న్యూ ఇయర్ ఎఫెక్ట్: ప్రసాదంపై రూ.20 అదనం!
తిరువనంతపురం: నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అందులోనూ వారాంతం కావడంతో కుటుంబసమేతంగా భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే కేరళలో మాత్రం ఆలయ అధికారులు న్యూ ఇయర్ ఎఫెక్ట్ ను బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. ప్రసాదం ధరను ఏకంగా రూ.20 పెంచేసి భక్తులకు విక్రయిస్తున్నారు. నేటి ఉదయం నుంచి శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. పంబ, శరన్, గుత్తి, అయ్యప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో అయ్యప్ప ప్రసాదానికి ఉన్న డిమాండ్ తో పాటు కొత్త సంవత్సరం తొలి రోజు ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిసర ప్రాంతాల ఆలయాలలో అయ్యప్ప ప్రసాదానికి అదనంగా మరో ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. చేసేదేం లేక ఆలయ అధికారులు పెంచిన నగదు చెల్లించి ప్రసాదాన్ని కొనుగోలు చేయడం ఆలయాలకు వస్తున్న భక్తుల వంతైంది. ఇదేం విడ్డూరమని కొందరు భక్తులు అనుకుంటున్నారు.