గమ్యం చేరని స్వప్నం | balaji naik dies in police events | Sakshi
Sakshi News home page

గమ్యం చేరని స్వప్నం

Jan 7 2017 11:27 PM | Updated on Aug 21 2018 7:18 PM

గమ్యం చేరని స్వప్నం - Sakshi

గమ్యం చేరని స్వప్నం

ఎస్‌ఐ కావాలన్నది ఆయన చిన్ననాటి కోరిక. కష్టపడి 2013లో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాడు.

– ఎస్‌ఐ కావాలనే కోరిక తీరకుండానే ఆగిన కానిస్టేబుల్‌ గుండె
–కర్నూలులో జరిగిన ఎస్‌ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో అపశ్రుతి


ఎస్‌ఐ కావాలన్నది ఆయన చిన్ననాటి కోరిక. కష్టపడి 2013లో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాడు. ఎస్‌ఐ కావాలని పట్టుదలతో నిరంతంర శ్రమించాడు. ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అతడు దేహదారుడ్య పరీక్షలకు ఎంపికయ్యాడు. చివరకు ఎస్‌ఐ కావాలనే కోరిక తీరకుండానే ఈ లోకం నుంచి విశ్రమించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో ఏపీఎస్పీ మైదానంలో శనివారం చోటు చేసుకుంది. -

అనంతపురం సెంట్రల్‌ : జిల్లాకేంద్రం అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాలాజీనాయక్‌(30) కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఎస్‌ఐ దేహదారుడ్య పరీక్షల్లో పాల్గొన్నాడు. పీఎంటీ (ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌) అర్హత సాధించిన అనంతరం 1600 మీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నాడు. అయితే గమ్యాన్ని చేరుకోక ముందే ఒక్కసారిగా అతడు కుప్పకూలిపోయారు. హుటాహుటిన పోలీసు అధికారులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కిందకు పడిపోయే ముందు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తేల్చారు.

కుటుంబ నేపథ్యం
    ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి తండాకు చెందిన దేనేనాయక్, ధర్మణీబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా  బాలాజీనాయక్‌ రెండోవాడు. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు జీవనం సాగించేవారు. వారి కుటుంబంలో బాలాజీనాయక్‌ ఒక్కడే ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ఎప్పటికైనా అతడిని ఎస్‌ఐగా చూడాలన్నది తల్లిదండ్రుల కోరిక. బాలాజీనాయక్‌ కూడా ఎంతో పట్టుదలతో శ్రమించేవాడు. అందులో భాగంగా నెలరోజుల పాటు సెలవులో ఉంటూ ఎస్‌ఐ ఉద్యోగానికి శ్రమించాడు. అయితే అతడి కోరిక నెరవేర్చకుండానే హఠాన్మరణం చెందారు. బాలజీనాయక్‌ ఏడాది క్రితం హజరున్‌ అనే అమ్మాయిని మతాంతర వివాహం చేసుకున్నాడు.

ఘన నివాళి  
    జిల్లా ఎస్పీ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బాలాజీనాయక్‌ పార్థివ దేహాన్ని కర్నూలు నుంచి వారి స్వగ్రామానికి తీసుకొచ్చారు. శనివారం సాయంత్రం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సందర్శనార్థం ఉంచారు. అనంతరం సీఐ రాఘవన్, పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, తదితరులు ఘన నివాళులర్పించారు. అనంతరం పొడరాళ్లపల్లి తడాకు తీసుకెళ్ళారు. ఆదివారం పోలీసు లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని పోలీసులు అధికారులు తెలిపారు.

మరో ఇద్దరికి అస్వస్థత
ఎస్‌ఐ ఎంపికలో భాగంగా నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్న మరో ఇద్దరు అభ్యర్థులు అస్వస్థతకు గురయ్యారు. వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగుకు చెందిన సత్యం అనంతపురంలోని 14 ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2013 బ్యాచ్‌కు చెందిన ఆయన 1600 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన కుమ్మరి రామచంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ స్టడీ సర్కిల్‌లో రీజనింగ్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఎస్‌ఐ సెలక‌్షన్స్‌లో నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొన్నారు. వీరిద్దరు మధ్యలోనే అస్వస్థతకు గురవడంతో అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.  

కర్నూలు పర్యటన విషాదం  
    కర్నూలు జిల్లా పోలీస్‌శాఖలో ఇద్దరు కానిస్టేబుల్‌ను పొట్టనపెట్టుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి బందోబస్తుకు వెళ్ళిన స్పెషల్‌పార్టీ కానిస్టేబుల్‌ హంపన్న తుపాకి పేలి మృతి చెందిన విషయం తెలిసింది. మిస్‌ఫైరా... ఆత్మహత్యా అనే అనుమానాలు ఇంకా నివృత్తి కాకముందే పోలీస్‌శాఖలో మరో ఉద్యోగి ఇలా మృతి చెందడం ఆశాఖ ఉద్యోగులను దిగ్భాంతికి గురి చేసింది. రెండు ఘటనలు వారం వ్యవధిలో కర్నూలు జిల్లాలో జరగడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement