అమర్నాథ్ యాత్ర జూలై 21 నుంచి
జమ్మూ: అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకు దాదాపు 15 రోజులపాటు జరగనుంది. ఈ విషయాన్ని శ్రీఅమర్నాథ్ దేవస్థానం బోర్డు(ఎస్ఏఎస్బీ) ప్రకటించింది. యాత్రకు అంకురార్పణ చేస్తూ ప్రథమ పూజను శుక్రవారం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి అమర్నాథ్ యాత్రను కుదించారు. సాధువులు మినహా 55 ఏళ్లు పైబడిన వారిని యాత్రకు అనుమతించరు. అనంత్‌నాగ్ జిల్లాలో పవిత్ర గుహలో కొలువైన మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లు కలిగి ఉండడం తప్పనిసరి.
యాత్ర కోసం వచ్చే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని శ్రీఅమర్నాథ్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. మంచు శివలింగం దర్శనానికి సాధువులు మినహా మిగతా యాత్రికులంతా ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పవిత్ర గుహలో 15 రోజులపాటు ఉదయం, సాయంత్రం హారతి ఇవ్వాలని, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని అధికారులు నిర్ణయించారు. బాల్తాల్ మార్గంలోనే యాత్ర జరుగుతుంది. పహల్గామ్ మార్గంలో ఎవరినీ అనుమతించరు.
బెంగళూరులో భక్తుల రాకకోసం ఆలయాలను సిద్ధం చేస్తున్నారు. శనివారం సిటీలో ఓ ఆలయంలో విగ్రహాలపై రసాయనాలు చల్లి క్రిమిరహితం చేస్తున్న అర్చకులు