మెత్తబడ్డ ఓదెలు | Telangana Election Chennur Adilabad Politics | Sakshi
Sakshi News home page

మెత్తబడ్డ ఓదెలు

Published Sat, Sep 15 2018 1:47 PM | Last Updated on Sat, Sep 15 2018 1:47 PM

Telangana Election Chennur Adilabad Politics - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో రాజకీయం ఎప్పటికప్పుడు రంగులు మారుతోంది. పది మంది తాజా మాజీ ఎమ్మెల్యేల్లో తొమ్మిది మందికి సీట్లిచ్చిన పార్టీ అధ్యక్షుడు చెన్నూర్‌లో మాత్రమే నల్లాల ఓదెలును మార్చారు. ఇక్కడ నుంచి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం కల్పించడంతో వారం రోజుల పాటు సాగిన హైడ్రామాకు వినాయక చవితి రోజు ముగింపు లభించింది. ముఖ్య మంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన తరువాత ఓదెలు తన మనసు మార్చుకున్నట్లు ప్రకటించారు. రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో చెన్నూర్‌లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని ఓదెలు చెప్పారు.

అయితే ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలి యని పరిస్థితి. ఈ నేపథ్యంలో చెన్నూర్‌ రాజకీయం రసకందాయంలో పడింది. బోథ్‌ నియోజకవర్గంలో ఆదిలాబాద్‌ ఎంపీ నగేష్‌ బీఫారం పంపిణీ నాటికి తనకే అవకాశం వస్తుందన్న ధీమాతో ఉన్నారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయకుండా తనదైన శైలిలో మంత్రాంగం నడుపుతున్నారు. ఖానా పూర్‌లో మాత్రం రమేష్‌ రాథోడ్‌ ఇప్పటికే రెబల్‌ అవతారం ఎత్తారు. ఇండిపెండెంట్‌గానైనా పోటీ ఖాయమని తేల్చేశారు. ఆయన కోసం కాంగ్రెస్‌ కూడా ఎదురుచూస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తి టీకప్పులో తుపాను వంటిదేనని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం రసంకందాయంలో పడింది.

బోథ్‌లో టికెట్టుపై ఆశతో నగేష్‌ 
ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ బోథ్‌ సీటుపై ఇప్పటికీ ఆశతోనే ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావుకే సీటు లభించింది. అయితే ఎంపీ అయినప్పటికీ శాసనసభకే పోటీ చేయాలనే ఆలోచనతో బోథ్‌లో పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న నగేష్‌ పార్టీ టికెట్‌ రాకపోవడంతో జీర్ణించుకోలేకపోయారు. ఆయనకు ఈనెల 3వ తేదీన స్వయంగా పార్టీలోని ఓ కీలక నాయకుడు సీటుపై హామీ ఇవ్వగా, ఆరో తేదీన ప్రకటించిన జాబితాలో మాత్రం ఆయన పేరు లేదు. ఈ విషయమై ఇప్పటికే నగేష్‌ ముఖ్యమంత్రిని రెండుసార్లు కలిసినట్లు సమాచారం. శుక్రవారం ఇచ్చోడలో పార్టీ నాయకులతో సమావేశమైన నగేష్‌ సీటు విషయంలో ఇప్పటికీ ఆశాభావంతోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. సర్వేలను ప్రభావితం చేయడం, కొందరు నాయకులు తన పట్ల తప్పుగా అధిష్టానానికి నివేదికలు ఇవ్వడం వల్లనే బోథ్‌ అభ్యర్థిత్వం విషయంలో పరిగణలోకి తీసుకోలేదని ఆయన చెపుతున్నారు. తప్పనిసరిగా తనకు బోథ్‌ బీఫారం వస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు.

ఖానాపూర్‌లో రెబల్‌ స్టార్‌గా రాథోడ్‌
ఖానాపూర్‌లో రేఖా నాయక్‌ను మార్చి తనకు సీటివ్వాల్సిందేనని ఇప్పటికే రాథోడ్‌ రమేష్‌ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. సీటివ్వకపోతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని టీఆర్‌ఎస్‌ నాయకులపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఖానాపూర్‌లో పోటీ చేయడం, గెలవడం ఇప్పటికే ఖరారైందని ఆయన చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో గందరగోళం నెలకొంది. ఒకవేళ టికెట్లు మార్చే పరిస్థితి ఎదురైనా... టీఆర్‌ఎస్‌ మీద బాహాటంగా విమర్శలు చేసిన రాథోడ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఏమాత్రం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీటు సంపాదించే విషయంలో కూడా పునరాలోచిస్తున్నట్లు సమాచారం.

చెన్నూర్‌లో కలిసి కాపురం సాధ్యమా..?
చెన్నూర్‌ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా ఓదెలు స్థానంలో బాల్క సుమన్‌కు సీట్విడంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. సామాజిక సమీకరణాల్లో కూడా రెండు భిన్న వర్గాలకు చెందిన వారు కావడంతో సమస్య తీవ్రమైంది. ఇందారంలో ఓదెలుకు మద్దతుగా పెట్రోలు బాటిల్‌తో హల్‌చల్‌ చేసి, చివరికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రేగుంట గట్టయ్య కూడా సామాజికంగా ఓదెలు వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ఓదెలు అంశాన్ని ఓ వర్గం రాష్ట్ర స్థాయి అంశంగా మార్చేందుకు ప్రయత్నించింది కూడా. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీతో ఓదెలు తన అసంతృప్తిని అటకెక్కించినట్లు కనిపించినా... మనస్ఫూర్తిగా పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయడం అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఓదెలుతో ఫోన్‌లో మాట్లాడేందుకు ‘సాక్షి ప్రతినిధి’ ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement