బోయకొండలో చోరీ
⇒ హుండీలో నగదు కాజేసిన దుండగుడు
⇒ ఇనుప చువ్వ సాయంతో నోట్లు వెలికితీత
⇒ సీసీ కెమెరాలకు పట్టుబడిన వైనం
⇒ ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది తొలగింపు
బోయకొండ(చౌడేపల్లె): బోయకొండ గంగమ్మ ఆలయంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు చోరీ జరిగింది. పట్టపగలు ఒక వ్యక్తి ఇనుప చువ్వకు బబుల్గం అతికించి నోట్లు చోరీ చేశాడు. హుండీ అడుగు భాగాన వేసిన గోనె సంచి పైకి వచ్చి ఉండడంతో అనుమానం వచ్చిన ఆలయ ఈవో ఏకాంబరం, ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డితో కలిసి మంగళవారం సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో హుండీలో నుంచి నోట్లు వెలికి తీస్తున్న దృశ్యం కనిపించడంతో రాత్రి విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పిలిపించి మాట్లాడారు.
ఘటన ఇలా జరిగింది..
సోమవారం ఉదయం 6.13 గంటలకు నల్లటి కోటు, తెల్లటి ప్యాంటు, తలకు క్యాప్ ధరించి ఓ వ్యక్తి ఆలయంలోకి వచ్చాడు. ఇనుప చువ్వకు బబుల్గం అతికించి, టార్చిలైటు సహాయంతో ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో నోట్లు బయటకు తీసి ప్యాంటు జేబులో పెడుతున్న దృశ్యం సీసీ కెమెరాలో బయటపడింది. గంటపాటు ఆ వ్యక్తి దర్జాగా నోట్లు వెలికితీస్తున్న ఫుటేజీలను పరిశీలించి అధికారులు, పాలకవర్గ సభ్యులు అవాక్కయ్యారు.
సెక్యూరిటీపైనే అనుమానం..
ఆలయంలో 12 మంది సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు. రెండు బ్యాచ్‌లుగా రోజు మార్చి రోజు విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం గుర్రప్ప, శ్రీనాథరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సహదేవ, రమణ, రాజేంద్ర విధులకు హాజరైనట్లు రికార్డుల్లో ఉంది. వీరు సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం అర్చకులు, అధికారులు వచ్చే వరకు విధుల్లో ఉండాల్సి ఉంది. మిగిలిన ఐదుగురు వెళ్లిపోగా ఒక వ్యక్తి మాత్రమే ఆ సమయం వరకు అక్కడ విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారు ఎక్కడికెళ్లారనే అనుమానాలూ ఉన్నాయి. ఆలయ సెక్యూరిటీని ఔట్‌పోస్టులోని ఇన్చార్జి పర్యవేక్షించాల్సి ఉన్నా ఆ మేరకు ఎలాంటి ప్రయత్నమూ జరిగిన దాఖలాలు లేవు.
ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది తొలగింపు..
బోయకొండ ఆలయంలో సోమవారం విధులకు హాజరైన ఆరుగురు సెక్యూరిటీ సిబ్బందిని తొలగిస్తున్నట్లు ఈవో ఏకాంబరం మంగళవారం తెలిపారు. చోరీ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈనెల ఐదో తేదీన హుండీ లెక్కింపులో రూ.38లక్షలు ఆదాయం వచ్చిందని తెలిపారు. గడిచిన 10 రోజులకు సంబంధించి హుండీలో లక్షల్లోనే డబ్బు ఉండి ఉంటుందని, ఇందులో ఏ మేరకు నగదు అపహరించారనే విషయం తెలియాల్సి ఉందని అన్నారు.