చెరువులో పడి గొర్రెల కాపరి మృతి
కీసర(రంగారెడ్డి జిల్లా): ఓ గొర్రెల కాపరి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం మండలంలోని గోధుమకుంటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చీర బాల్నర్సింహ(52) జీవాలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిమాదిరిగానే గురువారం ఆయన గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలోని సూర్యనారాయణ చెరువులో జీవాలకు నీళ్లు తాగిస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. అక్కడే ఉన్న ఆయన భార్య కేకలు వేయడంతో స్థానికులు వచ్చి బాల్నర్సింహ కోసం చెరువులో గాలించారు. దాదాపు రెండు గంటలపాటు వెతికి మృతదేహాన్ని వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.