bandi atmakur
-
ఆ వంతెన మొత్తం అంధకారం
సాక్షి, బండిఆత్మకూరు(కర్నూలు) : మండల కేంద్రమైన బండిఆత్మకూరు బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే వంతెనపై అంధకారం అలుముకుంది. కొన్ని రోజులుగా వీధిదీపాలు వెలగక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రాత్రి సమయాల్లో వంతెనపై ప్రయాణించడానికి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పితే వంతెనపై నుంచి కిందికి పడితే ప్రాణాపాయం తప్పదని, అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గార్దభాలు భళా!
సాక్షి,బండిఆత్మకూరు: శివనంది ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడమల కాల్వ గ్రామంలో బుధవారం గార్దభాల(గాడిదల) బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. సుమారు 120కేజీల బరువు గల ఇసుక సంచులను గాడిదపై వేశారు. 10 నిమిషాల సమయంలో ఎంత ఎక్కువ దూరం పరిగెడితే వాటిని విజేతలుగా ప్రకటించారు. చాగలమర్రి మండలం పెద్దవంగళి గ్రామం రమణయ్యకు చెందిన గార్దభం 5,509 అడుగులు లాగి మొదటి స్థానంలో నిలిచింది. మహానంది మండలం పుట్టుపల్లె ప్రవీణ్‌కు చెందిన గార్దభం 5,400 అడుగులు లాగి రెండో స్థానం, వెలుగోడు నాగచరణ్కు చెందిన గార్దభం 5,373 అడుగులు లాగి మూడో స్థానం, వెలుగోడు మండలం వేల్పనూరు నాగేంద్రకు చెందిన గార్దభం 5,066 అడుగులు లాగి నాల్గోస్థానంలో నిలిచింది. వీరికి రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు, రూ.2వేలు నగదును ఆలయ కమిటీ చైర్మన్ మేకల శ్రీనివాసులు, రాగాల బాబులు, వెంకటేశ్వర్లు, మహబూబ్ బాషా అందజేశారు. -
‘అమ్మ’ భారమైంది!
నవమాసాలు మోసి జన్మనిచ్చిన అమ్మే వారికి భారమైంది. ఆమెను పోషించడం తమ వల్ల కాదని కర్కశంగా వారు చెప్పేచేశారు. మూడురోజులుగా ముద్ద ముట్టని ఆమెను కాశిరెడ్డినాయన ఆశ్రమానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి ఆమె స్వగ్రామానికి తీసుకెళ్లారు. వివరాలు ఇవీ.. కొత్తపల్లె మండలం ఎదురుపాడుకు చెందిన బిజ్జమ్మకు కుమారుడు శంకర్ రెడ్డితో పాటు కుమార్తె ఉంది. దాదాపు మూడు సంవత్సరాల క్రితం శంకర్‌రెడ్డి తన తల్లి బిజ్జమ్మ కాశిరెడ్డినాయన ఆశ్రమంలో వదిలేశారు. దీంతో ఆశ్రమవాసులు ఆమెకు అన్నం పెట్టేవారు. ఆశ్రమంలో ఒక మూలన కూర్చొని తనకు పట్టిన దుస్థితికి చింతిస్తూ ఆమె కాలం వెల్లదీస్తుండేది. అయితే తనకు మరణం ఎంతకీ రావడం లేదని అప్పుడపుడు అక్కడున్న వారికి చెబుతూ దుఃఖిస్తూ ఉండేది. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి ముద్ద అన్నం కూడా ముట్టడం లేదు. ఎంత బతిమాలినా మౌనంగా వద్దని చెప్పేది. దీంతో పూర్తిగా నీరసించి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు కొత్తపల్లె మండలం ఎదురుపాడులో ఉన్నట్లు గుర్తించారు. ఆమె కుమారుడికి ఫోన్‌చేసి పరిస్థితని వివరించారు. ఆమెను తీసుకెళ్లాలని కుటుంబీకులకు తెలిపారు. అయితే తల్లిని తీసుకెళ్లడానికి కుమారుడు అంగీకరించలేదు. మళ్లీ ఫోన్‌చేసినా స్పందన లేదు. దీంతో ఆశ్రమంలో ఉంటున్న కృష్ణయ్య..ఆదివారం ఆటోలో వృద్ధురాలిని తరలించడానికి ఓంకార క్షేత్రం నుంచి బండిఆత్మకూరుకు వచ్చాడు. ఆమె నీరసించి బస్టాండులోని కటిక నేలమీద ఉండడం చూసి స్థానికులు తరలించారు. మహిళలు, హోటల్ నిర్వాహకులు వచ్చి నీరసించిన అమ్మకు పండ్లు, పానియాలు ఇప్పించారు. ఆ తర్వాత తలా ఒక చేయివేసి ఆత్మకూరు బస్సుకు ఎక్కించి పంపించారు. కృష్ణయ్య బస్సులో ఆమె పక్కనే ఉండి జాగ్రత్తగా స్వగ్రామమైన ఎదురుపాడుకు తీసుకెళ్లారు. - బండి ఆత్మకూరు -
తుపాకీ మిస్‌ఫైర్: గన్‌మెన్‌కు గాయం
నంద్యాల క్రైం: తుపాకీ జారి కిందపడి పేలిన ఘటనలో గన్‌మెన్ గాయపడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం పెద్దబోదనం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామ సర్పంచి మహేశ్వర్‌రెడ్డిపై మూడు హత్య కేసులున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యంలో టీడీపీ నాయకుడిగా ఉన్న ఇతనికి ప్రభుత్వం గన్‌మన్ రక్షణ కల్పించింది. అలాగే మహేశ్వర్‌రెడ్డికి ఓ లెసైన్స్డ్ తుపాకీ కూడా ఉంది. అయితే ఆ తుపాకీ కూడా మహేశ్వర్‌రెడ్డి తన గన్‌మన్ సుబ్రహ్మణ్యం వద్ద ఉంచాడు. లోడ్ చేసి ఉన్న సదరు తుపాకీ గురువారం ఉదయం సుబ్రమణ్యం చేతిలో నుంచి కిందకి జారి పడి పేలింది. బుల్లెట్ సుబ్రమణ్యం కాలిలోకి దూసుకెళ్లి గాయమైంది. క్షతగాత్రుడిని నంద్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. -
తల వదిలి ... మొండెం తీసుకెళ్లారు
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. ఏపీఎస్పీ 9వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గరైయ్యాడు. అతడి తలను దుండగులు బండి ఆత్మకూరులో వదిలి వెళ్లారు. సదరు గ్రామస్తులు మనిషి తలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని తలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టగా... కోడూరు వద్ద తల లేని మొండాన్ని గుర్తించి... స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తల, మొండం గత అయిదురోజుల క్రితం అదృశ్యమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుదిగా పోలీసులు గుర్తించారు. ఈ హత్య రెండు రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధమా లేక ఇతర ఏమైనా కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల తన కుటుంబాన్ని కర్నూలులో దింపిన వెంకటేశ్వర్లు తిరిగి వస్తున్న క్రమంలో అదృశ్యమైయ్యాడని పోలీసులు తెలిపారు. తలతో పాటు ఏడమ చేతిని కూడా దుండగులు నరికి వేశారు.