గుబులు రేపుతున్న గులాబీ రేకులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి నేటికి నెలరోజులు. అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి అసమ్మతి కుంపటి పెట్టిన ఆయా నియోజకవర్గాల నాయకులు పట్టు వీడడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో మినహా మిగతా చోట్ల అభ్యర్థుల పట్ల అసంతృప్తి పెల్లుబుకింది. చెన్నూర్‌లో సిట్టింగ్ అభ్యర్థి నల్లాల ఓదెలును మార్చడంతో అసమ్మతి తలెత్తగా, మిగతా చోట్ల సిట్టింగ్ స్థానాల విషయంలో అసంతృప్తి చెలరేగింది. అసంతృప్తి వాదులను చల్లబరిచేందుకు ఓవైపు మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నప్పటికీ, రోజుకో కొత్త సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. స్థానిక మండల, నియోజకవర్గ నాయకుల అసమ్మతి రాగం వెనుక పెద్ద నాయకులే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో గుబులు రేపుతున్న అసమ్మతి నేతలతో అభ్యర్థులకు తంటాలు తప్పేలా లేవని పరిశీలకులు భావిస్తున్నారు.
సుమన్‌కు షాకిచ్చిన ‘బ్రదర్స్’
చెన్నూర్ టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను మార్చి మాజీ మంత్రి జి.వినోద్‌కు సీటివ్వాలని ఆయన సోదరుడు మాజీ ఎంపీ వివేక్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన ఆయన అనుచరులు మంత్రి కేటీఆర్‌ను శుక్రవారం కోరారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిసిన వివేక్, వినోద్, చెన్నూర్ నుంచి వెళ్లిన వందలాది మంది అనుచరులు బాల్క సుమన్ స్థానంలో వినోద్‌కు సీటివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే దానికి కేటీఆర్ సుముఖత వ్యక్తం చేయలేదు. తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వినోద్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం జరుగుతుందని, ఎమ్మెల్యే టికెట్టు మార్చలేమని స్పష్టం చేశారు. ఇది సుమన్‌కు కొత్త షాక్.
ఓదెలు ఎపిసోడ్ నుంచి తేరుకోక ముందే...
చెన్నూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు నిరాకరించి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు సీటిచ్చిన విషయం విదితమే. దీంతో ఓదెలు తీవ్ర అసంతృప్తికి గురవడం, స్వీయ గృహనిర్బంధం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనంతరం జైపూర్ మండలం ఇందరాంలో ఓదెలు అనుచరుడు గట్టయ్య పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓదెలును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలిపించి మాట్లాడి భవిష్యత్తుపై హామీ ఇవ్వడంతో చల్లబడ్డారు. శుక్రవారం మందమర్రి, చెన్నూర్‌లలో ఓదెలుతో కలిసి సుమన్ ప్రచారం సాగించారు. ఓదెలు అండదండలు పుష్కలంగా ఉంటాయని భావిస్తున్న తరుణంలో వివేక్ బ్రదర్స్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో చేసిన హంగామా మింగుడుపడని అంశమే. జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డి ప్రస్తుతం వివే క్ సోదరులకు అండగా నిలిచినట్లు సమాచారం.
బోథ్, ముథోల్‌లలో నివురు గప్పిన నిప్పులా...
బోథ్‌లో రాథోడ్ బాపూరావు స్థానంలో తనకు టికెట్టు ఇవ్వాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇప్పటికే పలుమార్లు అధిష్టానం పెద్దలను కలిశారు. అయినా ఎటువంటి హామీ రాలేదు. దీంతో ప్రస్తుతానికి నగేష్ అనుయాయులు మౌనంగానే ఉన్నారు. అయితే బీఫారంలు జారీ చేసే సమయంలోనైనా అభ్యర్థిని మారుస్తారనే ధీమాతో ఉన్నారు. గురువారం తలమడుగు మండలంలో పూజలు చేసేందుకు దేవాలయానికి వచ్చిన బాపూరావుకు స్థానికుల నుంచి నిరసన సెగ తగలడం గమనార్హం. ప్రచార పర్వంలో ఎలా ఉంటుందో తెలియదు. ఈలోపు నోటిఫికేష్ వచ్చి బీఫారంలు ఇచ్చే సమయంలో మార్పులు తప్పవని అంచనాతో ఎంపీ మద్దతుదారులు ఉన్నారు. ముథోల్‌లో విఠల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలచారి వర్గీయులు చాపకింద నీరులా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా విఠల్‌రెడ్డిని మార్చాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం, చారి నిర్వేదంతో భైంసాలో మకాం వేయడం రాబోయే పరిణామాలను సూచిస్తున్నాయి.
మిగతా స్థానాల్లో...
బెల్లంపల్లిలో ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవితో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం వచ్చిన తరువాత తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చినా, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య మార్చాలనే పట్టుపడుతున్నారు. బెల్లంపల్లి టికెట్టు ఆశించి భంగపడ్డ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం చెన్నూర్‌లో బాల్క సుమన్ వెంట ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన అనుచరులు మాత్రం బెల్లంపల్లిలోనే ఉండి చిన్నయ్యకు వ్యతిరేకంగా లోపాయికారి కార్యక్రమాలు చేస్తున్నారని సమాచారం. మంచిర్యాలలో అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావును వ్యతిరేకించిన ఎంపీపీ బేర సత్యనారాయణ బీఎస్పీలో చేరి అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ కొందరు ముఖ్య నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అంతర్గత కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
నిర్మల్‌లో గురుశిష్యుల స్నేహరాగం ఎందాకా..?
గత ఎన్నికల్లో తనపై విజయం సాధించిన అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డికి పార్టీ టికెట్టు ఇచ్చారని కినుకతో ఉన్న శ్రీహరిరావు ఇటీవల మంత్రి కేటీఆర్ చొరవతో స్నేహగీతం ఆలపించారు. గతంలో గురుశిష్యులుగా కలిసి పనిచేసిన వీరు ప్రస్తుతం ఒకరింటికి ఒకరు వెళ్లి తామొక్కటే అనే సంకేతాలను పంపించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తనను పట్టించుకోలేదనే అసంతృప్తితో ఉన్న శ్రీహరిరావు ఎంతమేరకు సహకరిస్తారనే భయం మాత్రం మంత్రి ఐకే రెడ్డి వర్గీయుల్లో ఉంది.