AVANIGADDA constituency
-
Pawan: ‘మా బిడ్డకు వేరొకరు తండ్రా?’
సాక్షి, కృష్ణా: అవనిగడ్డ సీటు జనసేనలో కుంపట్లు రాజేసింది. జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌కు టికెట్ ఖరారు చేస్తుండడాన్ని ఆ పార్టీ ‘అసలైన’ నేతలు భరించలేకపోతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడకపోయినా.. దాదాపు ప్రసాద్‌కే టికెట్ ఖాయమైపోయిందనే చర్చ ఆ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ తరుణంలో ఆందోళనలకు జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి.విక్కుర్తి శ్రీనివాస్ నేతృత్వంలో ఇవాళ అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం జరగనుంది. శ్రీనివాస్‌కే టికెట్ కేటాయించాలని జనసేన నేతలు, ఆయన అనుచర గణం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఇవాళ్టి సమావేశంలో తీర్మానం చేయాలని నిర్ణయించాయి. ఆలస్యం చేయకుండా ఈ తీర్మానాన్ని పవన్‌కు పంపడం ద్వారా.. సీటు శ్రీనివాస్‌కే కేటాయించేలా జనసేన అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అయితే.. ‘‘మండలి బుద్ధ ప్రసాద్ గతంలో జనసేనను పిల్లల పార్టీ అన్నారు. జనసేనలో డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని మరీ సీటు ఇవ్వాల్సిన అవసరం పవన్‌కు ఏముంది?. పార్టీలో అర్హులైనవాళ్లు ఎవరూ లేరా?. న్యాయంగా చూసుకుంటే అవనిగడ్డ టికెట్ నాకే దక్కాలి. కానీ, చివరి నిమిషంలో మార్చేశారు’’ అని విక్కుర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు అవనిగడ్డలో జనసేన అభ్యర్థినే నిలబెట్టేందుకు పోరాడుతున్నామని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేర్కొన్నారు. మాబిడ్డకు వేరొకరు తండ్రి అవుతారంటే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారాయన. పార్టీ కోసం కష్టపడిన ఒకరిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పక్క పార్టీ నాయకులను తీసుకొస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మమ్మల్ని కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తే అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. పదేళ్లు ఏ కష్టం వచ్చినా సరే.. పార్టీని వీడకుండా ఉన్నాం. ఒక్క సీటు నెగ్గిన కష్టకాలంలోనూ పవన్ వెంటే నడిచాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ పరాయి పార్టీ జెండాలు మోశాం. ఇప్పుడేమో.. చంద్రబాబు, పవన్ ఒప్పందం ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌ను పార్టీలో చేర్చుకొని, టిక్కెట్టు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తారా? అని.. జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవేళ పార్టీ వ్యక్తికి కాదని బయటకు వాళ్లకు ఇస్తే గనుక మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పవన్‌ను అవనిగడ్డ జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. -
ప్రగతి ప్రదాత.. సంక్షేమ విధాత
సాక్షి, మచిలీపట్నం: రాజకీయ చైతన్యం కలిగిన కృష్ణా జిల్లాపై మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయనతో జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. సుదీర్ఘకాలంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేసి, తనదైన మార్క్ చూపిన ఘనత ఆయనకే దక్కింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించి రాజకీయంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. అప్పటికే తొమ్మిదేళ్ల బాబు పాలనతో విసిగిపోయిన జిల్లా ప్రజలు చరిత్రలో కనివిని ఎరుగని విజయాన్ని వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ప్రభుత్వ కూర్పులోనూ వైఎస్ జిల్లాకు పెద్ద పీట వేశారు. కోనేరు రంగారావుకి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. విప్‌గా సామినేని ఉదయభానుకు ఇచ్చారు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అదే ప్రభంజనాన్ని కొనసాగిచింది. అయితే దురదృష్ట పరిణామాల నేపథ్యంలో ఆయన మరణించడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మహానేత ఆశయాలను పునికి పుచ్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా తొమ్మిదేళ్లు ప్రజల పక్షాన పోరాటం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు జిల్లా ప్రజలు పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 16 అసెంబ్లీ స్థానాల్లో 14 స్థానాల్లో విజయఢంకా మోగించి తిరుగులేని శక్తిగా వైఎస్సార్ సీపీ ఆవిర్భవించింది. వైఎస్సార్ హయాంలోనే పట్టణాభివృద్ధి.. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.వందల కోట్ల వ్యయంతో పట్టణాలను అన్ని విధాల అభివృద్ధి బాటలో పయనింపజేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకాలను నిర్మించడమే కాకుండా, పట్టణాల్లోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. అభివృద్ధి బాట ఇది.. – బందరు నియోజకవర్గంలో పట్టణ ప్రజల చిరకాల కోరిక అయిన బందరు పోర్టు నిర్మాణానికి నాంది పలికింది వైఎస్సారే. ఇందులో భాగంగా రూరల్ మండలంలో శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. రూ.130 కోట్లతో బందరు పట్టణంలో డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేశారు. – ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో కృష్ణా యూనివర్సిటీని స్థాపించారు. ప్రస్తుతం అక్కడ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అంతేగాక భవన నిర్మాణానికి రూ.10 కోట్ల మేర నిధులు మంజూరు చేశారు. రోల్డ్‌గోల్డ్ పరిశ్రమకు జీవం పోసేందుకు బందరు మండలంలో పోతేపల్లిలో జ్యూవెలరీ పార్క్ ఏర్పాటుకు స్థలం కేటాయించారు. – పెడన పట్టణంలో ప్రతి నిరుపేదకు ఇళ్లు ఇవ్వాలన్న తలంపుతో 4 వైఎస్సార్ కాలనీలు ఏర్పాటు చేశారు. ఈ కాలనీల్లో 400 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొన్నేళ్లుగా గూడు లేక అవస్థలు పడుతున్న పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. – కైకలూరు నియోజకవర్గంలో సైతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కైకలూరు పట్టణంలో రూ.3 కోట్లతో కలిదిండి పాలిటెక్నిక్ కళాశాల నిర్మించారు. మండవల్లి జూనియర్ కళాశాల ఏర్పాటు, కైకలూరు పంచాయతీ అభివృద్ధికి రూ.10 కోట్లు నిధులు కేటాయించారు. యానాదుల కాలనీలో ఇళ్లు కట్టుకునేందుకు భూమి కేటాయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పునరావాసం నిమిత్తం రూ.350 కోట్లు కేటాయించి ప్రజలను ఆదుకున్న ఘనత ఆయనకే దక్కింది. రూ.12 కోట్లతో పెద్దింట్లమ్మవారధి నిర్మించారు. ప్రస్తుతం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. – నూజివీడులో రూ.600 కోట్లతో నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య చేరువయ్యేలా చేశారు. రూ.66 కోట్లతో కృష్ణా జలాల పథకం. 4 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీని చేసి వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మామిడి సాగుకు పేరుగాంచిన నూజివీడులో మామిడి పరిశోధన కేంద్రం అభివృద్ధి రూ.7 కోట్లు కేటా యించారు. అంతేగాక రూ.6 కోట్లతో బాలికల రెసిడెన్షియల్ భవనం నిర్మాణానికి కృషి చేశారు. – జగ్గయ్యపేట నియోజవర్గంలో సైతం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రూ.37 కోట్లతో వేదాద్రి–కంచల ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. వత్సవాయి మండలం రూ.400 కోట్లతో పోలంపల్లి డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అ పనులు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. – అవనిగడ్డ నియోజకవర్గంలో డెల్టా ఆధునికీకరణకు రూ.4,576కోట్ల ని«ధులు మంజూరు చేశారు. 2008 జూన్ 6న అవనిగడ్డ మండలం పులిగడ్డవార్పు వద్ద «ఆధునికీకరణ పనులకు వైఎస్ శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లాలో రూ. 2,180 కోట్లు, అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.547.93 కోట్లు డెల్టా ఆధునికీకరణ పనులు జరిగాయి. రూ.138 కోట్లతో జరిగిన పులిగడ్డ–విజయవాడ కరకట్ట డబుల్‌లైన్ పనులకు ఆయన నిధులు మంజూరు చేశారు. రాష్ట్రంలోనే తొలి ఫిషరీస్ కళాశాలను నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో ఏర్పాటు చేశారు. రూ.35కోట్లతో అవనిగడ్డలో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు వైఎస్ హయాంలోనే జరిగింది. రూ.40 కోట్లతో నాగాయలంక మండలం గుల్లలమోద నుంచి కోడూరు మండలం సాలెంపాలెం వరకూ సముద్ర కరకట్టను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే అభివృద్ధి చేశారు. అశ్వరావుపాలెం–మందపాకల పంటకాలువ పనులు చేశారు. ఆయన హయాంలో నియోజవర్గంలో రూ.590 కోట్లు అభివృద్ధి పనులు జరిగాయి. జిల్లాపై మమకారం.. దివంగత మహానేత వైఎస్సార్‌కు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో రాజీవ్ పల్లెబాట, జగ్గయ్యపేట పట్టణంలో రాజీవ్ నగర బాట, బైపాస్‌రోడ్డు ప్రారంభోత్సవం ఇలా అనేక కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో పర్యటించారు. దాదాపుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు, అనుచరులు ఉన్న ఏకైక నేతగా, నిత్యం ప్రజల సంక్షేమమం కోసం పరితపించిన నేతగా, జిల్లా ప్రజల మదిలో ఆ మహానేత ఎప్పటికీ చిరస్మరణీయుడు. -
స్వతంత్రులతో కలవరం
సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక సమరం కీలక దశకు చేరుకుంది. పోరులో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. ప్రధాన పార్టీల మధ్యే పోరు సాగుతున్నా, బరిలో మాత్రం సగానికిపైగా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జిల్లాలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు.. తాము ఏ విషయంలో తగ్గేది లేదన్నట్టుగా.. ముందుకెళుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఏమాత్రం తగ్గని రీతిలో.. ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం వీరు చీల్చే ఓట్ల ప్రభావం ఎవరిపై పడుతుందోననే ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు 27 మంది, 16 అసెంబ్లీ స్థానాలకు 205 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో సింహభాగం ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులే ఉన్నారు. వీరిలో ఇతర పార్టీల అభ్యర్థులు, టీడీపీ నాయకులు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బదీసేందుకు స్వతంత్రులను రంగంలోకి దించారన్న ప్రచారమూ సాగుతోంది. బందరు, అవనిగడ్డ, ఇలా అన్ని ప్రధాన నియోజకవర్గాల్లో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేనతో పాటు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నలుగురు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు 1000 నుంచి 10,000 ఓట్ల వరకు చీల్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొత్త చిక్కు.. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్య పోరు సాగింది. ప్రస్తుతం రంగంలోకి జనసేన రావడంతో ఏ పార్టీ ఓట్లు చీల్చుతుంది? మూడో పార్టీ రంగ ప్రవేశంతో ఏ పార్టీకి నష్టం కలుగుతుందన్న చర్చ నడుస్తున్న తరుణంలో స్వతంత్రుల పోరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు మరో చిక్కు తెచ్చిపెట్టినట్లయింది. చీల్చేవి తక్కువ ఓట్లయినా రసవత్తర యుద్ధంలో కొన్సిసార్లు అవే కీలకంగా మారే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు ఈ అంశంపై తర్జనభర్జన పడుతున్నాయి. పార్లమెంట్ల పరిధిలో.. బందరు పార్లమెంట్ పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 12 మంది బరిలో ఉండగా.. అందులో 4 ఇండిపెండెంట్లు, మరో 4 రిపబ్లికన్, పిరమిడ్ తదితర పార్టీలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన వారు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో 15 మంది బరిలో ఉండగా.. 5 ఇండిపెండెంట్లు, 5 మంది పిరమిడ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తదితర పార్టీలకు చెందిన వారు కాగా.. మిగిలిన వారు ప్రధాన పార్టీల అభ్యర్థులున్నారు. అసెంబ్లీ పరిధిలో.. తిరువూరు నియోజకవర్గంలో 12 మంది బరిలో ఉండగా.. అందులో 4 ఇండిపెండెంట్లు, 3 ఇతర పార్టీలు, మిగిలిన వారు ప్రధాన పార్టీలకు చెందిన వారు బరిలో ఉన్నారు. నూజివీడులో 11 మంది పోటీలో ఉండగా.. 3 ఇండిపెండెంట్లు, 4 ఇతర పార్టీలు, మిగిలిన వారు ప్రధాన పార్టీల తరఫున బరిలోకి దిగుతున్నారు. గన్నవరంలో 14 మంది బరిలోకి దిగగా.. 4 ఇండిపెండెంట్లు, 4 ఇతర పార్టీలు, మిగిలిన వారు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ టీడీపీ గిమ్మిక్కు రాజకీయాలకు దిగింది. వైఎస్సార్ సీపీ యార్లగడ్డ వెంకట్రావు పేరును పోలిన పేరుతో ప్రజాశాంతి పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రామయ్యను రంగంలోకి దింపి వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చే కుట్ర పన్నుతోంది. గుడివాడలో 12 మంది అభ్యర్థులుండగా.. 6 మంది ఇండిపెండెంట్లు, 1 ఇతర పార్టీ, మిగిలినవి ప్రధాన పార్టీలకు చెందిన వారు కాగా.. ఇక్కడ కూడా టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు దిగింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నానీ) పేరును పోలిన వెంకటేశ్వరరావు కొడాలి అభ్యర్థిని ప్రజాశాంతి పార్టీ నుంచి బరిలోకి దింపుతోంది. కైకలూరులో 14 మంది బరిలో ఉండగా..6 మంది స్వతంత్ర అభ్యర్థులు, ఇద్దరు ఇతర పార్టీ, మిగిలిన వారు ప్రధాన పార్టీల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పెడనలో 9 మంది పోటీలో ఉండగా 2 స్వతంత్ర, 3 ఇతర, మిగిలిన వారు ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగుతున్నారు. మచిలీపట్నంలో 8 మంది బరిలో ఉండగా.. ఒక్క స్వతంత్ర అభ్యర్థి, 1 ఇతర, మిగిలినవి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారు. -
బాబు తీరుపై మండిపడ్డ రాజ్‌నాథ్
సాక్షి, విజయవాడ : ఎన్నికల ప్రచారంలో భాగంగా అవనిగడ్డ బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చంద్రబాబు నాయుడు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ఎప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమని అడగలేదని స్పష్టం చేశారు. హోదా ఇవ్వలేక పోయినా దానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి రూ.7 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. టీడీపీతో బీజేపీకి పొత్తు ఉన్నా లేకపోయినా ఏపీకి వచ్చే నిధులు మాత్రం ఆగవని అన్నారు. మచిలీపట్నం పోర్టును శంకుస్థాపన చంద్రబాబు ఎలాంటి పనులను చేపట్టలేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మచిలీపట్నం పోర్టును నిర్మిస్తామని, వరికి మరింత గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీనిచ్చారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం.. టాప్ 10 దేశాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ తొమ్మిదో స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకుందని తెలిపారు. బీజేపీ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు తమవిగా చెప్పుకుంటున్నారనిమండిపడ్డారు. రెండున్నర హెక్టార్ల భూమి ఉన్న రైతులకు రూ.6 వేలు కేంద్రం ఇస్తోందని అన్నారు. కానీ, ఏపీలో రైతుల వివరాలు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఇక్కడి రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదని వెల్లడించారు. 1984 ఎన్నికల్లో దేశం మొత్తంమీద తమ పార్టీ రెండు సీట్లే గెలుచుకుందని, దానిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించిందని గుర్తు చేశారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అవినీతి తప్ప మరేమి కనిపించడంలేదని అన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. దశాబ్దాలుగా అదే మాట.. అగ్రవర్ణ పేదలకు మోదీ 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దేశంలో మోదీ ప్రధాని అయ్యే నాటికి మొబైల్ ఫోన్లు తయారు చేసే పరిశ్రమలు రెండే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 126 కు చేరుకుంది. త్వరలో చైనా, రష్యా దేశాల ఆర్థిక వ్యవస్థను భారత దేశం మించిపోతుంది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కాంగ్రెస్ హయాంల బ్యాంకులను మోసం చేశారు. దర్జాగా, ధైర్యంగా దేశంలో తిరిగారు. మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గ్రహించి విదేశాలకు పారిపోయారు. ఆర్థిక నేరగాళ్లను, ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పుల్వామా ఘటన తరువాత మన వాయుసేన పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. కానీ, కాంగ్రెస్, టీడీపీ సర్జికల్ స్ట్రైక్స్‌పై అనవసరంగా విమర్శలు చేస్తున్నాయి.పేదరిక నిర్మూలిస్తామని, సంవత్సరానికి రూ.72 వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అదే చెప్పారు. దశాబ్దాల అనంతరం రాహుల్ కూడా అదే చెపుతున్నారు. -
పోరాటాల పురిటిగడ్డ..అవనిగడ్డ
సాక్షి, అవనిగడ్డ : జిల్లాకు తూర్పున.. కృష్ణమ్మ చెంతన ఏర్పడింది అవనిగడ్డ నియోజకవర్గం. ఆరు మండలాలతో అతిపెద్ద నియోజక వర్గంగా ఖ్యాతికెక్కింది. ప్రశాంత కు మారుపేరైన ఈ పల్లెసీమల నుంచే ఎందరో ఉద్దండులైన రాజ కీయ నాయకులు జన్మించారు. ఇక ఉద్యమాలకు ఊపిరిలూదిందీ ఈ పురిటిగడ్డే. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. గాంధీ జీ ఉద్యమ స్పూర్తికి ఊపిరి పోశా రు. జమిందారీ వ్యవస్థ్ధపై ఉక్కుపిడికిలి బిగించారు. భూపోరాటా లతో మార్గదర్శకులయ్యారు. 1952 అవనిగడ్డ దివి నియోజకవర్గంగా ఏర్పడింది. దివి ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అవనిగడ్డ, నిడుమోలు నియోజకవర్గాలు కలిసి ఉండేవి. దివి తాలూకా నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవారు. అవనిగడ్డ నియోజకవర్గంకు జిల్లాలో ప్రత్యేకతక ఉంది. 1972లో ఏకగీవ్రం కాగా జిల్లాలో ఈ ఘనత సాధిం చారు. అవనిగడ్డ. ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలు హాట్రిక్ సాధించారు కమ్యునిస్టు యోధులు చండ్రరామలింగయ్య, గుంటూరు బాపనయ్య, సనకా బుచ్చికోటయ్యతో గాంధేయవాది మండలి వెంకటకృష్ణారావు, దేవుడి మంత్రి సింహాద్రి సత్యనారాయణ వంటి నాయకులను ఈ గడ్డ అందించింది. ఏడుసార్లు కాంగ్రెస్.. ఆరు సార్లు టీడీపీ 1962లో అవనిగడ్డ నియోజకవర్గం ఏర్పడింది. 1962ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి వై శివరాంప్రసాద్, కమ్మునిస్టు పార్టీ అభ్యర్ధి సనకా బుచ్చికోటయ్యపై 2992 ఓట్లతో గెలుపొందారు. 1967లో ఈ ఇద్దరే తలపడగా శివరాం ప్రసాద్ 8663ఓట్లతో గెలుపొందారు. 1972లో మండలి వెంకట కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978లో మండలి వెంకట కృష్ణారావు, జనతా అభ్యర్థి సైకం అర్జునరావుపై 490 ఓట్లతో గెలుపొందారు. 1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికల్లో మండలి వెంకట కృష్ణారావు గెలుపొందారు. 1985లో టీడీపీ అభ్యర్ధి సింహాద్రి సత్యనారాయణరావు, మండలి వెంకట కృష్ణారావుపై 6683ఓట్లతో గెలుపొందారు. 1989లో వీరిద్దరే పోటీపడగా సింహాద్రి సత్యనారాయణరావు 167ఓట్లతో గెలుపొందారు. 1994లో సింహాద్రి సత్యనారాయణరావు, కాంగ్రెస్ అభ్యర్ధి మండలి బుద్ధప్రసాద్‌పై 5377ఓట్లతో గెలుపొందారు. 1999లో మండలి బుద్ధప్రసాద్, టీడీపీ అభ్యర్ధి బూరగడ్డ రమేష్నాయుడుపై 794ఓట్లతో గెలుపొందారు. 2004లో వీరిద్దరే పోటీపడగా, మండలి బుద్ధప్రసాద్ 8483ఓట్లతో గెలుపొందారు. 2009లో టీడీపీ అభ్యర్ధి అంబటి బ్రహ్మణయ్య, మండలి బుద్ధప్రసాద్‌పై 417ఓట్లతో గెలుపొందారు. 2013లో బ్రాహ్మణయ్య మరణంతో జరిగిన ఎన్నికల్లో ఆయన తనయుడు అంబటి శ్రీహరిప్రసాద్, ఇండిపెండెంట్ అభ్యర్ధి సైకం రాజశేఖర్‌పై 61,644 ఓట్లతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మండలి బుద్ధప్రసాద్, సింహాద్రి రమేష్‌బాబుపై 5859 ఓట్ల తేడాతో గెలుపొందారు. హ్యాట్రిక్లతో పాటు మంత్రి పదవులు అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో యార్లగడ్డ శివరాంప్రసాద్ 1955, 1962, 1967 వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందం మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేయగా, 1972, 1978, 1983లో మండలి వెంకట కృష్ణారావు హ్యాట్రిక్ సాధించగా, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. 1985, 1989, 1994లో హ్యాట్రిక్ సాధించిన సింహాద్రి సత్యనారాయణరావు ఎన్టీరామారావు, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చేశారు. 1962, 1967లో సనకా బుచ్చికోటయ్య, 1985, 1989లో మండలి వెంకటకృష్ణారావు, 1999, 2004లో బూరగడ్డ రమేష్‌నాయుడు వరుసగా పరాజయం పాలయ్యారు. తండ్రీ కొడుకులు మండలి వెంకట కృష్ణారావు, మండలి బుద్ధప్రసాద్ ఇద్దరినీ ఓడించిన ఘనత సింహాద్రి సత్యనారాయణకు దక్కింది. జిల్లాలో ఏకైక ఏకగ్రీవ నియోజకవర్గం 1972లో జరిగిన ఎన్నికల్లో మండలి వెంకట కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో ఏకైక ఏకగ్రీవ నియోజకవర్గంగా అవనిగడ్డ రికార్డు సాధించింది. మూడు సార్లు హ్యాట్రిక్ సాధించి, మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణరావు 2004లో ఇండిపెండెంట్‌గా పోటీచేయగా 14,845 ఓట్లతో మూడో స్ధానంకు పరిమితమయ్యారు. సామాజిక వర్గాలే కీలకం కాపు సామాజిక వర్గం : 69,500 బీసీలు : 64,600 మత్స్యకార సామాజిక వర్గం : 29,400 ఎస్సీలు : 41,450 ఎస్టీలు : 6,460 ఉన్నారు కమ్మ సామాజిక వర్గం : 9,800 మంది ముస్లీంలు : 3,840 నియోజకవర్గం జనాభా : 2,63,771 ఓటర్లు : 2,12,830 పురుషులు : 1,06,171 స్త్రీలు : 1,06,640 పోలింగ్ బూత్‌లు మొత్తం : 266 -
ఎంపీల పురిటిగడ్డ.. అవనిగడ్డ
సాక్షి, అవనిగడ్డ : దివిసీమ ఎంపీల పురిటిగడ్డ అని చెప్పవచ్చు. జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా అవనిగడ్డ ఏకంగా ఆరుగురు ఎంపీలను అందించింది. వీరిలో ఐదుగురు మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపికకాగా, మరొకరు తెనాలి పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 1952లో మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి జరిగిన తొలి ఎన్నికల్లో అవనిగడ్డకు చెందిన కమ్యునిస్టు పార్టీ యోధుడు సనకా బుచ్చికోటయ్య సీపీఐ(ఎంఎల్) నుంచి గెలుపొందారు. 1957 ఎన్నికల్లో అవనిగడ్డకు చెందిన మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తరుపున, 1967 ఎన్నికల్లో నాగాయలంక మండలం తలగడదీవికి చెందిన మండల వెంకటస్వామి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. 1967 ఎన్నికల్లో చల్లపల్లిరాజాగా పిలుచుకునే యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ కాంగ్రెస్ తరుఫున విజయం సాధించారు. బందరు పార్లమెంట్‌కు ఇలా వరుసగా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన నలుగురు నాన్‌లోకల్ నేతలు ఎంపిక కావడం అరుదైన ఘనతగా చెప్పవచ్చు. రాష్ట్రంలో మరే ఇతర పార్లమెంట్ నియోజకవర్గానికి ఇలా చరిత్ర లేదు. ఒకే నియోజకవర్గానికి చెందిన నలుగురు నాన్‌లోకల్ వ్యక్తులు ఎంపీలుగా గెలుపొందిన రికార్డు దివిసీమదే. 1999 ఎన్నికల్లో వక్కపట్లవారిపాలేనికి చెందిన అంబటి బ్రాహ్మణయ్య ఎంపీగా గెలుపొందగా, అవనిగడ్డ మండలం మోదుమూడికి చెందిన సింగం బసవపున్నయ్య 1989లో తెనాలి పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్న జయపురానికి చెందిన కనకమేడల రవీంద్రకుమార్‌ని కలుపుకుంటే దివిసీమ ఏడుగురు ఎంపీలను అందించింది. -
నేడు కొత్త మాజేరుకు వైఎస్ జగన్ రాక
-
నేడు కొత్త మాజేరుకు వైఎస్ జగన్ రాక
విషజ్వరాలతో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు పరామర్శ విజయవాడ : అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విష జ్వరాలతో మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శిస్తారు. ఉదయం హైదరా బాద్‌లో బయలుదేరి 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి చల్లపల్లి మీదుగా కొత్తమాజేరు గ్రామం వెళతారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ సోమవారం తెలిపారు. మృతుల కుటుంబాలతో జగన్మోహన్రెడ్డి మాట్లాడతారని, గ్రామంలో జరిగిన పరిణామాలు తెలుసుకుంటారని ఆయన వివరించారు. గ్రామస్తులు కలుషిత నీరు తాగి విషజ్వరాల బారిన పడినా సకాలంలో స్పందించని అధికారుల తీరుపైనా వివరాలడిగి తెలుసుకుంటారని చెప్పారు. పరామర్శల అనంతరం అక్కడినుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ వెళతారని రఘురామ్ తెలిపారు. -
అవనిగడ్డ శాసనసభ ఫలితాలపై ఉత్కంఠట
ఈ సారి 85శాతం పోలింగ్ మహిళలు, ఎస్సీల ఓట్లే కీలకం అవనిగడ్డ శాససభ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 1,96,305మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 98,649మంది మహిళలు, 97,633మంది పురుషులు ఉన్నారు. 23 మంది ఇతరులు ఉన్నారు. వీరిలో 1,66, 223మంది ఓటు వేశారు. 85శాతం పోలింగ్ నమోదైంది. వీరిలో 83,625మంది పురుషులు ఉండగా, 82,595మంది మహిళలు ఉన్నారు. ఒకరు ఇతరులు ఉన్నారు. ఐదు పోలింగ్ కేంద్రాలు పాదాలవారిపాలెం, చింతకోళ్ల, ఇరాలి, సంగమేశ్వరం, పాలకాయతిప్పలో 95శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా ఇస్మాయిల్బేగ్పేటలో 52 శాతం పోలింగ్ నమోదైంది. 44 కేంద్రాల్లో 90 నుంచి 95 శాతం ఓటింగ్ నమోదుకాగా 109 కేంద్రాల్లో 85 నుంచి 95శాతం నమోదైంది. కొడాలి, చిరువోలు, పెదకళ్లేపల్లి, రామచంద్రపురం, భావదేవరపల్లిలో పురుషులు, మహిళలూ సమానంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 241 కేంద్రాల్లో 101 బూత్‌లలో మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 140బూత్‌లలో పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఘంటసాల మండలంలో మొత్తం 31,454మంది ఓటర్లకుగాను 26,999మంది ఓటు వేశారు. 85.83 శాతం పోలింగ్ నమోదైంది. చల్లపల్లి మండలంలో 38,953మంది ఓటర్లుండగా 32,123మంది ఓటు వేశారు. 82 శాతం పోలింగ్ నమోదైంది. అవనిగడ్డ మండలంలో మొత్తం 57,312మంది ఓటర్లకు 47,667మంది ఓటు వేశారు. 83.16 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి ఎన్నికల్లో ఎస్సీ కాలనీల్లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైంది. వీరి ఓట్లు గెలుపోటముల్లో కీలకం కానున్నాయి. వీరితో పాటు నియోజకవర్గంలో మహిళలు, తరువాత మత్స్యకారుల ఓట్లు కీలకమవుతాయి. వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఫలితాల కోసం అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈనెల 16న విజయవాడలో ఓట్ల లెక్కింపు జరగనుండటంతో అందరిచూపూ ప్రస్తుతం అటువైపు పడింది.