ayesha mera
-
అయేషా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ముమ్మరం
విజయవాడ: అయేషా మీరా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా అయేషా మీరా హత్య సమయంలో పనిచేసిన పోలీసులను సీబీఐ అధికారులు విచారించారు. కానిస్టేబుళ్లు రామారావు, శంకర్, రాధాల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. హత్య జరిగిన సమయంలో దర్యాప్తు తీరు, గుర్తించిన ఆధారాల గురించి వివరాలు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఘటనాస్థలంలో దొరికిన ఆనవాళ్లపై సీబీఐ నివేదిక సిద్ధం చేసినట్లుగా తెలిసింది. ఇప్పటికే సీబీఐ, విజయవాడ కోర్టు సిబ్బందిపై రెండు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయేషా మీరా హత్య కేసుకు సంబంధించిన కొన్ని రికార్డులు విజయవాడ కోర్టులో అనుమానాస్పద స్థితిలో కాలిపోయాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసును హైకోర్టు, సీబీఐకి అప్పగించిన విషయం తెల్సిందే. 2007 డిసెంబర్ 27న బీ-ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడలోని ఓ హాస్టల్లో హత్యకు గురైంది. హాస్టల్లో ఉన్న బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్న అయేషాను హాస్టల్ సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. తన ప్రేమను తిరస్కరించడంతోనే అయేషాపై అత్యాచారం జరిపి చంపేసినట్లు నిందితుడు లేఖ రాసి ఆమె పక్కన పడేసి వెళ్లాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి కేసు అనేక మలుపులు తిరుగుతూ ఉంది. చివరికి సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగి 12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా కేసు ఓ కొలిక్కిరాలేదు. -
డీజీపీని కలిసిన అయేషా మీరా తల్లిదండ్రులు
విజయవాడ: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ని న్యాయవాదులతో కలిసి అయేషా మీరా తల్లిదండ్రులు మంగళవారం కలిశారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదనే అభిప్రాయాన్ని డీజీపీ ముందు వ్యక్తం చేశారు. అయేషా కేసును తక్షణమే సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. సిట్‌లో ఉన్న అధికారులు కేసును తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. దోషులు ఎవరనేది అందరికీ తెలుసునని, కానీ ఎందుకు వారిని సమగ్రంగా విచారణ చేయడం లేదో అర్ధంకావడం లేదన్నారు. 11 సంవత్సరాలు అయినా మాకు న్యాయం జరగకపోవడం బాధగా ఉందన్నారు. కేసు స్టడీ చేసి న్యాయం చేస్తానని డీజీపీ హామీ ఇచ్చారని అయేషా తల్లి పేర్కొన్నారు. 2007 డిసెంబర్ 27న బీ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా విజయవాడలోని హాస్టల్లో హత్యకు గురయింది. హాస్టల్ బాత్రూం వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న ఆయేషాను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం పక్కనే ఓ లేఖ కూడా లభ్యమైంది. తన ప్రేమను తిరస్కరించడంతోనే అయేషాను అత్యాచారం చేసి, చంపేసినట్లు నిందితుడు లేఖలో పేర్కొన్నాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయేషా మీరా హత్య కేసులో పోలీసులు నిందితుడిగా పేర్కొన్న సత్యం బాబు హైకోర్టులో నిర్దోషిగా విడుదల అవడంతో కేసు కొలిక్కి రాలేదు. -
‘అయేషా దోషులకు శిక్ష పడేవరకు పోరాటం’
విజయవాడ: అయేషా మీరా కేసును రీ ఓపెన్ చేయడం ఊరట కలిగించింది. ఈ కేసులో అసలైన దోషులను పట్టుకోవడానికి ఇది మంచి అవకాశమని మహిళ కమిషన్ చైర్మెన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఆమె ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కేసు విషయంలో ఆయేషా తల్లిదండ్రులకు ప్రభుత్వం, మహిళా కమిషన్ సపోర్టుగా ఉంటుంది. అసలైన దోషులకు శిక్ష పడేవరకు పోరాటం చేస్తామన్నారు. ఆనాడు పోలీసులు అసలు నిందితులను తప్పించి అమాయకుడైనా సత్యంబాబు జీవితాన్ని నాశనం చేశారని ఆమె అన్నారు. ఈ కేసులో విషయంలో సీపీ గౌతమ్ సవాంగ్ మొదట నుంచి వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అలా మాట్లాడటం తగదని ఆమె తెలిపారు. ఈ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కమిషనర్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షన వద్దని ఎవరైనా మంచి మహిళ అధికారిని నియమించాలన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఆయేషా హత్య కేసులో నిందితుడు సత్యంబాబును ఇటీవల హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అంతేకా అతడికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని తెలిపింది. కేసులో తగిన ఆధారాలు లేకుండా సత్యం బాబాను ఎనిమిదేళ్ల పాటు జైలు జీవితం అనుభవించాడు. పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం కూడా సత్యం బాబు నిర్దోషి అని, అసలు నిందితులైన కోనేరు రంగారావు బంధువులను వదిలిపెట్టి ఇతడిని ఇరికించారని అప్పట్లోనే తెలిపింది. ఈ విషయంపై సత్యం బాబు విడుదలైనా తరువాత సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి పరిస్థితుల్లో గత్యంతరం లేక నేరాన్ని అంగీకరించినట్టు చెప్పాడు.