అయేషా మీరా తల్లిదండ్రులు(పాత చిత్రం)
విజయవాడ: ఏపీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ని న్యాయవాదులతో కలిసి అయేషా మీరా తల్లిదండ్రులు మంగళవారం కలిశారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదనే అభిప్రాయాన్ని డీజీపీ ముందు వ్యక్తం చేశారు. అయేషా కేసును తక్షణమే సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. సిట్‌లో ఉన్న అధికారులు కేసును తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. దోషులు ఎవరనేది అందరికీ తెలుసునని, కానీ ఎందుకు వారిని సమగ్రంగా విచారణ చేయడం లేదో అర్ధంకావడం లేదన్నారు. 11 సంవత్సరాలు అయినా మాకు న్యాయం జరగకపోవడం బాధగా ఉందన్నారు. కేసు స్టడీ చేసి న్యాయం చేస్తానని డీజీపీ హామీ ఇచ్చారని అయేషా తల్లి పేర్కొన్నారు.
2007 డిసెంబర్ 27న బీ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా విజయవాడలోని హాస్టల్‌లో హత్యకు గురయింది. హాస్టల్ బాత్రూం వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న ఆయేషాను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం పక్కనే ఓ లేఖ కూడా లభ్యమైంది. తన ప్రేమను తిరస్కరించడంతోనే అయేషాను అత్యాచారం చేసి, చంపేసినట్లు నిందితుడు లేఖలో పేర్కొన్నాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయేషా మీరా హత్య కేసులో పోలీసులు నిందితుడిగా పేర్కొన్న సత్యం బాబు హైకోర్టులో నిర్దోషిగా విడుదల అవడంతో కేసు కొలిక్కి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment