ఉద్యమ నేతలకు మహా కిరీటం
మేయర్‌గా బొంతు రామ్మోహన్
డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్
కొలువుదీరిన కొత్త పాలక మండలి
తెలంగాణ ఉద్యమాన్ని కదం తొక్కించిన ఇద్దరు నేతలకు ‘మహా’ అవకాశం. ఒకరికి మేయర్‌గా... మరొకరికి డిప్యూటీ మేయర్‌గా పట్టాభిషేకం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అపూర్వ బహుమానం.మేయర్ బొంతు రామ్మోహన్... డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్... ఇద్దరిదీ ఉద్యమ నేపథ్యమే. టీఆర్‌ఎస్ విద్యార్థి, యువజన విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా రామ్మోహన్ పని చేశారు. ఓయూ విద్యార్థి సంఘ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక ఫసియుద్దీన్ గతంలో టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం గ్రేటర్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ 25వ మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణ రాష్ట్రంలో తొలి మేయర్‌గా ఆయన గుర్తింపు పొందారు. 26వ డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి కానీ, ఇతర అభ్యర్థుల నుంచి కానీ నామినేషన్లు రాకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఇద్దరు యువకులు.. రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలుపొంది... ఏకగ్రీవంగా మేయర్, డిప్యూటీ మేయర్‌లుగా ఎన్నిక వడం విశేషం. వీరి ఎన్నికపై టీఆర్‌ఎస్ పార్టీలోనూ అభ్యంతరాలు రాకపోవడమే కాక... నిజమైన ఉద్యమ వీరులకు సముచిత స్థానం లభించిందని పలువురు అభివర్ణించారు.
నేడు బాధ్యతల స్వీకరణ
జీహెచ్‌ఎంసీ నూతన మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బాధ్యతలు చేపడతారు.
ముగిసిన స్పెషలాఫీసర్ పాలన..
జీహెచ్‌ఎంసీలో స్పెషలాఫీసర్ పాలన ముగిసింది. గత పాలక మండలి గడువు 2014 డిసెంబర్ 3తో ముగియగా...ఆ మరుసటి రోజు (4న) నుంచి స్పెషలాఫీసర్ పాలన అమల్లోకి వచ్చింది. స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ గత అక్టోబర్ 30న బదిలీ అయ్యారు. అక్టోబర్ 31న బాధ్యతలు చేపట్టిన డా.బి.జనార్దన్‌రెడ్డి కమిషనర్‌గా, స్పెషలాఫీసర్‌గా కొనసాగుతున్నారు. కొత్త పాలకమండలి రావడంతో ఇకపై ఆయన కమిషనర్‌గానే కొనసాగనున్నారు.