ప్రగతి ప్రదాత..  సంక్షేమ విధాత | Late Ex CM Of AP Made Indelible Remark In Krishna District | Sakshi
Sakshi News home page

ప్రగతి ప్రదాత..  సంక్షేమ విధాత

Published Mon, Jul 8 2019 8:56 AM | Last Updated on Mon, Jul 8 2019 9:45 AM

Late Ex CM Of AP Made Indelible Remark  In Krishna District - Sakshi

పులిచింతల ప్రాజెక్ట్‌ శంకుస్థాపన సమయంలో నాగలిపట్టిన నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌(ఫైల్‌)

సాక్షి, మచిలీపట్నం:  రాజకీయ చైతన్యం కలిగిన కృష్ణా జిల్లాపై మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయనతో జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. సుదీర్ఘకాలంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అడ్రస్‌ గల్లంతు చేసి, తనదైన మార్క్‌ చూపిన ఘనత ఆయనకే దక్కింది.

2004 సార్వత్రిక ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించి రాజకీయంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ పార్టీ విజయానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. అప్పటికే తొమ్మిదేళ్ల బాబు పాలనతో విసిగిపోయిన జిల్లా ప్రజలు చరిత్రలో కనివిని ఎరుగని విజయాన్ని వైఎస్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకి కట్టబెట్టారు.

జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ప్రభుత్వ కూర్పులోనూ వైఎస్‌ జిల్లాకు పెద్ద పీట వేశారు. కోనేరు రంగారావుకి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. విప్‌గా సామినేని ఉదయభానుకు ఇచ్చారు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ అదే ప్రభంజనాన్ని కొనసాగిచింది. అయితే దురదృష్ట పరిణామాల నేపథ్యంలో ఆయన మరణించడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.

మహానేత ఆశయాలను పునికి పుచ్చుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా తొమ్మిదేళ్లు ప్రజల పక్షాన పోరాటం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు జిల్లా ప్రజలు పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 16 అసెంబ్లీ స్థానాల్లో 14 స్థానాల్లో విజయఢంకా మోగించి తిరుగులేని శక్తిగా వైఎస్సార్‌ సీపీ ఆవిర్భవించింది. 

వైఎస్సార్‌ హయాంలోనే పట్టణాభివృద్ధి..
దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.వందల కోట్ల వ్యయంతో పట్టణాలను అన్ని విధాల అభివృద్ధి బాటలో పయనింపజేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకాలను నిర్మించడమే కాకుండా, పట్టణాల్లోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు.
అభివృద్ధి బాట ఇది..

– బందరు నియోజకవర్గంలో పట్టణ ప్రజల చిరకాల కోరిక అయిన బందరు పోర్టు నిర్మాణానికి నాంది పలికింది వైఎస్సారే. ఇందులో భాగంగా రూరల్‌ మండలంలో శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. రూ.130 కోట్లతో బందరు పట్టణంలో డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేశారు.

– ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో కృష్ణా యూనివర్సిటీని స్థాపించారు. ప్రస్తుతం అక్కడ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అంతేగాక భవన నిర్మాణానికి రూ.10 కోట్ల మేర నిధులు  మంజూరు చేశారు. రోల్డ్‌గోల్డ్‌ పరిశ్రమకు జీవం పోసేందుకు బందరు మండలంలో పోతేపల్లిలో జ్యూవెలరీ పార్క్‌ ఏర్పాటుకు స్థలం కేటాయించారు.

– పెడన పట్టణంలో ప్రతి నిరుపేదకు ఇళ్లు ఇవ్వాలన్న తలంపుతో 4 వైఎస్సార్‌ కాలనీలు ఏర్పాటు చేశారు. ఈ కాలనీల్లో 400 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొన్నేళ్లుగా గూడు లేక అవస్థలు పడుతున్న పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. 

– కైకలూరు నియోజకవర్గంలో సైతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కైకలూరు పట్టణంలో రూ.3 కోట్లతో కలిదిండి పాలిటెక్నిక్‌ కళాశాల నిర్మించారు. మండవల్లి జూనియర్‌ కళాశాల ఏర్పాటు, కైకలూరు పంచాయతీ అభివృద్ధికి రూ.10 కోట్లు నిధులు కేటాయించారు. యానాదుల కాలనీలో ఇళ్లు కట్టుకునేందుకు భూమి కేటాయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు ఆపరేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పునరావాసం నిమిత్తం రూ.350 కోట్లు కేటాయించి ప్రజలను ఆదుకున్న ఘనత ఆయనకే దక్కింది. రూ.12 కోట్లతో పెద్దింట్లమ్మవారధి నిర్మించారు. ప్రస్తుతం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  

– నూజివీడులో రూ.600 కోట్లతో నూజివీడులో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య చేరువయ్యేలా చేశారు. రూ.66 కోట్లతో కృష్ణా జలాల పథకం. 4 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీని చేసి వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మామిడి సాగుకు పేరుగాంచిన నూజివీడులో మామిడి పరిశోధన కేంద్రం అభివృద్ధి రూ.7 కోట్లు కేటా యించారు. అంతేగాక రూ.6 కోట్లతో బాలికల రెసిడెన్షియల్‌ భవనం నిర్మాణానికి కృషి చేశారు. 

– జగ్గయ్యపేట నియోజవర్గంలో సైతం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రూ.37 కోట్లతో వేదాద్రి–కంచల ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. వత్సవాయి మండలం రూ.400 కోట్లతో పోలంపల్లి డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అ పనులు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. 

– అవనిగడ్డ నియోజకవర్గంలో డెల్టా ఆధునికీకరణకు రూ.4,576కోట్ల ని«ధులు మంజూరు చేశారు.  2008 జూన్‌ 6న అవనిగడ్డ మండలం పులిగడ్డవార్పు వద్ద «ఆధునికీకరణ పనులకు వైఎస్‌ శంకుస్థాపన చేశారు.

కృష్ణా జిల్లాలో రూ. 2,180 కోట్లు, అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.547.93 కోట్లు డెల్టా ఆధునికీకరణ పనులు  జరిగాయి. రూ.138 కోట్లతో జరిగిన పులిగడ్డ–విజయవాడ కరకట్ట డబుల్‌లైన్‌ పనులకు ఆయన నిధులు మంజూరు చేశారు. రాష్ట్రంలోనే తొలి ఫిషరీస్‌ కళాశాలను నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో ఏర్పాటు చేశారు. రూ.35కోట్లతో అవనిగడ్డలో 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు వైఎస్‌ హయాంలోనే జరిగింది.

రూ.40 కోట్లతో నాగాయలంక మండలం గుల్లలమోద నుంచి కోడూరు మండలం సాలెంపాలెం వరకూ సముద్ర కరకట్టను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలోనే అభివృద్ధి చేశారు. అశ్వరావుపాలెం–మందపాకల పంటకాలువ పనులు చేశారు. ఆయన హయాంలో నియోజవర్గంలో రూ.590 కోట్లు అభివృద్ధి పనులు జరిగాయి. 

జిల్లాపై మమకారం.. 
దివంగత మహానేత వైఎస్సార్‌కు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో రాజీవ్‌ పల్లెబాట, జగ్గయ్యపేట పట్టణంలో రాజీవ్‌ నగర బాట, బైపాస్‌రోడ్డు ప్రారంభోత్సవం ఇలా అనేక కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో పర్యటించారు. దాదాపుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు, అనుచరులు ఉన్న ఏకైక నేతగా, నిత్యం ప్రజల సంక్షేమమం కోసం పరితపించిన నేతగా, జిల్లా ప్రజల మదిలో ఆ మహానేత ఎప్పటికీ చిరస్మరణీయుడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement