Baba phasiyuddin
-
దటీజ్ ‘బాబా’..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపై నిలిచిన నీటి తొలగింపు చర్యల్లో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎమర్జెన్సీ టీమ్‌తో కలిసి ఆయన అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు సిబ్బందితో కలిసి రోడ్లపై నీటిని తొలగించే వరకు పనుల్ని పర్యవేక్షించారు. -
ప్రజా భాగస్వామ్యంతో నగరాభివృద్ధి
మీడియాతో జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ♦ సమస్యలన్నీ తెలుసుకున్నాక భావి కార్యాచరణ ♦ కేసీఆర్ ప్రణాళిక.. కేటీఆర్ డెరైక్షన్‌లో పనిచేస్తాం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో 50 ఏళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారం ప్రజల భాగస్వామ్యం లేనిదే సాధ్యం కాదని జీహెచ్ఎంసీ నూతన మేయర్ బొంతు రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. నగరవాసులు కాలనీలు, బస్తీలవారీగా సంఘాలుగా ఏర్పడి వాటి పరిష్కారానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హైదరాబాద్ నగర పరిస్థితులపై అధికారులతో సమీక్షించాక తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మేయర్ రామ్మోహన్ చెప్పారు. సమస్యల స్థాయిని బట్టి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలతో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అందరి సహకారముంటే అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయవచ్చన్నారు. జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న రూ.5 భోజనం బాగుందని... ప్రస్తుతం 51 కేంద్రాల్లో కొనసాగుతున్న దీనిని 150 కేంద్రాల దాకా పెంచే యోచన ఉందని తెలిపారు. తొలి పని, తొలి సంతకం వంటివి తనకు పట్టవని, ఎప్పుడు ఏది అవసరమైతే అది చేస్తానని రామ్మోహన్ పేర్కొన్నారు. జీహెచ్ఎసీ జనరల్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని పదిహేను, ఇరవై రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎక్కడ తగ్గాలో తెలుసు.. తెలంగాణ కోసం ఓపికతో వేచి చూసిన తమకు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో తెలుసని రామ్మోహన్ వ్యాఖ్యానించారు. విశ్వనగరానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని.. మంత్రి కేటీఆర్ డెరైక్షన్‌లో వాటి వేగం పెరిగేందుకు తమవంతు కృషి చేస్తామని చెప్పారు. అందుకు ప్రజల భాగస్వామ్యం, సహకారం అవసరమన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి నీళ్లు వచ్చినా... ఇంకా అనేక ప్రాంతాల్లో నీటి సమస్య ఉందని, వంద రూపాయల కూలీ వచ్చేవారు కూడా నీటి కోసమే రూ.30 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నై, ముంబై తదితర నగరాలతో పోలిస్తే మన దగ్గర ట్రాఫిక్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, మరింత మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. నగరం చుట్టూ ఏర్పాటు కానున్న 12 మినీ నగరాల (శాటిలైట్ టౌన్‌షిప్స్)తో ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందన్నారు. కలసి ముందుకు సాగుదాం ఉద్యమంలో పనిచేసిన తమకు అతిపెద్ద బాధ్యతలు ఇచ్చారని డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో గల్లీల నుంచి చౌరస్తాల దాకా, పాతబస్తీ నుంచి కొత్త సిటీ దాకా అంతటా సమస్యలు ఉన్నాయని... వాటిని పరిష్కరించేందుకు, అభివృద్ధిపథంలో పయనించేందుకు అందరి సహకారంతో కృషిచే స్తామని చెప్పారు. అందరం కలసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కాగా మీడియాతో మాట్లాడడానికి ముందే బాధ్యతలు చేపట్టిన మేయర్, డిప్యూటీ మేయర్.. జీహెచ్ఎంసీ దగ్గరి రూ.5 భోజన కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ భోజనం చేసి, ఇంటి భోజనంలా బాగుందని ప్రశంసించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన మేయర్, డిప్యూటీ మేయర్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసానిలలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అభినందించారు. సామాన్యులకు పెద్ద బాధ్యతలు కేసీఆర్, కేటీఆర్‌కు తమ గురించి తెలుసుగనకే ఈ బాధ్యతలు అప్పగించారని రామ్మోహన్ పేర్కొన్నా రు. అతి సామాన్య కార్యకర్తలమైన తమకు పెద్ద నగర పగ్గాలను అప్పగించడం సామాన్య విషయం కాదన్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో తమ కూ అవకాశం కల్పించారన్నారు. ఒక్కరాత్రిలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే భ్రమ లు కానీ, అలాంటి విధానాలుగానీ తమకు లేవన్నారు. -
ఎన్నిక ఏకగ్రీవం
* జీహెచ్ఎంసీ మేయర్‌గా బొంతు రామ్మోహన్ * డిప్యూటీ మేయర్‌గా ఫసియుద్దీన్ సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఉదయం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం.. ఆ వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌కు వీరిద్దరు తప్ప వేరెవరూ పోటీలో లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రకటించారు. వారిద్దరికీ ఎంఐఎం కూడా మద్దతు ప్రకటించింది. దాన్ని కూడా అధికారులు రికార్డు చేశారు. కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమం అరగంట లోపే పూర్తయింది. తొలుత ప్రమాణం.. తర్వాత ఎన్నిక ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 11.10 నిమిషాలకు సమావేశానికి సరపడా కోరం ఉన్నట్లు ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం నాలుగు భాషల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత తెలుగులో అనంతరం ఉర్దూ, హిందీ, ఇంగ్లిషుల్లో ప్రమాణం చేయాలనుకున్న వారితో ప్రమాణం చేయించారు. కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు మొత్తం 217 మంది ఉండగా, 109 మందికి పైగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాక కోరం ఉన్నట్లు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం ముగిశాక తొలుత మేయర్ ఎన్నిక నిర్వహించారు. మేయర్‌గా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ పేరును వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ప్రతిపాదించగా, మీర్‌పేట హెచ్‌బీకాలనీ డివిజన్ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య బలపరిచారు. మేయర్ పదవికి ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో రామ్మోహ న్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. తర్వాత డిప్యూటీ మేయర్‌గా బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పేరును అమీర్‌పేట కార్పొరేటర్ శేషుకుమారి ప్రతిపాదించగా, రామ్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. వెంటనే అహ్మద్‌నగర్ కార్పొరేటర్ అయేషా రూబినా(ఎంఐఎం) లేచి.. మేయర్, డిప్యూటీ మేయర్లకు తమ పార్టీ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె లేవగానే తొలుత పోటీకి వేరే పేరు ప్రతిపాదిస్తారేమోనని కొందరు భావించారు. కానీ తాము కూడా మద్దతిస్తున్నట్లు చెప్పడంతో అధికారులు దాన్ని రికార్డు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన రామ్మోహన్, ఫసియుద్దీన్లకు ప్రిసైడింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.44 మంది ఎక్స్ అఫీషియోలు హాజరు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమానికి మొత్తం 150 మంది కార్పొరేటర్లు హాజరుకాగా 67 మంది ఎక్స్అఫీషియో సభ్యులకుగాను 44 మంది మాత్రమే హాజరయ్యారు. లోక్‌సభ ఎంపీల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులెవరూ రాలేదు. 26 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఎక్స్ అఫీషియో సభ్యులెవరూ రాలేదు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తలసాని తదితరులు హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకులు అశోక్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, అదనపు కమిషనర్ (ఎన్నికలు) సురేంద్రమోహన్ ఇతర అధికారులు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్‌ను కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అభినందించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్ ప్రొఫైల్ పేరు: బొంతు రామ్మోహన్ (42) తండ్రి: బొంతు వెంకటయ్య భార్య: శ్రీదేవి; కుమార్తెలు: కుజిత, ఉషశ్రీ విద్యార్హతలు: ఎంఏ, ఎల్ఎల్బీ రాజకీయ అరంగేట్రం: 2001, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి.. నిర్వహించిన పదవులు, నేపథ్యం: టీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఓయూ విద్యార్థి సంఘం నాయకుడిగా గుర్తింపు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు సన్నిహితుడిగా పేరుంది. డిప్యూటీ మేయర్ ప్రొఫైల్ పేరు: బాబా ఫసియుద్దీన్(34) విద్య: బీకాం భార్య: హబీబా సుల్తానా పిల్లలు: కుమార్తె, కుమారుడు తండ్రి: బాబా షరీఫుద్దీన్ తల్లి: రజియా ఫాతిమా రాజకీయ అనుభవం: 2001లో టీఆర్ఎస్లో చేరిన బాబా పార్టీ విద్యార్థి విభాగం గ్రేటర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. -
ఉద్యమ నేతలకు మహా కిరీటం
మేయర్‌గా బొంతు రామ్మోహన్ డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ కొలువుదీరిన కొత్త పాలక మండలి తెలంగాణ ఉద్యమాన్ని కదం తొక్కించిన ఇద్దరు నేతలకు ‘మహా’ అవకాశం. ఒకరికి మేయర్‌గా... మరొకరికి డిప్యూటీ మేయర్‌గా పట్టాభిషేకం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అపూర్వ బహుమానం.మేయర్ బొంతు రామ్మోహన్... డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్... ఇద్దరిదీ ఉద్యమ నేపథ్యమే. టీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా రామ్మోహన్ పని చేశారు. ఓయూ విద్యార్థి సంఘ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక ఫసియుద్దీన్ గతంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం గ్రేటర్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ 25వ మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణ రాష్ట్రంలో తొలి మేయర్‌గా ఆయన గుర్తింపు పొందారు. 26వ డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి కానీ, ఇతర అభ్యర్థుల నుంచి కానీ నామినేషన్లు రాకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఇద్దరు యువకులు.. రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలుపొంది... ఏకగ్రీవంగా మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నిక వడం విశేషం. వీరి ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీలోనూ అభ్యంతరాలు రాకపోవడమే కాక... నిజమైన ఉద్యమ వీరులకు సముచిత స్థానం లభించిందని పలువురు అభివర్ణించారు. నేడు బాధ్యతల స్వీకరణ జీహెచ్ఎంసీ నూతన మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బాధ్యతలు చేపడతారు. ముగిసిన స్పెషలాఫీసర్ పాలన.. జీహెచ్ఎంసీలో స్పెషలాఫీసర్ పాలన ముగిసింది. గత పాలక మండలి గడువు 2014 డిసెంబర్ 3తో ముగియగా...ఆ మరుసటి రోజు (4న) నుంచి స్పెషలాఫీసర్ పాలన అమల్లోకి వచ్చింది. స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ గత అక్టోబర్ 30న బదిలీ అయ్యారు. అక్టోబర్ 31న బాధ్యతలు చేపట్టిన డా.బి.జనార్దన్‌రెడ్డి కమిషనర్‌గా, స్పెషలాఫీసర్‌గా కొనసాగుతున్నారు. కొత్త పాలకమండలి రావడంతో ఇకపై ఆయన కమిషనర్‌గానే కొనసాగనున్నారు.