అడ్వాన్స్ రూపాయేనట
టీనగర్: తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే అడ్వాన్స్ తీసుకుని అనన్య నటిస్తున్నారని దర్శకుడు బాలశ్రీరాం తెలిపారు. ఆర్.ఎస్.ఎస్.ఎస్ పిక్చర్స్ ఎస్.తనిగైవేల్ సమర్పిస్తున్న స్కైడాట్ ఫిలింస్ ఆధ్వర్యంలో బాల సుబ్రమణియన్ పెరియసామి రూపొందిస్తున్న చిత్రం ‘ఇరవుం పగలుం వరుం’. మహేష్, అనన్య, జగన్, స్వామినాథన్‌తో సహా పలువురు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం కృష్ణసామి చేపడుతుండగా దీనా సంగీతం సమకూరుస్తున్నారు.
పాటలు లలితానంద్ రాస్తున్న ఈ చిత్రానికి బాలశ్రీరాం దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ కథ విన్నంతనే ఒక్క రూపాయి మాత్రమే అడ్వాన్స్‌గా తీసుకుని నటించేందుకు అనన్య సమ్మతించారని, ఇది ఎంతో ఆశ్ఛర్యం కలిగించిందని తెలిపారు. ఇంజినీరింగ్ చదివే విద్యార్థి ఒకరు పగలు మంచివాడిగాను, రాత్రి సమయాల్లో దొంగగాను వ్యవహరిస్తాడన్నారు. ఇతను ఎందుకు చోరీలకు పాల్పడతాడన్నదే ఈ చిత్రం కథ అని ముగించారు.