రపంచ మహిళ అయ్యారు. జూన్‌ 7 ఆదివారం క్యాథరీన్‌ ఈ ఘనతను సాధించారు.  
నాడు ‘ఛాలెంజర్‌ మిషన్‌’లో నింగిలోకి.

‘ఛాలెంజర్‌ డీప్‌’ అనేది మారియానా అగాధంలో ఉండే ఒక సముద్ర కేంద్రం. అక్కడికి ‘లిమిటింగ్‌ ఫ్యాక్టర్‌’ అనే జలాంతర్నౌకలో చేరుకున్నారు క్యాథరీన్‌. అంత లోతులో నీటి పీడనం సముద్ర ఉపరితలం మీద ఉండేదాని కన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి చాలు బలంగా లేని జలాంతర్నౌక పేలిపోడానికి. ఇదే ప్రమాదం మనిషి వేసుకున్న రక్షణ కవచానికీ ఉంటుంది. ఇక పీడనం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉంటే శిఖరస్థాయి. లేకుంటే పాతాళం. సూక్ష్మక్రిములు మాత్రమే తట్టుకుని జీవించగల అస్థిరతలు అవి. పైగా చీకటి! క్యాథరీన్‌ సముద్ర విజ్ఞాన పరిశోధకురాలు కనుక తేలిగ్గా ఈదుకొచ్చేశారు. నాసా వ్యోమగామి కూడా అయిన క్యాథరీన్‌ గగన– సాగర అనుభవం జలాంతర్నౌక పైలట్‌ విక్టర్‌ వెస్కోవో పనిని సులభతరం చేసింది. లేకుంటే మారియానా అగాధం అతడిని తిప్పలుపెట్టి ఉండేదే. 

నేడు నీటిలోని ‘ఛాలెంజర్‌ డీప్‌’ లోనికి (లిమిటింగ్‌ ఫ్యాక్టర్‌ జలాంతర్నౌకలో క్యాథరీన్, పైలట్‌ విక్టర్‌ – ఆ చివర).

మారియానా అగాధం పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలోని మారియానా దీవులకు తూర్పు వైపున ఉంటుంది. ప్రపంచపటంలో పైన ఉత్తరం నుంచి నుంచి.. కింద దక్షిణానికి జపాన్, చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలను ఒక లెఫ్ట్‌ బ్రాకెట్‌లా అర్ధచంద్రాకారంలో పేర్చుకుంటూ వస్తే.. నెలవంక మధ్యలో నక్షత్రం ఉన్నట్లు... ఆ మధ్య భాగంలో ఉంటుంది మారియానా అగాధం. మొత్తం భూగోళం మీదే అతి లోతైన సముద్ర గర్భం అది. లోపల 11 వేల మీటర్ల కింద ఉండే ప్రదేశమే.. ’ఛాలెంజర్‌ డీప్‌’. అక్కడికి చేరుకున్నారు క్యాథరీన్‌. ఇంతవరకు మహిళలెవరూ సాధించని విజయాన్ని ప్రపంచ మహిళావనికి సంపాదించి పెట్టారామె! ఇదంతా ఆమె అధ్యయంలో ఒక భాగం. క్యాథరీన్‌ అట్లాంటిక్‌ మహా సముద్రం పైన కూడా సాహసయాత్రలు చేశారు. భూగర్భశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు క్యాథరీన్‌. ‘యు.ఎస్‌.నేవల్‌ రిజర్వు’లో ఓషనోగ్రఫీ ఆఫీసర్‌గా పని చేశారు. తర్వాత ‘నాసా’కు వెళ్లిపోయారు.

భూమి, సముద్రం, ఆకాశం! ‘నాసా’లో పదిహేనేళ్లు పరిశోధనలు చేసి రిటైర్‌ అయ్యాక అమెరికా ప్రభుత్వ సముద్ర వాణిజ్య, వాతావరణ శాఖ సలహాదారుగా పని చేశారు. కొత్త అధ్యక్షుడిగా ట్రంప్‌ రావడంతో ఆ పదవి వేరే వారితో భర్తీ అయింది. ‘‘నీ దారి నువ్వే వేసుకోవాలి’’ అంటారు క్యాథరీన్‌. ‘‘నీ జీవితాన్ని నీకు నిర్మించి ఇచ్చేందుకు ఎప్పుడూ కొందరు సిద్ధంగా ఉంటారు. వాళ్లకు అవకాశం ఇవ్వకు. ఇస్తే వారు చెప్పే సాకులను నువ్వు వినవలసి వస్తుంది. సాకులు వెదుక్కునే వాళ్ల నుంచి మనం ఏదీ నిర్మించుకోలేం. అలాంటి వారికి మన కలల్ని ఎందుకివ్వాలి?’’ అని కూడా ప్రశ్నిస్తారు. 37 ఏళ్ల క్రితం ముప్పై ఒక్కేళ్ల వయసులో తను చేసిన ‘స్పేస్‌ వాక్‌’కి గగన సోపానాలను నిర్మించకున్నదీ, ఇప్పుడీ 68 ఏళ్ల వయసులో సముద్రగర్భంలో తను వదలి వచ్చిన ‘అడుగు’ జాడలకు దారులు నిర్మించుకున్నది పూర్తిగా తనే. తన కెరీర్‌ను ఇంకొకర్ని బాగు చేయనివ్వలేదు. పాడు చేయనివ్వలేదు క్యాథరీన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement