balaji naik
-
ఎస్టీలకు ప్రత్యేక కమిషన్
- గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజినాయక్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రంలో ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజినాయక్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్జీఓ భవన్లో ఆదివారం గిరిజన ఉద్యోగుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ గిరిజనులు, గిరిజన ఉద్యోగులు దీర్ఘకాలంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. వాటిపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎస్టీలకు అందాల్సిన ఫలాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రోస్టర్ పాటించడం లేదన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాల వల్ల అనేకమంది గిరిజనులు నష్టపోతున్నారన్నారు. వెనుకబడిన కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలన్నారు. ప్రతి జిల్లాకు ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో ఎస్టీల కోసం స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్టీ ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉప మేయర్ గంపన్న, ఉద్యోగుల సంఘం చైర్మన్ ఠాగూర్‌నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, రంగానాయక్, జీవీఎస్ఎస్ నాయకులు శివశంకర్‌నాయక్, మల్లికార్జున నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
గమ్యం చేరని స్వప్నం
- ఎస్ఐ సెలెక్షన్స్‌లో అపశ్రుతి - పరుగు పందెంలో ఆగిన కానిస్టేబుల్ గుండె - మరో ఇద్దరికి అస్వస్థత కర్నూలు(హాస్పిటల్): చిన్న వయస్సులోనే పోలీస్ ఉద్యోగాన్ని సాధించారు. ఆ తర్వాత ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నారు. అనంతరం జీవితంలో మరింత ఉన్నతంగా స్థిరపడాలని కలగన్నారు. ఈ మేరకు ఎస్ఐ సెలెక్షన్స్‌కు సిద్ధమయ్యారు. పరుగు పందెంలో గమ్యన్ని చేరుకోకుండానే గుండె ఆగి అతని పోరాటం నిలిచింది. ఈ విషాద ఘటన శనివారం ఉదయం కర్నూలులో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పూజారి తండా గ్రామానికి చెందిన దేనేనాయక్, ధర్మినిబాయి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి శ్రీనివాస నాయక్, బాలాజీ నాయక్ కుమారులు. శ్రీనివాస నాయక్ తండ్రితో పాటు వ్యవసాయం చేస్తుండగా బాలాజీ నాయక్ డిగ్రీ వరకు చదువుకుని 2007 బ్యాచ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం అతను అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ (పీసీ నెం.602)గా పనిచేస్తున్నారు. ఉద్యోగం వచ్చాక ప్రేమించిన ముస్లిం యువతిని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇక జీవితంలో మరింత ఉన్నతంగా స్థిరపడాలని భావించి ఎస్ఐ ఎంపిక పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని కర్నూలు వచ్చారు. శనివారం ఉదయమే స్థానిక ఏపీఎస్పీ 9వ బెటాలియన్‌లో నిర్వహించిన ఎస్ఐ సెలెక్షన్స్ పరుగు పందెంలో పాల్గొన్నారు. అయితే గమ్యానికి చేరుకోలేక మధ్యలోనే అతను తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలారు. వెంటనే అధికారులు అతన్ని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతని బీపీ, పల్స్ కొట్టుకోవడం ఆగిపోయినా వైద్యులు చేసిన చివరి ఫలితంచలేదు. దీంతో అతను మరణించినట్లుగా ధ్రువీకరించారు. వెంటనే పోలీసులు సమాచారాన్ని కుటుంబసభ్యులకు చేరవేశారు. మధ్యాహ్నం ఆసుపత్రికి వచ్చిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మరో ఇద్దరికి అస్వస్థత ఎస్ఐ ఎంపికలో భాగంగా నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్న మరో ఇద్దరు అభ్యర్థులు అస్వస్థతకు గురయ్యారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన సత్యం అనంతపురంలోని 14 ఏపీఎస్పీ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఆయన 1600 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన కుమ్మరి రామచంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ స్టడీ సర్కిల్లో రీజనింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఎస్ఐ సెలక్షన్స్‌లో నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొన్నారు. వీరిద్దరు మధ్యలోనే అస్వస్థతకు గురవడంతో అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అభ్యర్థులు సరైన జాగ్రత్తలు పాటించాలి బాలాజీ నాయక్ మృతదేహాన్ని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ సందర్శించారు. దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు సరైన జాగ్రత్తలు తీసుకుని పాల్గొనాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎస్బీ డీఎస్పీ బాబూ ప్రసాద్, సీఐలు మధుసూదన్‌రావు, నాగరాజరావు, శివన్నారాయణ, సిబ్బంది ఉన్నారు. -
గమ్యం చేరని స్వప్నం
– ఎస్ఐ కావాలనే కోరిక తీరకుండానే ఆగిన కానిస్టేబుల్ గుండె –కర్నూలులో జరిగిన ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో అపశ్రుతి ఎస్ఐ కావాలన్నది ఆయన చిన్ననాటి కోరిక. కష్టపడి 2013లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఎస్ఐ కావాలని పట్టుదలతో నిరంతంర శ్రమించాడు. ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అతడు దేహదారుడ్య పరీక్షలకు ఎంపికయ్యాడు. చివరకు ఎస్ఐ కావాలనే కోరిక తీరకుండానే ఈ లోకం నుంచి విశ్రమించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో ఏపీఎస్పీ మైదానంలో శనివారం చోటు చేసుకుంది. - అనంతపురం సెంట్రల్ : జిల్లాకేంద్రం అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాలాజీనాయక్(30) కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఎస్ఐ దేహదారుడ్య పరీక్షల్లో పాల్గొన్నాడు. పీఎంటీ (ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్) అర్హత సాధించిన అనంతరం 1600 మీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నాడు. అయితే గమ్యాన్ని చేరుకోక ముందే ఒక్కసారిగా అతడు కుప్పకూలిపోయారు. హుటాహుటిన పోలీసు అధికారులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కిందకు పడిపోయే ముందు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తేల్చారు. కుటుంబ నేపథ్యం ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి తండాకు చెందిన దేనేనాయక్, ధర్మణీబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా బాలాజీనాయక్ రెండోవాడు. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు జీవనం సాగించేవారు. వారి కుటుంబంలో బాలాజీనాయక్ ఒక్కడే ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ఎప్పటికైనా అతడిని ఎస్ఐగా చూడాలన్నది తల్లిదండ్రుల కోరిక. బాలాజీనాయక్ కూడా ఎంతో పట్టుదలతో శ్రమించేవాడు. అందులో భాగంగా నెలరోజుల పాటు సెలవులో ఉంటూ ఎస్ఐ ఉద్యోగానికి శ్రమించాడు. అయితే అతడి కోరిక నెరవేర్చకుండానే హఠాన్మరణం చెందారు. బాలజీనాయక్ ఏడాది క్రితం హజరున్ అనే అమ్మాయిని మతాంతర వివాహం చేసుకున్నాడు. ఘన నివాళి జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బాలాజీనాయక్ పార్థివ దేహాన్ని కర్నూలు నుంచి వారి స్వగ్రామానికి తీసుకొచ్చారు. శనివారం సాయంత్రం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సందర్శనార్థం ఉంచారు. అనంతరం సీఐ రాఘవన్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, తదితరులు ఘన నివాళులర్పించారు. అనంతరం పొడరాళ్లపల్లి తడాకు తీసుకెళ్ళారు. ఆదివారం పోలీసు లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని పోలీసులు అధికారులు తెలిపారు. మరో ఇద్దరికి అస్వస్థత ఎస్ఐ ఎంపికలో భాగంగా నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్న మరో ఇద్దరు అభ్యర్థులు అస్వస్థతకు గురయ్యారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన సత్యం అనంతపురంలోని 14 ఏపీఎస్పీ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2013 బ్యాచ్‌కు చెందిన ఆయన 1600 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన కుమ్మరి రామచంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ స్టడీ సర్కిల్లో రీజనింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఎస్ఐ సెలక్షన్స్‌లో నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొన్నారు. వీరిద్దరు మధ్యలోనే అస్వస్థతకు గురవడంతో అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కర్నూలు పర్యటన విషాదం కర్నూలు జిల్లా పోలీస్‌శాఖలో ఇద్దరు కానిస్టేబుల్‌ను పొట్టనపెట్టుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి బందోబస్తుకు వెళ్ళిన స్పెషల్‌పార్టీ కానిస్టేబుల్ హంపన్న తుపాకి పేలి మృతి చెందిన విషయం తెలిసింది. మిస్‌ఫైరా... ఆత్మహత్యా అనే అనుమానాలు ఇంకా నివృత్తి కాకముందే పోలీస్‌శాఖలో మరో ఉద్యోగి ఇలా మృతి చెందడం ఆశాఖ ఉద్యోగులను దిగ్భాంతికి గురి చేసింది. రెండు ఘటనలు వారం వ్యవధిలో కర్నూలు జిల్లాలో జరగడం గమనార్హం.