B. S. Yeddyurappa
-
‘యెడ్డీ డైరీ’ కలకలం
సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గతంలో సీఎం పదవి కోసం బీజేపీ అగ్రనాయకులకు ముడుపులు ఇచ్చారంటూ తాజాగా ఎన్నికల వేళ బయటపడిన డైరీ కాగితాలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మార్మోగుతున్నాయి. ఇదంతా కాంగ్రెస్ కుట్ర అని యడ్యూరప్ప ఆరోపిస్తుంటే, ఈ విషయంపై లోక్‌పాల్‌తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ‘ద క్యారవాన్’ అనే మేగజీన్ ఈ సంచలన విషయాలను ‘యెడ్డీ డైరీస్’ శీర్షికన కథనంగా ప్రచురించింది. డైరీ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ నేతలంతా అవినీతిపరులేనని ఆరోపించారు. ‘బీజేపీలోని కాపలాదారులంతా దొంగలే’ అంటూ రాహులో ఓ ట్వీట్ చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ డైరీ అంశంపై లోక్‌పాల్ చేత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. యడ్యూరప్ప బీజేపీ పెద్దలకు లంచాలు ఇవ్వడం నిజమో, అబద్ధమో ప్రధాని చెప్పాలని కోరారు. 2017లో డైరీ దొరికితే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సరైన దర్యాప్తుæ జరగాలని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. శివకుమార్ ఇంట్లో దొరికాయి 2017లో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇంట్లో సోదాల సందర్భంగా ఈ డైరీ కాగితాలు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి దొరికినట్లు క్యారవాన్ పేర్కొంది. 2009లో కర్ణాటక సీఎం అయ్యేందుకు యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతల్లో ఎవరెవరికి లంచాలు ఇచ్చారో, అందుకోసం ఏయే ఎమ్మెల్యే దగ్గర ఆయనెంత తీసుకున్నారో ప్రస్తావిస్తూ యడ్యూరప్ప తన డైరీలో రాసుకున్నట్లుగా ఉందని కథనంలో క్యారవాన్ పేర్కొంది. కర్ణాటక బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజేను తాను కేరళలోని ఓ గుడిలో వివాహం చేసుకున్నట్లుగా కూడా ఆ డైరీలో యడ్యూరప్ప రాసినట్లు ఉందంది. నకిలీవి అయ్యుండొచ్చు: ఐటీ విభాగం ఈ కాగితాలపై ఐటీ విభాగం శుక్రవారం స్పందించింది. శివకుమార్ ఇంట్లో తమకు దొరికింది డైరీలోని కొన్ని పేపర్ల జిరాక్స్‌లు మాత్రమేనని స్పష్టం చేసింది. ఆ జిరాక్స్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో, వాటి ఒరిజినల్ కాగితాలు ఎక్కడ ఉన్నాయో తెలియదనీ, జిరాక్స్ కాగితాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్‌కు అప్పట్లోనే పంపినా ఒరిజినల్స్ లేనిదే జిరాక్స్‌లతో తామేమీ చెప్పలేమని ఫోరెన్సిక్ విభాగం చెప్పిందని ఐటీ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాము అప్పుడే యడ్యూరప్పను కూడా పిలిచి విచారించామనీ, ఆ డైరీ తాను రాసింది కాదనీ, అసలు తనకు డైరీ రాసే అలవాటే లేదని ఆయన చెప్పారంది. ఒరిజినల్ కాగితాలు ఎక్కడా లభించనందున ఆ జిరాక్స్‌లు నకిలీవి అయ్యుండొచ్చంది. ఆ డైరీ నిజం కాదు: యడ్యూరప్ప డైరీలో తాను రాసినట్లుగా చెబుతున్న విషయాలన్నీ అవాస్తవాలేనని యడ్యూరప్ప కొట్టిపారేశారు. బెంగళూరు డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలవి దివాలాకోరు రాజకీయాలని మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేసి లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ నేతలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆ డైరీలోని అంశాలు ఫోర్జరీ చేసినవీ, నకిలీవని ఐటీ అధికారులు నిర్ధారించినట్లు యడ్యూరప్ప చెప్పారు. కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ ఎదురుదాడి చేసింది. ఆ డైరీ నకిలీదని, డైరీ పేరిట కాంగ్రెస్ చేస్తున్నదంతా నాటకమని, అదంతా ఒక పథకం ప్రకారం సాగుతున్నదని ఆరోపించింది. డైరీలోని చేతిరాత, నకిలీ అని, అది యడ్యూరప్ప సంతకమే కాదని బీజేపీ స్పష్టం చేసింది. ఎవరెవరికి ఎంతెంత? క్యారవాన్ కథనం ప్రకారం ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ కేంద్ర కమిటీకి రూ. 1000 కోట్లు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రవాణా మంత్రి నితిన్ గడ్కరీలకు చెరో రూ. 150 కోట్లు, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రూ. 100 కోట్లు, బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలకు చెరో రూ. 50 కోట్లు లంచంగా ఇచ్చినట్లు యడ్యూరప్ప డైరీలో రాసుకున్నారు. పలువురు జడ్జీలకు రూ. 250 కోట్లు, న్యాయవాదులకు రూ. 50 కోట్లు ఇచ్చినట్లు రాసుకొచ్చారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల పేర్లను డైరీలో పేర్కొనలేదు. అలాగే గడ్కరీ కొడుకు వివాహ వేడుకలకు రూ. 10 కోట్లు ఖర్చు చేశానని డైరీలో యడ్యూరప్ప రాశారు. తాను ముఖ్యమంత్రి అవ్వడంలో రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని డైరీలో యడ్యూరప్ప రాశారు. ఆయన ఆర్థికంగా ఆదుకున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది ఆర్థిక సాయం చేశారని వారి పేర్లను వివరాలతో సహా రాసుకొచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలు నరేంద్ర స్వామి రూ. 20 కోట్లు, గోళిహట్టి శేఖర్ రూ. 10 కోట్లు, బాలచంద్ర జారకిహోళి రూ. 20 కోట్లు, డి.సుధాకర్ రూ. 20 కోట్లు, శివనగౌడ నాయక్ రూ. 20 కోట్లు, వెంకటరమణప్ప రూ. 20 కోట్లు, నారాయణ స్వామి రూ. 20 కోట్లు, ఆనంద్ అస్నోటికర్ రూ. 20 కోట్లు ఆర్థిక సాయం చేసినట్లు డైరీలో రాసి ఉంది. అయితే వీరంతా తాము ఎలాంటి సాయం చేయలేదని ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ వస్తున్నారు. -
ఆమె వల్లే సమస్యలన్నీ.. ఏదో ఒకటి చేయాలి
శోభను కట్టడి చేయాలి మురళీధర్రావ్కు అసంతృప్తుల ఫిర్యాదు! సాక్షి, బెంగళూరు: కర్ణాటక బీజేపీలో ఇటీవల ఏర్పడిన అనైక్యతకు సీనియర్ నాయకురాలు, ఎంపీ శోభా కరంద్లాజే కారణమని అసంతృప్త నాయకులు పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మురళీధర్రావ్కు ఫిర్యాదు చేశారు. ఆమెను కట్టడి చేస్తే అంతా సర్దుకుంటుందని చెప్పినట్లు సమాచారం. బీజేపీ సీనియర్ నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప నాయకత్వంలో కొంతమంది యడ్యూరప్ప పై తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హై కమాండ్ సూచన మేరకు మురళీధర్‌రావు సదరు అసంతృప్త నేతలతో శనివారం ఉదయం ఏడుగంటల నుంచి దాదాపు మూడు గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కే.ఎస్ ఈశ్వరప్ప, మాజీ మంత్రి సొగడు శివణ్ణ, మాజీ ఎమ్మెల్సీ భానుప్రకాశ్‌తో సహా 24 మంది అసంతృప్తులు పాల్గొన్నారు. ‘యడ్యూరప్పే మా నాయకుడు. ఆయన మార్గదర్శంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లడానికి మాకు ఎటుంవంటి అభ్యంతరం లేదు. అయితే పార్టీ కార్యక్రమాలు, ముఖ్యమైన నిర్ణయాల్లో శోభ కరంద్లాజే అనవసర జోక్యం చేసుకుంటున్నారు. యడ్యూరప్ప కూడా ఆమెకే పెద్దపీట వేయడం వల్ల పార్టీ పటిష్టత కోసం మొదటి నుంచి కృషి చేసిన వారికి సరైన స్థానం దక్కడం లేదు. ఆమెను అదుపు చేస్తే పార్టీలో సమస్యలు సర్దుకుంటాయి’ అని చెప్పడమే కాకుండా ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా అందజేసినట్లు తెలుస్తోంది. బహిరంగ విమర్శలు వద్దన్న రావ్ అందరి మాటలు విన్న మురళీధర్‌రావ్ త్వరలోనే తాను అటు వైపు నాయకులతో కూడా మాట్లాడతానని అయితే ఇక పై ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ వేదికపై యడ్యూరప్పకు, పార్టీకి విరుద్ధంగా విమర్శలు చేయకూడదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అతిక్రమిస్తే కఠిన చర్యలకు పార్టీ వెనుకాడబోదని తేల్చిచెప్పారు. 2018 ఎన్నికలయ్యే వరకూ ఏ విషయాలనైనా పార్టీ లోపలే చర్చించాలని బీజేపీ అధినేత అమిత్‌షా హెచ్చరికగా మురళీధర్‌రావ్ అసంతృప్తులకు తెలిపారు. తాము ఇక పై బహిరంగంగా విమర్శలు చేయబోమని అసంతృప్తులు ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
హంతకులను వారంలోపు అరెస్ట్ చేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప బొమ్మనహళ్లి (బెంగళూరు): ఆర్ఎస్ఎస్ కార్యకర్త రుద్రేష్ హంతకులను వారం రోజుల్లోగా అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇస్తామని బీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపడటంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. బెంగళూరు నగరంతో పాటు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు భద్రత కొరవడిందన్నారు. చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయని, హంతకులు చెలరేగి పోతున్నారన్నారు. కేవలం చేతులు తడిపేవారికే సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. సిద్దరామయ్య అసలు రంగు త్వరలో బయటపడుతుందని బీఎస్‌వై.హెచ్చరించారు. నిరు పేద ప్రజలు చనిపోతే వారి అంత్య క్రియలకు రూ.5 వేలు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. అయితే స్టీల్ వంతెన నిర్మాణానికి మాత్రం రూ. 1700 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని అన్నారు. స్టీల్ వంతెన పనులు నిలిపి వేయాలని, లేని పక్షంలో ఉద్యమబాట పడుతామని ఆయన హెచ్చరించారు. -
మర్మమేమిటో?
గవర్నర్‌తో యడ్డి భేటీ ‘అర్కావతి డీ నోటిఫికేషన్’పై చర్చ? ముఖ్యమంత్రి సిద్ధును కోర్టుకీడ్చాలని వ్యూహం ! సీఎం ప్రాసిక్యూట్‌కు అనుమతి కోసమేఈసమావేశమా యడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే ముప్పుతిప్పులు పెట్టిన కాంగ్రెస్ నేడు అదే ఆయుధాన్ని ప్రయోగించనున్న బీజేపీ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప గురువారం రాజ్ భవన్లో గవర్నర్ వజూభాయ్ వాలాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన డీనోటిఫికేషన్లు, ముఖ్యంగా అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోర్టుకీడ్చాలని ప్రతిపక్ష బీజేపీ తహతహలాడుతోంది. ఆయనను ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా కేసుల్లో ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఎవరైనా సరే, అడిగిందే తడవుగా అప్పటి గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ తలూపేవారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు ఇప్పుడు అదే ఆయుధంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పులు పెట్టడానికి బీజేపీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప గవర్నర్‌తో సుమారు 40 నిమిషాల పాటు భేటీ కావడం ఆసక్తిని రేకెత్తించింది. వీరి మధ్య చర్చలో అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గత వారం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్లు గవర్నర్‌ను రహస్యంగా కలుసుకున్నారు. ఈ విషయం బట్ట బయలు కావడంతో ‘కొత్త గవర్నర్ కనుక మర్యాద పూర్వకంగా కలుసుకున్నాం’ అని వివరణ ఇచ్చారు. అర్కావతి డీనోటిఫికేషన్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని శెట్టర్ శాసన సభ లోపల, బయట అనేక సార్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు తన వంతుగా యడ్యూరప్ప ఆ పనిలో పడ్డారు. డీనోటిఫికేషన్‌పై న్యాయ పోరాటానికి దిగితే, సీఎంను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా యడ్యూరప్పతో పాటు గతంలో శెట్టర్ కూడా గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది. మర్యాద పూర్వకమే... గవర్నర్‌ను తాను కలుసుకోవడంలో విశేషమేమీ లేదని యడ్యూరప్ప తెలిపారు. దీనిపై తనతో మాట్లాడిన విలేకరులకు వివరణ ఇస్తూ, ‘గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కలుసుకోలేదు. ఈ రోజు అపాయింట్మెంట్ ఖరారైంది. కొన్ని విషయాలపై ఆయనతో మాట్లాడాను. సహజంగానే రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి’ అని తెలిపారు. అనంతరం యడ్యూరప్ప ఢిల్లీకి వెళ్లారు. -
అప్ప హ్యాపీ!
శివమొగ్గ, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గ నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గెలుపు ఖాయమని గూఢచార విభాగం ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. సుమారు 40 వేల నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందడం ఖాయమని తేల్చింది. మరో ఏజెన్సీ కూడా యడ్యూరప్ప విజయాన్ని ఖరారు చేసింది. 2009 ఎన్నికల్లో ఆయన కుమారుడు రాఘవేంద్ర 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారని, ఈసారి యడ్యూరప్పకు కూడా ఇంచు మించుగా అంతే మెజారిటీ లభించవచ్చని అంచనా వేసినట్లు తెలుస్తోంది. నటుడు శివ రాజ్ కుమార్ సతీమణి గీతా జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో పోటీ హోరాహోరీగా ఉంటుందని అందరూ ముందే భావించారు. ఎన్నికలకు నెల రోజుల ముందు గూఢచార విభాగం యడ్యూరప్ప గెలవడం కష్టమని పేర్కొన్నట్లు తెలిసింది. పోలింగ్ అనంతరం ఆయనకు విజయావకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంచనా వేసింది. నరేంద్ర మోడీ ప్రభావం, నిర్దుష్ట సామాజిక వర్గాల మద్దతు, సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ ఏకతాటిపై నడవడం లాంటి అంశాలు యడ్యూరప్ప విజయానికి దోహద పడ్డాయని గూఢచార విభాగం విశ్లేషించినట్లు సమాచారం. గీతా శివ రాజ్ కుమార్ రెండో స్థానం, కాంగ్రెస్ అభ్యర్థి మంజునాథ్ భండారీ మూడో స్థానంతో తృప్తి పడాల్సి ఉంటుందని పేర్కొంది. -
బీజేపీలోకి యడ్డి రాకపై త్వరలో నిర్ణయం
= ఢిల్లీలో గడ్కరీ వెల్లడి = కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టాలి = యడ్డి అనుయాయుల్లో నూతనోత్సాహం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను తిరిగి బీజేపీలోకి తీసుకు రావాల్సిన ఆగత్యం ఏర్పడిందని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టాల్సిన ప్రస్తుత తరుణంలో యడ్యూరప్ప విషయమై అధిష్టానం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాగా యడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానించే విషయమై ఆయన అనుయాయులు తీవ్రంగా మదనపడుతున్నారు. బీజేపీ నుంచి సరైన ఆహ్వానం అందకపోవడంతో ఒకానొక దశలో యడ్యూరప్ప లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. అంతకు ముందు నరేంద్ర మోడీ ప్రధాని కావాలన్నది తన ఆకాంక్ష అంటూ, బీజేపీతో సీట్ల సర్దుబాటులో భాగంగా ఎనిమిది స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. గత ఆదివారం నగరంలో మోడీ సభ జరిగినప్పుడు బీజేపీలోని యడ్యూరప్ప అనుయాయులకు చేదు అనుభవం ఎదురైంది. వారినెవరూ పెద్దగా పట్టించుకోలేదు. వేదికపైకి ఎవరినీ ఆహ్వానించ లేదు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న శాసన సభ ఎన్నికల అనంతరం ఢిల్లీకి వెళ్లి, అధిష్టానంతో చర్చలు జరపాలని యడ్యూరప్ప వర్గీయులు నిర్ణయించారు. బీజేపీలోకి యడ్యూరప్పను తీసుకు రాకపోతే పార్టీలో తమకు తీరని అన్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వారిలో ఉత్సాహాన్ని నింపాయి. యడ్యూరప్పకు ఈడీ నోటీసు ఈ పరిణామ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) యడ్యూరప్పకు శనివారం నోటీసులు జారీ చేసింది. నగరంలోని రాచేనహళ్లిలో జరిగిన డీనోటిఫికేషన్ వ్యవహారంలో యడ్యూరప్ప కుటుంబానికి ముడుపులు ముట్టాయనే ఆరోపణపై కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. డీనోటిఫికేషన్ సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోని ప్రేరణ ట్రస్టుకు ముడుపులు ముట్టాయని ఆరోపణలు వచ్చాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.40 కోట్ల నష్టం వాటిల్లిందని, ఆ మేరకు మీ ఆస్తులను ఎందుకు జప్తు చేయకూడదని ప్రశ్నిస్తూ ఈడీ నోటీసులిచ్చింది.