bangalure
-
డోలో-650 కంపెనీపై పెద్ద ఎత్తున ఐటీ దాడులు
బెంగళూరు: కోవిడ్-19సంక్షోభంలో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన డోలో-650 తయారీ సంస్థ మైక్రో లాబ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆదాయపు పన్ను ఎగవేశారనే ఆరోపణలతో మైక్రో ల్యాబ్స్ కార్యాలయంపై ఐటీ శాఖ బుధవారం పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఏకంగా 200 మంది ఐటీ సిబ్బంది పాల్గనడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా మాధవనగర్‌లోని రేస్‌కోర్స్ రోడ్డులోని మైక్రో ల్యాబ్స్ నుంచి అధికారులు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. న్యూఢిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవా సహా దేశవ్యాప్తంగా 200 అధికారులు ఏకకాలంలో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఆదాయానికి సంబంధించి పన్నులు ఎగ్గొట్టారనే అనుమానంతో సంస్థ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానాల ఇళ్లల్లో కూడా దాడులు చేపట్టినట్టు ఐటీ శాఖ. వెల్లడించింది. కాగా 2020లో కరోనా విజృంభణ కాలంనుంచి డోలో-650 ట్యాబ్లెట్ల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. జ్వరాన్ని నియంత్రించే డోలో-650 జనంలోకి విపరీతంగా చొచ్చుకుపోయింది. ఫలితంగా అమ్మకాల్లో రికార్డుల్ని బ్రేక్ చేసింది. 350 కోట్ల టబ్లెట్ల విక్రయాలతోఏడాదిలో 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. 1983లో కుటుంబ వ్యాపారాన్ని స్వీకరించిన సురానా ఫార్మా రంగంలో అనుభవజ్ఞుడు -
కోట్లలో మోసం : రాహుల్ ద్రవిడ్ ఫిర్యాదు
బెంగళూరు : బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ పోంజి సంస్థ, పలువురు సెలబ్రిటీలను కోట్లలో మోసం చేసిన సంగతి తెలిసిందే. ఈ పోంజి సంస్థ మోసం చేసిన బాధితుల్లో భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ లెజెండ ప్రకాశ్ పదుకొణె, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, మాజీ కర్ణాటక క్రికెటర్ అవినాష్ వైద్య తదితరులు ఉన్నారు. తాజాగా ఈ పోంజి సంస్థకు వ్యతిరేకంగా భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పోలీసు ఫిర్యాదు దాఖలు చేశాడు. తన ఫిర్యాదులో విక్రమ్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీలో ఎక్కువ రిటర్నులు వస్తాయనే ఆశతో రూ.20 కోట్లను పెట్టుబడులుగా పెట్టినట్టు తెలిపారు. కానీ అసలు కాకపోగా, దాని కంటే తక్కువగా కేవలం రూ.16 కోట్ల మాత్రమే వెనక్కి వచ్చినట్టు పేర్కొన్నారు. తాను పెట్టిన పెట్టుబడుల మేరకు ఇంకా కంపెనీ తనకు రూ.4 కోట్లు బాకీ ఉందని చెప్పారు. ఇందిరానగర్ పోలీసు స్టేషన్లో క్రికెట్ లెజెండ్ తన ఫిర్యాదును దాఖలు చేశాడు. ఈ ఫిర్యాదును ఈ ఘరానా మోసం కేసును విచారిస్తున్న బనశంకరీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ స్కాం రూ.500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అంతకముందే విక్రమ్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ యజమాని రఘవేంద్ర శ్రీనాథ్‌ని అతని ఏజెంట్లు సుత్రం సురేష్, నరసింహమూర్తి, కేజీ నాగరాజు, ప్రహ్లాద్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్చర్యకరంగా సురేష్ అనే నిందితుడు బెంగళూరులో ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు. తనకు పరిచయం ఉన్న క్రీడాకారులతో ఈ మోసపూరిత కంపెనీలో పెట్టుబడి పెట్టేలా వారిని నమ్మించడంలో కీలకపాత్ర పోషించాడని పోలీసులు వెల్లడించారు. వీరిని 14 రోజుల పోలీసు కస్టడీకి పంపించారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు ఓ పోలీసు ఆఫీసర్ చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారు, ఈ పోంజి స్కాంలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారుల పేర్లను బహిర్గతం చేశారు. వారి బ్యాంకు అకౌంట్లను కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు. -
మెట్రో టోకెన్లు పోగొట్టుకుంటే.. అంతే సంగతులు!
సాక్షి, బెంగళూరు: హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రారంభమవుతున్న వేళ.. బెంగళూరు మెట్రోరైలుకు ఓ కొత్త చిక్కు వచ్చిపడింది. బెంగళూరులోని మెట్రో రైల్వే స్టేషన్లలో టికెట్లుగా ఇచ్చే టోకెన్లు తరచూ చోరీకి గురవుతున్నాయి. దీంతో ఈ చోరీలను అరికట్టడానికి బెంగళూరు మెట్రో సంస్థ (బీఎంఆర్సీఎల్) కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. టోకెన్లను పోగొట్టుకున్న వారిపై విధించే జరిమానాను భారీగా పెంచింది. చూడడానికి ఆకర్షణీయంగా ఉండే మెట్రో టోకెన్లను కొందరు కొనుగోలు చేసి.. అసలు ప్రయాణమే చేయకుండా వాటిని జేబులో వేసుకుని వెళ్తున్నారు. మైక్రో చిప్ కలిగిన ఈ టోకెన్ల తయారీకి ఒక్కొక్కదానికి రూ.35 చొప్పున ఖర్చవుతుండగా.. టోకెన్ కొన్న ప్రయాణికుడు దానిని పొరపాటున పోగొట్టుకుంటే.. గతంలో రూ.50 జరిమానా విధించేవారు. జరిమానా తక్కువగా ఉండటంతో చాలామంది టోకెన్లు తమవద్దే ఉన్నా.. పోగొట్టుకున్నామంటూ జరిమానా చెల్లించి.. వాటిని తమ జేబులో వేసుకొని వెళ్లేవారు. ఇప్పటివరకు ఇలా 1,500 టోకెన్లు తస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో టోకెన్ల జరిమానాను ఏకంగా రూ.50 నుంచి రూ.500 వరకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దొడ్డిదారిలో వెళ్తూ తస్కరణ మెట్రో స్టేషన్లోకి ప్రవేశించగానే వెళ్లే మార్గాన్నిబట్టి ప్రయాణికులకు సిబ్బంది టోకెన్లను ఇస్తారు. తమ స్టేషన్ రాగానే ఎగ్జిట్ వద్ద ఏర్పాటుచేసిన బాక్సుల్లో ఆ టోకెన్‌ను వేస్తే ద్వారం తెరచుకుంటుంది. అయితే, కొంతమంది టోకెన్లను తమ వద్దే ఉంచుకునేందుకు సాధారణ ద్వారం నుంచి కాకుండా దొడ్డిదారిన వెళ్లిపోతున్నారు. ఇలా తనిఖీల్లో దొరికిపోతే రూ.200 వరకు జరిమానా విధిస్తారు. అయినప్పటికీ చాలామంది ఇలాగే జంప్ అవుతూ.. మెట్రో టోకెన్లను తమ వద్దే ఉంచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జరిమానా విధించడంతోపాటు టోకెన్లు పోగొట్టిన వ్యక్తులు మెట్రోలో గరిష్ట టికెట్ ధర రూ.60 చెల్లించి మరో టోకెన్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. -
అయ్యోపాపం.. ఆ శునకం.. ఆదుకున్న కాప్స్!
ఆపదలో ఉన్న ప్రజలను కాపాడేందుకు పోలీసు బలగాలు ప్రాణాలకు తెగించి సహాయం అందించే సంగతి తెలిసిందే. తాజాగా సాటి మానవులను కాదు మూగ జంతువులను సైతం ఆదుకుంటామని బెంగళూరు పోలీసులు చాటారు. బెంగళూరు పోలీసులకు ట్విట్టర్లో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సింగిల్‌లైన్ పంచ్ డైలాగ్ పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న బెంగళూరు కాప్స్.. తాజా చర్యతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఓ వీధికుక్క అనుకోకుండా ప్లాస్టిక్ బిందెలో తల దూర్చి.. అందులో తల ఇరుక్కోవడంతో చాలాసేపు నరకాన్ని అనుభవించింది. ఈ విషయం తెలియడంతో ఏకంగా 15మంది పోలీసులు రంగంలోకి దిగి.. ఆ కుక్కకు విముక్తి కల్పించారు. శునకం తలకు ఇరుక్కున ప్లాస్టిక్ బిందెను తొలగించి.. అది అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కల్పించారు. ఈ విషయాన్ని బెంగళూరు ఈస్ట్ ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ గోయల్ ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్‌గా మారింది. నెటిజన్లు బెంగళూరు పోలీసుల చర్యను ప్రశంసిస్తున్నారు. మూగజీవాల పట్ల సానుభూతి చూపుతున్న పోలీసులపై తమకు గౌరవం పెరిగిందని కొనియాడుతున్నారు. -
నేపాల్ యువతిని నిర్బంధించి రేప్ చేశారు!
బెంగళూరు(కర్ణాటక): ఉపాధి కోసం వచ్చిన నేపాల్ యువతిని ఓ సెక్యూరిటీ గార్డు నిర్బంధించి మూడు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలు అతడి బారి నుంచి తప్పించుకుని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు నిందితుడైన సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేశారు. రామ్‌సింగ్ అనే సెక్యూరిటీ గార్డు నేపాల్ రాజధాని కఠ్మాండ్లో తనకు తెలిసిన ఓ కుటుంబానికి చెందిన యువతిని ఉద్యోగం పేరుతో మూడు నెలల క్రితం నగరానికి పిలిపించాడు. అప్పటినుంచి ఆ యువతిని తన గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడేవాడు. విధులకు వెళ్లే సమయంలో గదికి తాళం వేసుకుని వెళ్లేవాడు. దీంతో యువతి నిస్సహాయురాలిగా ఉండిపోయింది. అయితే.. బుధవారం రాత్రి ఇంటి నుంచి తప్పించుకుని ఓ స్వచ్ఛంద సంస్థను ఆమె ఆశ్రయించింది. ఆ సంస్థ కార్యదర్శి యోగేశ్ బాధితురాలికి అండగా నిలిచారు. పోలీసులు ఆ యువతి నుంచి ఫిర్యాదు తీసుకుని, వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుణ్ని గురువారం అరెస్ట్ చేశారు. -
మళ్లీ అలిగిన అద్వానీ..
బెంగళూరు: బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు ఎల్‌కె అద్వానీ మరోసారి అలకబూనారు. బెంగళూరులో జరుగుతున్న పార్టీ జాతీయ సమావేశాల సందర్భంగా ఆయన అలక పూనినట్టు సమాచారం. రెండవరోజు సమావేశాల్లో మాట్లాడాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విజ్ఞప్తిని ఎల్‌కె అద్వానీ తిరస్కరించినట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అద్వానీ మాట్లాడక పోవడం ఇంది రెండవసారి. గతంలో 2013లో గోవాలో జరిగిన సమావేశాల్లోనరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ చేసిన ప్రతిపాదనకు నిరసనగా ఆయన సమావేశాల నుంచి వెళ్లిపోయారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, కురువృద్దుడు లాల్ కృష్ణ అద్వానీ తాజా సమావేశాల్లో ఒకరికొకరు ఎదురు పడినా కనీసం పలకరించుకోలేదట. సమావేశ వేదికపైనా కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారని సమాచారం. భారతీయ జనతా పార్టీని స్థాపించినప్పటి నుంచీ చురుకైన పాత్ర వహిస్తున్న ఎల్‌కె అద్వానీ అనతికాలంలోనే అగ్రనేతగా ఎదిగారు. కీలక నేతగా ఆయన పలుమార్లు చక్రం తిప్పారు. అయితే గత సంవత్సరం బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ఎన్నికైన తరువాత పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎనభై ఏళ్ల వయసు సభ్యులు కొనసాగించకూడదంటూ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అద్వానీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన అసంతృప్తిని బయటకు వెళ్లగక్కారు కూడా. ఇక లోకసభలో ప్రత్యర్థులపై తన వాక్చాతుర్యం, వాగ్భాణాలతో విరుచుకుపడే అద్వానీ... తాజా పార్లమెంటు సమావేశాల్లో ఎక్కడా ఆయన స్వరం వినిపించలేదు. సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరైనా ఒక్కసారి కూడా అద్వానీ సభలో మాట్లాడకపోవడం, ఆయన నిరాసక్తతకు, తీవ్ర అసంతృప్తికి నిదర్శనమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.