చిక్కిన టక్కరి
డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన అవినాష్
హైదరాబాద్ నుంచి పెద్దాపురం తరలింపు..
లొంగుబాటు వెనుక ‘అదృశ్యశక్తి’ హస్తం?
అమలాపురం టౌన్ :మానవ హక్కుల చైర్మన్ పద విని అడ్డం పెట్టుకుని, హోం మంత్రి చుట్టాన్నని చెప్పుకొని జిల్లాలో దందాలకు దిగిన మాయలమారి పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్ర గురువారం హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయంలో పోలీసులకు లొంగిపోయాడు. అవినాష్ అక్రమాలు, ఆగడాలపై నాలుగు రోజుల కిందట ప్రసార మాధ్యమాలు ఎలుగెత్తాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆ మాయలోడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో జల్లెడపట్టాయి. అతడు హైదరాబాద్‌లోనే కొన్ని అదృశ్య శక్తుల నీడలో తలదాచుకున్నట్టు సమాచారం అందటంతో ఆ నగరానికి జిల్లా నుంచి పోలీసు బృందాలు
మూడు రోజుల కిందటే వెళ్లి గాలించాయి.
ఇంతలో అవినాషే డీజీపీ కార్యాలయంలో లొంగిపోయి ఉత్కంఠకు తెరదించాడు. అయితే తొలి నుంచీ అవినాష్‌కు అండగా నిలుస్తున్న టీడీపీ ప్రభుత్వంలోని ఓ అదృశ్య శక్తి అతని లొంగుబాటు వ్యూహంలోనూ తెరవెనుక పనిచేసినట్లు తెలుస్తోంది. అవినాష్ చేసిన మోసాలు, అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తుండటం, హోంమంత్రి బంధువునంటూ చెలరేగిపోవటంతో ఇప్పుడు అతడిని కాపాడే అవకాశాలు ఆ అదృశ్య శక్తికి సన్నగిల్లాయి. దీంతో ఎంతటి అజ్ఞాతంలో ఉన్నా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పన్నిన నిఘా వలకు ఒకటిరెండు రోజుల్లో అవినాష్ చిక్కక తప్పేదికాదు. ఈ క్రమంలో అతడికి అండగా ఉన్న అదృశ్య శక్తే లొంగుబాటుకు వ్యూహరచన చేశారని తెలుస్తోంది. అతను అజ్ఞాతంలో ఉండేకొద్దీ ప్రభుత్వానికి అప్రతిష్ట పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ఈప్రచారానికి తెరదించాలనే వ్యూహంతోనే స్వచ్ఛందంగా లొంగిపోయేలా చేసినట్టు తెలుస్తోంది. అవినాష్ అక్రమాలు వెలుగు చూసిన 72 గంటల్లో ఆ టక్కరి చిక్కడంతో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకుంటోంది.
హైదరాబాద్ నుంచి పెద్దాపురానికి..
హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన అవినాష్‌ను విచారణ నిమిత్తం ప్రత్యేక పోలీసు బందోబస్తుతో గురువారం మధ్యాహ్నమే అక్కడ నుంచి పెద్దాపురానికి తరలించే ఏర్పాటు చేశారు. పెద్దాపురం సీఐ శివకుమార్‌కు డీజీపీ కార్యాలయ అధికారులు ఆ నిందితుడిని అప్పగించారు. రాజమండ్రి నుంచి ఒకటి, పెద్దాపురం నుంచి రెండు కేసులు అవినాష్‌పై నమోదు కావడం, మరిన్ని ఫిర్యాదులు అందే అవకాశం ఉండడంతో విచారణ నిమిత్తం అవినాష్‌ను హైదరాబాద్ నుంచి పెద్దాపురానికి తీసుకువస్తున్నారు.
ఊపిరి పీల్చుకున్న బాధితులు..
అవినాష్ దౌర్జన్య దృశ్యాలు టీవీలో చూసి అతనికి భయపడి ఫిర్యాదు చేసేందుకు జంకిన జిల్లాలోని బాధితులు ఇప్పుడు అతడు పోలీసులకు లొంగిపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. మొన్నటి వరకు అవినాష్ వల్ల ఎన్ని ఇబ్బందులు, బెదిరింపులు ఎదురైనా ఆ బాధను అతని ఆగడాలకు జడిసి ఫిర్యాదుకు వెనుకాడారు. ఫిర్యాదు చేస్తే రాజకీయ అండతో తమనేం చేస్తాడోనని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తి పోలీసుల అదుపులోకి రావడంతో బాధితుల్లో కొంత ధైర్యం కనిపిస్తోంది. అతని బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఇక ముందుకు రావచ్చునని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
అవినాష్‌కు అంగుళూరులో ఆధార్ కార్డు
అవినాష్‌కు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామం చిరునామాతో ఆధార్ కార్డు, రేషన్‌కార్డు ఉన్నారుు. కొన్నేళ్ల క్రితం కోనసీమ నుంచి ఖమ్మం జిల్లా చర్ల మండలం మామిడిగూడానికి వలస వెళ్లిన అవినాష్ కుటుంబానికి అంగుళూరులో బంధువులు ఉన్నారు. అతని అమ్మమ్మది ఆ గ్రామమేనని తెలిసింది. అయితే ఆధార్ కార్డులో అతడు 1990 జనవరి 4న పుట్టినట్టుగా ఉంది. ఆ లెక్కన అతని వయసు ప్రస్తుతం 25 ఏళ్లు ఉండాలి. అయితే అతని వయసు 32 ఏళ్లు కావడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్యాకేజీ పొందేందుకు అవినాష్ ఇక్కడ ఆధార్ పుట్టించుకున్నాడా అనే అనుమానాలు ఆ గ్రామ ప్రజల నుంచి వ్యక్తమవడం గమనార్హం.
ఏ సెక్షన్‌కు ఎంత శిక్ష..
అవినాష్ అక్రమాలపై పెద్దాపురం పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ కేసులు రుజువైతే శిక్షలు కఠినంగా ఉంటాయని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. 419 సెక్షన్ రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా, 420 సెక్షన్‌కు ఏడేళ్ల జైలు, జరిమానా, 506 రెడ్‌విత్ 34సెక్షన్‌కు రెండేళ్ల జైలు, జరిమానా, 342 సెక్షన్‌కు ఏడాది జైలు శిక్ష, 323 సెక్షన్‌కు ఏడాది జైలు, 384 సెక్షన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.