సాక్షి, బెంగళూరు: హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రారంభమవుతున్న వేళ.. బెంగళూరు మెట్రోరైలుకు ఓ కొత్త చిక్కు వచ్చిపడింది. బెంగళూరులోని మెట్రో రైల్వే స్టేషన్లలో టికెట్లుగా ఇచ్చే టోకెన్లు తరచూ చోరీకి గురవుతున్నాయి. దీంతో ఈ చోరీలను అరికట్టడానికి బెంగళూరు మెట్రో సంస్థ (బీఎంఆర్‌సీఎల్) కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. టోకెన్లను పోగొట్టుకున్న వారిపై విధించే జరిమానాను భారీగా పెంచింది. చూడడానికి ఆకర్షణీయంగా ఉండే మెట్రో టోకెన్లను కొందరు కొనుగోలు చేసి.. అసలు ప్రయాణమే చేయకుండా వాటిని జేబులో వేసుకుని వెళ్తున్నారు. మైక్రో చిప్ కలిగిన ఈ టోకెన్ల తయారీకి ఒక్కొక్కదానికి రూ.35 చొప్పున ఖర్చవుతుండగా.. టోకెన్ కొన్న ప్రయాణికుడు దానిని పొరపాటున పోగొట్టుకుంటే.. గతంలో రూ.50 జరిమానా విధించేవారు. జరిమానా తక్కువగా ఉండటంతో చాలామంది టోకెన్లు తమవద్దే ఉన్నా.. పోగొట్టుకున్నామంటూ జరిమానా చెల్లించి.. వాటిని తమ జేబులో వేసుకొని వెళ్లేవారు. ఇప్పటివరకు ఇలా 1,500 టోకెన్లు తస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో టోకెన్ల జరిమానాను ఏకంగా రూ.50 నుంచి రూ.500 వరకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దొడ్డిదారిలో వెళ్తూ తస్కరణ
మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించగానే వెళ్లే మార్గాన్నిబట్టి ప్రయాణికులకు సిబ్బంది టోకెన్లను ఇస్తారు. తమ స్టేషన్ రాగానే ఎగ్జిట్ వద్ద ఏర్పాటుచేసిన బాక్సుల్లో ఆ టోకెన్‌ను వేస్తే ద్వారం తెరచుకుంటుంది. అయితే, కొంతమంది టోకెన్లను తమ వద్దే ఉంచుకునేందుకు సాధారణ ద్వారం నుంచి కాకుండా దొడ్డిదారిన వెళ్లిపోతున్నారు. ఇలా తనిఖీల్లో దొరికిపోతే రూ.200 వరకు జరిమానా విధిస్తారు. అయినప్పటికీ చాలామంది ఇలాగే జంప్ అవుతూ.. మెట్రో టోకెన్లను తమ వద్దే ఉంచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జరిమానా విధించడంతోపాటు టోకెన్లు పోగొట్టిన వ్యక్తులు మెట్రోలో గరిష్ట టికెట్ ధర రూ.60 చెల్లించి మరో టోకెన్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment