తిరుగుబాటుకు పురస్కారం
తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ నవల ‘మధోరుబగన్’ (అర్ధనారీశ్వర) పాఠకుల చేతికి వచ్చిన 2010 సంవత్సరంలోనే, ‘హిందు’ పేరుతో మరాఠీ నవల ఒకటి పుస్తకాల దుకాణాలలో దర్శనమిచ్చింది. బాలచంద్ర నెమాడె రాసిన ‘హిందు’ మీద అప్పుడు పెద్ద దుమారమే రేగింది. పుణేలో ఈ నవలను విక్రయి స్తున్న పుస్తకోత్సవం దగ్గర శివసేన, బీజేపీ, హిందూ ఏక్తా ఆందో ళన్ వంటి సంస్థలు నిరసన ప్రకటించాయి. మధోరుబగన్ నవలకు నాడు ప్రతిబంధకాలు ఎదురుకాలేదు. ఇంగ్లిష్‌లోకి అనువాదమైన తరువాత ఈ సంవత్సరం గొడవలు తలెత్తాయి. అయితే అప్పుడు ప్రతిఘటనను ఎదుర్కొన్న నెమాడెకు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ దక్కింది. హిందుత్వం, బ్రాహ్మణాధిక్య భావనల మీద తిరుగుబాటు చేసిన రచయితకు 2014 సంవత్స రానికి ఆ అవార్డు లభించడం విశేషమే.
హిందు భావనను ఆ పేరుతో ఏర్పడిన సంస్థలు ధ్వంసం చేశా యని నెమాడె ముందు నుంచి నమ్ముతున్నారు. బ్రాహ్మణాధి క్యం, హిందుత్వమే హిందు సమా జాన్ని భ్రష్టుపట్టించాయని, మను స్మృతితోనే హిందు సమాజంలో ఉన్నత, నిమ్నవర్గాల భావన చొర బడిందని ఆయన చెబుతారు. ఈ అంశాల మీద మూడు దశాబ్దాల పాటు పరిశోధన చేసి రాసిన నవలావళి ‘హిందు’. నాలుగు భాగాల ఈ రచనతో హిందు త్వవాదులు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతాలన్నీ కకావికలు కాక తప్ప దని ఆయన ముందే ప్రకటించారు. అయితే హిందుత్వం మీద ఛాందస ముద్రను తొలగించడమే నెమాడె ఆశయమని అభిప్రా యపడిన విమర్శకులు ఉన్నారు. ఎలాంటి ఆలోచనాధారనైనా తనలో ఇముడ్చుకునే తత్వం హిందుత్వకు ఉందని, ఇతర మతా లను ముఖ్యంగా ముస్లింలను ద్వేషించడం హిందుత్వం లక్షణం కాదని ఆయన అభిప్రాయం. ఈ అంశాన్నే ‘హిందు’నవలలో చర్చించారు.
‘హిందు’నవలలో మొహెంజదారో, హరప్పా సంస్కృతులు, మౌర్యుల నుంచి పానిపట్టు యుద్ధం వరకు చర్చిస్తూ, గతం-వర్త మానాల మధ్య ఒక లోలకం వలె ఇతివృత్తాన్ని రచయిత నడిపిం చారు. చాణక్యుడు, చార్వాకుడు, పాణిని వంటి వారిని కూడా రచయిత పరిచయం చేశారు. ఆయాకాలాలలో కనిపించిన కుల, స్త్రీవాదాలను ప్రస్తావించారు కూడా.
నెమాడె 24వ ఏట రచించిన ‘కోస్లా’ (పట్టుపురుగు గూడు/ పట్టుకాయ) మరాఠీ నవలా సాహిత్యాన్ని కొత్త మలుపు తిప్పిం దని విమర్శకులు అంటారు. ఆంగ్ల సాహిత్యం చదివి, దానినే బోధించిన నెమాడె, కోస్లా నవలకు జేడీ శాలింగర్ రాసిన ‘ది క్యాచర్ ఇన్ ది రెయి’తో ప్రేరణ పొందారని చెబుతారు. ఆ నవ లలో ఒక యువకుడు తన అస్తిత్వం కోసం పడే తపన కనిపిస్తుం ది. కోస్లాలో కూడా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన కథానా యుడు పుణేలో విద్యకోసం పడే ఆరాటాన్ని చిత్రించారు. అయితే గ్రామీణ ప్రాంత మరాఠీ భాషను ఇందులో నెమాడె ప్రయోగించిన తీరే ఆయనకు ఎంతో ఖ్యాతి తెచ్చింది. ఈ నవలను చాలా భార తీయ భాషలలోకి అనువదించుకున్నారు. ఇంకా ‘బిధారి’, ‘హూ ల్’, ‘జార్లియా’ ‘ఝూల్’ వంటి నవలలు కూడా ఆయన రాశారు. ‘మెలోడి’, ‘దేఖణి’ నెమాడె వెలువరించిన కవితా సంపుటాలు. టీకాస్వయంవర్, సాహిత్యచిభాష, తుకారాం, దేశీవాద్ ఆయన విమర్శనా గ్రంథాలు. దేశీవాద్ గ్రంథంలో ఆయన ఇంగ్లిష్ మన దేశీయ భాషలను నాశనం చేస్తున్నదనే భావించారు. అలాగే మరాఠీల సాంస్కృతిక లాలసతకు తాను ముగ్ధుడనవుతానని కూడా అంటారు. తన రచనలను మరాఠీవారు ఎంతో సామరస్య ధోరణితో స్వీకరించడమే ఇందుకు కారణమని నెమాడె చెప్పారు.