బాలచంద్ర నెమాడేకు జ్ఞానపీఠ్
సాక్షి, పింప్రి: సాహిత్య రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకమైన ‘జ్ఞానపీఠ్’ అవార్డును 2014కు గాను ప్రముఖ మరాఠీ సాహిత్యవేత్త బాలచంద్ర నెమాడే(76)కు ప్రదానం చేయనున్నారు. సాహిత్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు పది మందితో కూడిన సెలెక్షన్ బోర్డు శుక్రవారం ఢిల్లీలో ప్రకటించింది. కాగా, ఏప్రిల్‌లో ఆయనకు అవార్డును అందజేసే అవకాశం ఉంది. అవార్డు కింద 10 లక్షల రూపాయలు, సన్మాన పత్రంతో గౌరవించనున్నారు.
బాలచంద్ర నెమాడే 1938లో జన్మించారు. 25 ఏళ్ల వయస్సులో 1963లో ‘కొసాలా’ నవలను 16 రోజుల్లో రచించారు. ఈ నవలతో మరాఠీ సాహిత్య రంగంలో విశిష్ట పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆ తర్వాత జరీలా, జూల్, బిడార్, హిందూ-ఏక్ సముద్రనవలలతో పాటు ఎన్నో కవితలను రాశారు.
ఆయనకు ఇదివరకే సాహిత్య అకాడమి పురస్కారం(1991), నాసిక్ కునుమాగ్రజ్ ప్రతిష్టాన్ వారి జనస్థాన పురస్కారం లభించాయి. 2011లో పద్మశ్రీ అవార్డు ఆయనను వరించింది. మరాఠీ సాహిత్య రంగంలో జ్ఞానపీఠ్ అవార్డు గెల్చుకున్న నాల్గవ రచయిత బాలచంద్ర నెమాడే. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నెమాడేకు అభినందనలు తెలిపారు.