ఆయనతో నో అనడానికి అదే కారణం!
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఒక రకమైన యుక్తి అయితే, ఒక ప్రణాళిక ప్రకారం తనకు నచ్చిన విధంగా కెరీర్‌ను కొనసాగించడం మరో రకం యుక్తి. నటి కీర్తిసురేశ్ రెండవ పద్ధతిని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీమురుగన్, రెమో చిత్రాల విజయంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ అయిపోయింది. ఆ తరువాత విజయ్‌తో నటించే అవకాశాన్ని అందుకుంది. కాగా వాలు చిత్రం ఫేమ్ విజయచందర్ దర్శకత్వంలో నటుడు విక్రమ్‌కు జంటగా స్కెచ్ చిత్రంలో నటించే అవకాశం ముందు నటి కీర్తీసురేశ్‌నే వరించింది.
అయితే సీనియర్ కథానాయకులతో నటించరాదని నిర్ణయించుకున్నట్లు ఆ దర్శక నిర్మాతలతో ఓపెన్‌గానే చెప్పి ఆ అవకాశాన్ని వదులుకుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్న కీర్తీకి అక్కడ కృష్ణవంశీ దర్శకత్వంలో బాలకృష్టకు జంటగా నటించే అవకాశం రాగా సీనియర్ నటుడన్న కారణంగా ఆ అవకాశాన్ని తిరస్కరించిందట.
అయితే సీనియర్ నటులకు జంటగా నటించాలన్న కోరిక తనకూ ఉందని, అయితే ఆదిలోనే అలా వారికి జంటగా నటిస్తే, యువ నటులకు జంటగా నటించే అవకాశాలను మిస్ అవుతానేమోనన్న భావనతో ఆ అవకాశాలను ఒప్పుకోవడం లేదని కీర్తీ చెప్పుకొచ్చింది. అయితే సెకండ్ రౌండ్లో పెద్ద, చిన్నా తారతమ్యాలు చూడకుండా కథా పాత్రలకు ప్రాముఖ్యతనిచ్చి నటిస్తానని కీర్తీసురేశ్ అంటోంది. చూద్దాం ఈ అమ్మడి యువ యుక్తి ఎంతవరకూ పారుతుందో.