azaan row
-
లౌడ్ స్పీకర్లపై పోరాటం ఆగదు: రాజ్ ఠాక్రే హెచ్చరికలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించే వరకూ.. హనుమాన్ చాలీసా పఠిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే మరోసారి హెచ్చరించారు. భారీ సౌండ్ వచ్చే లౌడ్స్పీకర్లు తొలగించే వరకూ తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. 45 నుంచి 55 డెసిబుల్స్ వరకూ సుప్రీంకోర్టు అనుమతించిందని, అయితే.. ముంబైలోని 135 మసీదులు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించాయని ఆరోపించారు. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని రాజ్‌ఠాక్రే ప్రశ్నించారు. కాగా హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని రాజ్ ఠాక్రే హెచ్చరించిన నేపథ్యంలో బుధవారం ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లోని చాలా మసీదులు ఆజాన్ సమయంలో లౌడ్స్పీకర్లను బంద్ చేశాయి. మహారాష్ట్రలోని పర్భాని, ఉస్మానాబాద్, హింగోలి, జల్నాలోని కొన్ని ప్రాంతాలు, నాందేడ్, నందుర్బార్, షిర్డీ, శ్రీరాంపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఆజాన్ సమయంలో లౌడ్స్పీకర్లు స్వచ్ఛందంగా తొలగించగా. మరి కొన్ని చోట్ల తక్కువ వాల్యూమ్‌తో ఉపయోగించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 నుంచి 260 మంది ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ ఠాక్రే నివాసం ముందు గుమిగూడిన పలువురు కార్యకర్తలలతోపాటు పుణెలో ఎనిమిందిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కార్యకర్తల అరెస్ట్‌పై రాజ్ ఠాక్రే స్పందించారు. చట్టాన్ని అనుసరించే తమ పార్టీ కార్యకర్తలను నిర్బంధించి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. చదవండి: లౌడ్‌స్పీకర్ల వ్యవహారంలో ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్ ఈ సమస్య కేవలం మసీదులకు సంబంధించినది మాత్రమే కాదని, అక్రమ లౌడ్‌స్పీకర్లతో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ అంశం మతపరమైంది కాదని, సామాజిక సమస్య అని అన్నారు. అలాగే ఈ సమస్య ఒక రోజుది కాదని.. లౌడ్ స్పీకర్ల కారణంగా విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముంబైలోని 1,140 మసీదుల్లో 135 మసీదులు బుధవారం ఉదయం 6 గంటల కంటే ముందే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాయని మహారాష్ట్ర హోంశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యహరించిన సదరు 135 మసీదులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్
ఆజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా రాజకీయం.. బెదిరింపులతో ముంబై మహానగరం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మసీద్‌లపై లౌడ్‌స్పీకర్ల నుంచి ఆజాన్ వినిపిస్తే.. ప్రతిగా హనుమాన్ చాలీసా ప్రదర్శిస్తామంటూ రాజ్ థాక్రే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మసీద్‌లపై లౌడ్స్పీకర్లు తొలగించాలంటూ మే 3వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించాడాయన. ఆజాన్ శబ్ధ కాలుష్యానికి కారణం అవుతుందనేది ఆయన వాదన. ఈ మేరకు ఆయన విధించిన గడువు ముగియడంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదిలా ఉండగా.. ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాచోట్ల ఆజాన్ టైంలో స్పీకర్లు స్వచ్ఛందంగా బంద్ చేశారు. మసీదు ట్రస్టీలతో సమావేశాలు నిర్వహించిన పోలీసులు.. ఉదయం ప్రార్థనల సమయంలో లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను వాళ్లకు వివరించారు. దీంతో కళ్యాణ్ తో పాటు చాలా ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు మూగబోయాయి. ఈ క్రమంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు మసీదుల దగ్గరకు వెళ్లి.. లౌడ్స్పీకర్లు బంద్ కావడం గమనించి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగంతో రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేశారంటూ రాజ్‌థాక్రేపై ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు అందించిన పోలీసులు.. బుధవారం ఉదయం రాజ్‌థాక్రే ఇంటి వద్ద భారీగా మోహరించారు. థాక్రే వర్సెస్ థాక్రే మహారాష్ట్రలో స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. థాక్రే కుటుంబంలో రాజకీయ వైరం లౌడ్ స్పీకర్ల వ్యవహారంతో ముదురుతోంది. అధికార పార్టీ శివసేన, ఎంఎన్ఎస్ను బీజేపీ బీ టీంగా అభివర్ణిస్తోంది. హిందుత్వ ఓటు బ్యాంక్‌తో సేన ఓట్లను ఎంఎన్ఎస్ ద్వారా చీల్చే యత్నం చేస్తోందంటూ బీజేపీపై మండిపడుతోంది. చదవండి: 14 ఏళ్ల కిందటి కేసు.. రాజ్‌థాక్రేపై నాన్ బెయిలబుల్ వారెంట్ -
రేప్ చేస్తామని ట్వీట్లు.. పీఎస్‌లో నటి ఫిర్యాదు
ముంబై: 'అజాన్' గురించి ట్వీట్ చేసిన బాలీవుడ్ నటి-గాయని సుచిత్రా కృష్ణమూర్తి పట్ల సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆమె పట్ల కొందరు 'లైంగికంగా కించపరిచేలా' వ్యాఖ్యలు చేశారు. ఆమెను రేప్ చేస్తామని బెదిరించారు. తీవ్రస్థాయిలో వెల్లువెత్తిన 'లైంగిక వేధింపుల ట్వీట్ల'పై ఆమె పోలీసులను ఆశ్రయించారు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెల్లవారుజామునే చెవులు పగిలిపోయేలా 'అజాన్' పిలుపు ఇవ్వడాన్ని ఆమె ట్విట్టర్లో తప్పుబట్టారు. తన దేవుడిని గుర్తుచేసేందుకు ఇలా పబ్లిక్ లౌడ్స్పీకర్లు వాడాల్సిన అవసరం లేదని, ఇది బలవంతంగా మతాన్ని ప్రజలపై రుద్దడమేనని అన్నారు. ఆమె వ్యాఖ్యలను కొంతమంది ప్రశంసించగా.. మరికొంతమంది తప్పుబట్టారు. గతంలో బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ కూడా ఇదేవిధంగా ట్వీట్ చేసి సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని చవిచూశాడు. తాజాగా తనకు వచ్చిన లైంగిక బెదిరింపుల స్ర్కీన్షాట్లను కొన్నింటినీ ట్వీట్ చేసిన సుచిత్ర.. 'ఈ వికృత వ్యక్తులను చూడండి. నా దేశాన్ని చూస్తే జాలేస్తుంది. మహిళల పట్ల ఇలాంటి దృక్పథం ఉన్నప్పుడు ప్రపంచంలో మన దేశమే రేప్ రాజధానిగా ఉండటంలో ఆశ్చర్యమేముంది' అని పేర్కొన్నారు. -
‘అతడికి గుండు కొడితే 10 లక్షలిస్తా’
కోల్ కతా: ఆలయాలు, మసీదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ పై ఫత్వా జారీ అయింది. ఆయనకు గుండు కొడితే 10 లక్షల రూపాయలు ఇస్తానని కోల్ కతాకు చెందిన ముస్లిం మత గురువు ప్రకటించారు. సోనూ నిగమ్ కు వ్యతిరేకంగా ఈ నెల 21న ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు. ‘సోనూ నిగమ్ తల గొరిగి.. అతడి మెడలో పాత చెప్పుల దండ వేసి, దేశమంతా తిప్పిన వారికి వ్యక్తిగతంగా నేను 10 లక్షల రూపాయలు ఇస్తాన’ని పశ్చిమ బెంగాల్ మైనారిటీ యునైటెడ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సయిద్ షా అతిఫ్ అలీ ఆల్ ఖ్వాద్రి ప్రకటించారు. దీనిపై సోనూ నిగమ్ ట్విటర్ లో స్పందించారు. ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఉంటానని, ఎవరైనా వచ్చి తనకు గుండు చేయొచ్చనని ట్వీట్ చేశారు. మీడియాను కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. తన ట్వీట్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్టు నిరూపిస్తే ఎక్కడికి రమ్మని చెబితే అక్కడకు వచ్చి క్షమాపణ చెబుతానన్నారు. మసీదుల గురించే కాకుండా ఆలయాలు, గురుద్వారాలు గురించి కూడా ప్రస్తావించానని గుర్తు చేశారు. లౌడ్ స్పీకర్ల ద్వారా మసీదులు, గుళ్లు, హరిద్వారాలు చేసే ఉపన్యాసాలు, ప్రార్థన పిలుపులను ‘గూండాగిరీ’గా అభివర్ణిస్తూ సోనూ నిగమ్ ట్వీట్లు చేయడంతో వివాదం రేగింది.