Yanamalakuduru Bridge: రక్తికట్టని మాజీ ఎమ్మెల్యే బోడే డ్రామా
పెనమలూరు(కృష్ణా జిల్లా): యనమలకుదురు పరిధిలో బందరు కాలువపై అసంపూర్తిగా మిగిలిన వంతెన నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వింత నాటకాలకు తెరలేపారు. ప్రతిపక్షంలో ఉండగా వంతెన శిలాఫలకానికి పిండ ప్రదానాలు చేసి ప్రజలపై కల్లబొల్లి ప్రేమ కురిపించిన ఆయన.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా వంతెన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వంతెన నిర్మాణంపై దృష్టి సారిస్తుండటంతో అక్కసుతో కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిర్మాణానికి మోకాలడ్డారు. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారాన్ని రాజకీయ స్వలాభం కోసం పచ్చనాటకానికి తెరలేపారు.
అధికారంలోకి వచ్చినా నిర్లక్ష్యం..
టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వంతెన నిర్మాణానికి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ రాశారు. అయితే ఆయన వెంటనే పనులు ప్రారంభించలేదు. జలరవాణాకు వంతెన అడ్డుగా ఉంటుందని సాకు చూపి వంతెన పనులు టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో యనమలకుదురు ప్రజలు దిక్కుతోచక లాకుల మీదుగా నానా ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు. తరచూ ట్రాఫిక్ ఇక్కట్లతో ఈ ప్రాంత ప్రజలు అగచాట్లు పడ్డారు. అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేగా ఉన్న బోడె ప్రసాద్ వంతెన నిర్మాణంపై ఏమాత్రం చొరవ చూపలేదు. కాంట్రాక్టర్‌తో చెట్టాపట్టాల్ వేసుకుని కాలం గడిపారు. గతంలో బోడె ప్రసాద్ వంతెన కోసం ఆందోళనలు చేసి గ్రామస్తులను దగా చేశారు.
ఆలస్యంగా పనులు ప్రారంభం..
యనమలకుదురు వంతెన అగ్రిమెంట్ రాసిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు 2016లో ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ రామవరప్పాడు వద్ద రైవస్ కాలువపై వంతెన నిర్మాణం పనులు ప్రారంభించి, సకాలంలో పూర్తి చేశారు. వంశీ వంతెన పనులు చకచకా పూర్తి చేయటంతో అప్పటివరకు నిద్రావస్థలో ఉన్న బోడె ప్రసాద్ నిద్రలేచి వంతెన పనులు ప్రారంభించారు. తన వలనే వంతెన పనులు ఆలస్యంగా ప్రారంభించామని యనమలకుదురు గ్రామసభలో బోడెప్రసాద్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు.
కాంట్రాక్టర్‌కు బిల్లు ఎగ్గొట్టిన టీడీపీ..
యనమలకుదురు వంతెన పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు టీడీపీ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయే నాటికి రూ 3.60 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదు. టీడీపీ పాలనలో కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించే బాధ్యత బోడెప్రసాద్‌పై ఉన్నా ఆయన పూర్తి నిర్లక్ష్యం చూపాడు. దీంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పథకం ప్రకారం వంతెన పనులు నిలుపుదల చేశాడు. మరో కాంట్రాక్టర్‌తో వంతెన పనులు చేయించాలని ప్రభుత్వం సిద్ధపడగా కాంట్రాక్టర్ కోర్టు స్టే తెచ్చుకున్నాడు. వంతెన పనులు విషయంలో కాంట్రాక్టర్ సహకరించక పోవటంతోనే అసలు సమస్య వచ్చింది. కాంట్రాక్టర్‌కు రూ. 4 కోట్లు బిల్లులు చెల్లించటానికి అధికారులు చర్యలు చేపట్టారు. కాంట్రాక్టర్ బిల్లులు రావాలనే ఉద్దేశంతోనే నేడు బోడెప్రసాద్ వంతెన నాటకానికి తెరలేపారని గ్రామస్తులు మండి పడుతున్నారు.
బోడె ప్రసాద్ అరెస్టు..
యనమలకుదురు వంతెన వద్ద శాంతి భద్రతలకు భంగం కలిగించిన మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. యనమలకుదురు వంతెన వద్ద మంగళవారం బోడెప్రసాద్ వంద మందితో వెళ్లి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా బందరు కాలువలో దూకుతానని బెదిరించారు. ఈ ఘటనపై పోలీసులు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, బోడెప్రసాద్, మరో వంద మందిపై కేసు నమోదు చేశారు. వారికి నోటీసులు ఇచ్చి, బోడెప్రసాద్, అనుమోలు ప్రభాకరరావును అరెస్టు చేసినట్లు పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపారు.
వంతెన కథ ఇది..
యనమలకుదురులో బందరు కాలువపై వంతెన నిర్మాణం చేయాలని 2011లో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పుడు మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి రూ. 8 కోట్లు మంజూరు చేశారు. అయితే అనుకున్న సమయానికి పనులు జరగక పోవటంతో ప్రతిపక్షంలో ఉన్న బోడె ప్రసాద్ శిలాఫలకం వద్ద పిండ ప్రదానం, కర్మకాండలు నిర్వహించి పచ్చ మీడియా ప్రచారంతో వార్తల్లోకెక్కారు. (క్లిక్ చేయండి: ఇప్పటం పిటిషనర్లకు ఏపీ హైకోర్టు షాక్)
వంతెన పనులు పూర్తి చేస్తాం..
యనమలకుదురు వంతెనకు సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాం. పనులు కూడా ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేస్తాం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నాం.
– కృష్ణారావు, ఈఈ, నీటిపారుదల శాఖ