Bahrain Grand Prix
-
వెర్స్టాపెన్ షో షురూ
బహ్రెయిన్: వరుసగా గత మూడు సీజన్ల పాటు ఫార్ములా వన్ సర్క్యూట్‌ను శాసించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ కొత్త సీజన్‌ను మళ్లీ అదే జోరుతో మొదలు పెట్టాడు. 2024లో తొలి ఎఫ్1 రేస్ అయిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. సమీప ప్రత్యర్థికంటే ఏకంగా 22.457 సెకన్ల తేడాతో రేస్‌ను ముగించడం అతని ఆధిపత్యాన్ని చూపిస్తోంది. శనివారం జరిగిన రేస్‌ను వెర్స్టాపెన్ 1 గంటా 31 నిమిషాల 44.472 సెకన్లలో పూర్తి చేశాడు. రెడ్‌బుల్‌కే చెందిన సెర్గియో పెరెజ్ రెండో స్థానంలో నిలవగా, ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్కి మూడో స్థానం దక్కింది. స్టార్ మెర్సిడెజ్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వెర్స్టాపెన్ అంచనాలను అందుకున్నాడు. 57 ల్యాప్‌లు అన్నింటిలో ముందంజలో నిలిచిన అతను తన కెరీర్లో 55వ విజయాన్ని అందుకున్నాడు. సీజన్లో రెండో రేసు ఈ నెల 9న సౌదీ అరేబియాలో జరుగుతుంది. -
Formula One: రయ్..రయ్...రయ్...
సాఖిర్: గత ఏడాది పూర్తి ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టు అదే జోరును ఈ ఏడాదీ కొనసాగించాలనే లక్ష్యంతో ఫార్ములావన్ (ఎఫ్1) 2024 సీజన్లో బరిలోకి దిగనుంది. మొత్తం 24 రేసులతో కూడిన ఈ సీజన్‌కు నేడు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసుతో తెర లేవనుంది. శనివారం క్వాలిఫయింగ్ సెషన్... ఆదివారం ప్రధాన రేసు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 9:30 నుంచి క్వాలిఫయింగ్ సెషన్‌ను... ఆదివారం రాత్రి 8:30 నుంచి ప్రధాన రేసును నిర్వహిస్తారు. ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ఎఫ్1 రేసుల ప్రత్యక్ష ప్రసారం ఉంది. గత సీజన్లో మొత్తం 22 రేసులు జరగ్గా... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు వెర్స్టాపెన్ 19 రేసుల్లో, సెర్జియో పెరెజ్ 2 రేసుల్లో గెలిచారు. మరో రేసులో ఫెరారీ జట్టుకు చెందిన కార్లోస్ సెయింజ్ నెగ్గాడు. కొత్త సీజన్లో రెడ్‌బుల్ జట్టుతోపాటు వెర్స్టాపెన్ ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
బొటాస్‌కు తొలి ‘పోల్ పొజిషన్’
నేడు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి మనామా: అందరి అంచనాలను తారుమారు చేస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 28.769 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 14వ, 18వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. గ్రిడ్ పొజిషన్స్: 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. రికియార్డో (రెడ్‌బుల్), 5. రైకోనెన్ (ఫెరారీ), 6. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 7. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 8. మసా (విలియమ్స్), 9. గ్రోస్యెన్ (హాస్), 10. పాల్మెర్ (రెనౌ), 11. క్వియాట్ (ఎస్టీఆర్), 12. లాన్స్ స్ట్రోల్ (విలియమ్స్), 13. వెర్లీన్ (సాబెర్), 14. ఒకాన్ (ఫోర్స్ ఇండియా), 15. అలోన్సో (మెక్లారెన్), 16. సెయింజ్ (ఎస్టీఆర్), 17. వాన్డూర్నీ (మెక్లారెన్), 18. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 19. ఎరిక్సన్ (సాబెర్), 20. మాగ్నుసెన్ (హాస్). -
దుమ్మురేపిన హామిల్టన్
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి సొంతం ‘ఫోర్స్ ఇండియా’ పోడియం ఫినిష్ సెర్గియో పెరెజ్‌కు మూడో స్థానం మనామా: ‘పోల్ పొజిషన్’ లభించకపోయినా ప్రధాన రేసులో దుమ్మురేపిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సీజన్లో రెండో టైటిల్ సాధించాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల రేసును హామిల్టన్ గంటా 39 నిమిషాల 42.743 సెకన్లలో పూర్తి చేశాడు. ఇక ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటివరకు సీజన్‌లోని మూడు రేసుల్లో మెర్సిడెస్ డ్రైవర్లే నెగ్గడం విశేషం.భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది. ‘ఫోర్స్ ఇండియా’కు చెందిన డ్రైవర్లు టాప్-5లో నిలువడం విశేషం. సెర్గియో పెరెజ్ మూడో స్థానాన్ని సంపాదించి పోడియంపై నిలువగా... మరో డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానాన్ని పొందాడు. 2009లో యూరోప్ గ్రాండ్‌ప్రి రేసులో ఫిషిచెల్లా రెండో స్థానం పొందిన తర్వాత ఫోర్స్ ఇండియా జట్టుకు చెందిన మరో డ్రైవర్ టాప్-3లో నిలువడం ఇదే ప్రథమం. తొలి రెండు రేసుల్లో ఏడుగురు చొప్పున డ్రైవర్లు రేసును ముగించడంలో విఫలంకాగా... ఈసారి ఐదుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. గతేడాది విజేత సెబాస్టియన్ వెటెల్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు చైనా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 20న జరుగుతుంది. -
రోస్బర్గ్కు పోల్ పొజిషన్
మెర్సిడెస్వే తొలి రెండు గ్రిడ్లు వెటెల్‌కు నిరాశ నేడు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి మనామా: తొలి రెండు రేసుల్లో దక్కిన విజయాలతో మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు మూడో రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలోనూ దుమ్మురేపేందుకు సిద్ధమయ్యారు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సంపాదించగా... అదే జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. రోస్‌బర్గ్ మూడో సెషన్లో అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 33.185 సెకన్లలో ముగించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ పదో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ రికియార్డో మూడో స్థానం పొందినా... గత రేసులో ప్రమాదకరంగా ట్రాక్‌పై దూసుకురావడంతో అతనిపై పది గ్రిడ్ల పెనాల్టీని విధించారు. దాంతో అతను ఈసారి 13వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సెర్గియో పెరెజ్ నాలుగో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 11వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. సీజన్‌లోని తొలి రెండు రేసులు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో నికో రోస్‌బర్గ్... మలేసియా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతలుగా నిలిచారు. బహ్రెయిన్లోనూ వీరిద్దరిలో ఒకరికి విజయావకాశాలున్నాయి. బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి వివరాలు ల్యాప్‌ల సంఖ్య : 57 సర్క్యూట్ పొడవు : 5.412 కి.మీ. రేసు దూరం : 308.238 కి.మీ. మలుపుల సంఖ్య : 23 ల్యాప్ రికార్డు : 1ని:31.447 సె (రోసా-2005) గతేడాది విజేత : వెటెల్