- గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజినాయక్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రంలో ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజినాయక్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్‌జీఓ భవన్‌లో ఆదివారం గిరిజన ఉద్యోగుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ గిరిజనులు, గిరిజన ఉద్యోగులు దీర్ఘకాలంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. వాటిపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎస్టీలకు అందాల్సిన ఫలాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రోస్టర్ పాటించడం లేదన్నారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాల వల్ల అనేకమంది గిరిజనులు నష్టపోతున్నారన్నారు. వెనుకబడిన కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలన్నారు. ప్రతి జిల్లాకు ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో ఎస్టీల కోసం స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్టీ ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉప మేయర్ గంపన్న, ఉద్యోగుల సంఘం చైర్మన్ ఠాగూర్‌నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, రంగానాయక్, జీవీఎస్‌ఎస్ నాయకులు శివశంకర్‌నాయక్, మల్లికార్జున నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీలకు ప్రత్యేక కమిషన్
Published Sun, Jan 29 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM
Advertisement