బాలాజీ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
తిరుపతి : తిరుపతి నుంచి ముంబయి వెళుతున్న బాలాజీ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు సోమవారం అర్థరాత్రి చోరీకి పాల్పడ్డారు. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం హస్తవరం సమీపంలోని దుండగులు చైన్ లాగి అనంతరం ముగ్గురు మహిళల వద్ద నుంచి బంగారాన్ని దోచుకున్నారు. సుమారు 56 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం.
దుండగులు పథకం ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు పదిమంది ముందు స్టేషన్లో ఎక్కి...హస్తవరం అండర్ బ్రిడ్జి వద్దకు రైలు రాగానే చైన్‌లాగి ఆ తర్వాత చోరీకి తెగబడ్డారు. అయితే భారీ దోపిడీకి పథకం రచించినా..రైలు వేగం అందుకోవటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఎస్-7, 8, 9 బోగీల్లో చోరికి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే డీఎస్పీ సూర్యచంద్రరావు సంఘటనాస్థలాన్ని సందర్శించారు. దోపిడీ ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.