పండంటి బిడ్డ.. రూ. 50 వేలకు వేలం!
బిడ్డను పోషించలేక అమ్ముకునే తల్లిదండ్రులను చూశాం. కానీ తల్లికి మాయమాటలు చెప్పి ఒక రోజు వయసున్న శిశువును అమ్ముకున్న ఓ డాక్టర్‌ను మొదటిసారి చూస్తున్నాం. అందులోనూ బిడ్డను వేలంపాట ద్వారా అమ్మడం మరీ దారుణం. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.
డాక్టర్ జితేంద్ర చౌదరి ఆస్పత్రిలో ఓ అవివాహిత ప్రసవం కోసం చేరింది. సోమవారం పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ యువతికి పెళ్లి కాలేదని తెలుసుకున్న డాక్టర్, బయటి ప్రపంచంలో పెళ్లి కాకుండా పుట్టిన బిడ్డను పోషించడం చాలా కష్టమని చెప్పారు. సమాజం తల్లీబిడ్డలను కుళ్లబొడిచి చంపుతుందుని హితవు చెప్పారు. తనకు అప్పగించి వెళ్లిపోతే పిల్లలు లేని వారికి దత్తతకు ఇస్తానని మాయమాటలు చెప్పారు. ఇదంతా తమ మంచి కోసమే చెబుతున్నారనుకొని ఆ తల్లి, డాక్టర్ మాటలకు బుట్టలో పడింది. చివరిసారి తన బిడ్డను ముద్దాడి, డాక్టర్‌కు అప్పగించి ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది ఆ పిచ్చి తల్లి.
డాక్టర్ జితేంద్ర చౌదరి మంగళవారం నాడు తన ఆస్పత్రి నుంచి ఎవరెవరికో ఫోన్లు చేసి బిడ్డను కావాలనుకొనే దంపతులను ఆస్పత్రికి రప్పించారు. రెండు రోజుల ఆ శిశువును ఓ పేపర్లో చుట్టి దంపతుల ముందు వేలంపాట పెట్టారు. ఆరేడు వేల రూపాయల నుంచి మొదలైన ఆ వేలంపాట చివరకు రూ. 50 వేల వరకు వెళ్లింది. ఆ సొమ్ము ముట్టజెప్పిన దంపతులకు బిడ్డను అమ్మేశారు.
ఎలాగైనా బిడ్డను కొనుక్కోవాలని వచ్చి, వేలంపాటలో అంత ధర పెట్టి కొనుక్కోలేక నిరాశతో కలీమ్ అహ్మద్ అనే వ్యక్తి సార్వత్లోని తన ఇంటికెళ్లి పోయారు. ఆ రాత్రంతా మధనపడిన అహ్మద్ తర్వాతిరోజు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఆ బిడ్డను దక్కించుకోవడం కోసం రూ. 20 వేలతో చౌదరి ఆస్పత్రికి వెళ్లానని, అంతకుమించి కొనే స్థోమత తనకు లేదని అహ్మద్ తెలిపారు. నిజమైన డాక్టరైతే ఇలాగా వ్యవహరిస్తారా అన్న అనుమానంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అహ్మద్ వివరించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి డాక్టర్ చౌదరిని అరెస్టు చేశారు. వేలంలో బిడ్డను కొనుక్కున్న దంపతుల నుంచి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. మీరట్ రోడ్డులోని ఓ ఆస్పత్రిలో బిడ్డను చేర్చి, పోలీసు భద్రతను కల్పించారు.