Bangladesh-India
-
ఫైనల్లో విరాట్ సేన
-
ఫైనల్లో విరాట్ సేన
► సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ బర్మింగ్‌హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో ఎటువంటి తడబాటు లేకుండా ఆద్యంతం ఆకట్టుకున్న విరాట్ సేన.. పాక్ తో ఆదివారం జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది. బంగ్లాదేశ్ విసిరిన 265 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టుకు శుభారంభం లభించింది. రోహిత్ శర్మ(123 ; 129 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సు నాటౌట్) అజెయ సెంచరీ, కెప్టెన్ విరాట్ కోహ్లి (96; 78 బంతుల్లో 13 ఫోర్లు నాటౌట్) లు రాణించడంతో భారత్ 9.5 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్(46; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), తొలి వికెట్ కు 87 పరుగులు జోడించడంతో భారత్ కు గట్టి పునాది పడింది. ఈ మ్యాచ్ లో ధావన్ తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయినప్పటికీ రోహిత్ శర్మ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి మంచి సహకారం లభించడంతో భారత గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. వీరిద్దరూ సునాయాసంగా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. విరాట్-రోహిత్ ల దూకుడుకు బంగ్లాదేశ్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఇద్దరూ చక్కటి కవర్ డ్రైవ్‌లు, స్ట్రైట్ డ్రైవ్‌లతో అలరిస్తూ బ్యాటింగ్ లో మజాను అభిమానులకు అందించారు. ఈ క్రమంలోనే ముందుగా రోహిత్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై కోహ్లి కూడా అర్థ శతకంతో మెరిశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(70;82 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫికర్ రహీమ్(61;85 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ శతకాలతో రాణించి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలి రెండు వికెట్లను సాధించి బంగ్లాకు షాకిచ్చాడు. అయితే ఆ తరుణంలో తమీమ్ కు జత కలిసిన రహీమ్ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ జోడి 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా పయనించింది. కాగా, తమీమ్ అవుటైన తరువాత షకిబుల్ హసన్(15), ముష్ఫికర్ రహీమ్ లు కూడా పెవిలియన్ చేరండంతో బంగ్లాదేశ్ స్కోరులో వేగం తగ్గింది. అయితే చివరి వరుస ఆటగాళ్లు మొహ్మదుల్లా(21),మొసడక్ హుస్సేన్(15), మోర్తజా(30 నాటౌట్), తస్కీన్ అహ్మద్(11నాటౌట్) లు బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్,బూమ్రా, కేదర్ జాదవ్ లు తలో రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. -
బంగ్లాదేశ్ అభిమానుల అత్యుత్సాహం
► టీంఇండియాను కుక్కతో పోల్చిన వైనం ఢాకా: చాంపియన్స్ ట్రోఫీలో భారత్- బంగ్లాదేశ్ సెమీ ఫైనల్ పోరు జరగక ముందే బంగ్లాదేశ్ అభిమానులు సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ అభిమాన జట్టుకు మద్దతుగా భారత్‌ను అవమాన పరిచే పోస్టులతో రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ బంగ్లా అభిమాని టీం ఇండియాను కుక్కతో పోలుస్తూ చేసిన పోస్టు ప్రతి భారత పౌరునికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఆ అభిమాని బంగ్లాదేశ్ జాతీయ పతాకంతో ఉన్న పులి, భారత పతాకం కలిగిన కుక్కను వేటాడుతున్నట్లు ఉన్న పోస్టును పెట్టాడు. పైగా సోదరులారా! ఇది మంచి పోరుకానుంది అని క్యాప్షన్ పెట్టాడు. ఇది నెట్టింట్లో వైరల్ కావడంతో సదరు అభిమానిపై భారత నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా బంగ్లా అభిమానులు భారత్‌ను అవమానించే అభ్యంతకర పోస్టులు పెట్టారు. బంగ్లాదేశ్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరినపుడు బంగ్లా బౌలర్ టాస్కిన్ అహ్మద్ అప్పటి భారత కెప్టెన్ ధోని తల పట్టుకున్నట్లున్న మార్ఫింగ్ ఫోటోను షేర్ చేశారు.ఇక 2015లో బంగ్లాపై భారత్ మూడు వన్డెల సిరీస్ ఓడినపుడు బంగ్లాకు చెందిన ఓ వార్తా పత్రిక టీమిండియా ఆటగాళ్లు ఉన్న ఫొటోను తీసుకుని ఫొటోషాప్ ద్వారా ఆటగాళ్ల తలపై సగం జుట్టును జట్టు సారథి ముస్తాఫిజుర్ రహ్మాన్ కత్తెరతో తొలగించినట్లు ఫొటోను ప్రచురించింది. అప్పట్లో దీనిపై పెద్ద చర్చే జరిగింది. -
5 రోజుల్లోనే..కృష్ణపట్నం టు బంగ్లాదేశ్
♦ 42 ఏళ్ల తర్వాత నేరుగా కార్గో సేవలు ఆరంభం ♦ 30 నుంచి 5 రోజులకు తగ్గిన రవాణా సమయం ♦ 25-50 నుంచి శాతం తగ్గనున్న వ్యయం ♦ పత్తి రైతులకు లాభం: పోర్టు సీఈఓ కృష్ణపట్నం పోర్టు నుంచి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి ; బంగ్లాదేశ్-భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక ఘట్టానికి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రేవు వేదికగా నిలిచింది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కుదుర్చుకున్న జల రవాణా ఒప్పందం 42 ఏళ్ల తర్వాత సోమవారం వాస్తవ రూపం దాల్చింది. గతేడాది ప్రధాని నరేంద మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించటం తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ నుంచి ‘నీసా పారిబాహన్’ సంస్థకు చెందిన ఎం.వి హార్బర్ నౌక ఈ నెల 23న బయలుదేరి సోమవారం కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. దీని ద్వారా తొలిసారిగా 40 టీఈయూ (ట్వంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్) పత్తిని బంగ్లాదేశ్‌లోని ఐసీటీ పన్గాన్ రేవుకు పంపుతున్నారు. పత్తి బేళ్ల లోడింగ్ అనంతరం ఈ నౌక మంగళవారం బయలుదేరి, ఏప్రిల్ 3న పన్గాన్ పోర్టుకు చేరుతుంది. నౌకలోకి పత్తి లోడింగ్ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.జానకి లాంఛనంగా ప్రారంభించారు. బంగ్లా ఎంపీ నూర్ ఏ అలామ్ చౌదురీ, ‘నీసా పారిబహాన్’ ఎండీ నాసిర్ అహ్మద్ చౌదురి, సీఈఓ సిరాజుర్ రెహ్మాన్, పన్గాన్ పోర్టు ఇన్‌ల్యాండ్ కంటైనర్ టెర్మినల్ మేనేజర్ అహ్మదుల్ కరీమ్ చౌదురి, కృష్ణపట్నం పోర్టు సీఈఓ అనిల్ యెండ్లూరి, కస్టమ్స్ అధికారులు కేక్ కట్ చేసి, ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి విలేకరులతో మాట్లాడారు. మాట్లాడుతూ... ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌కు నౌకల ద్వారా సరుకులు పంపించాలంటే శ్రీలంక, సింగపూర్ దేశాలు మీదుగా వెళ్లాల్సి వచ్చేదని, ఇందుకు 25 నుంచి 30 రోజుల సమయం పట్టేదని తెలియజేశారు. ‘‘ఇప్పుడు నేరుగా సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల కేవలం ఐదు రోజుల్లో బంగ్లాదేశ్‌కు చేరుకోవచ్చు. దీనివల్ల సమయంతో పాటు రవాణా వ్యయం కూడా 25 నుంచి 50 శాతం వరకు కలసి వస్తుంది’’ అని తెలియజేశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ రేవు ద్వారా తూర్పు తీర రాష్ట్రాలకు నేరుగా సరుకు రవాణా చేసే వెసులుబాటు కలిగిందన్నారు. వస్త్రాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న బంగ్లాదేశ్ భారీగా పత్తిని దిగుమతి చేసుకుంటోందని, ఇలా దిగుమతి చేసుకుంటున్న పత్తిలో తెలుగు రాష్ట్రాల వాటా 14 శాతంగా ఉందని తెలియజేశారు. ఈ జల రవాణా లింకు ఏర్పడటం వల్ల స్థానిక పత్తి రైతులకు ప్రయోజనం క లుగుతుందన్నారు. అలాగే మిరప, పప్పు దినుసులు ఎగుమతి చేయడమే కాకుండా నేరుగా జనపనార బస్తాలను దిగుమతి చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడు నూర్ ఆలమ్ చౌదరి మాట్లాడుతూ ఢాకాకు సమీపంలో టెక్స్టైల్ కంపెనీలకు కావాల్సిన ముడిసరుకును పన్గాన్లోని నదీ రేవు మార్గం వరకు నేరుగా దిగుమతి చేసుకునే వెసులుబాటు ఏర్పడిందన్నారు. రోడ్డు రవాణా వ్యయం తగ్గడమే కాకుండా, విలువైన సమయం కాపాడుకుంటూ తక్కువ రేటుతో సరుకు రవాణా చేసుకోవచ్చన్నారు. ఇండియాలోని ఇతర రేవు పట్టణాలతో నేరుగా రవాణా పెంచుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. అనంతరం ‘నీసా పారిబహాన్’ ప్రతినిధులు తమ దేశంలో ఓడ రేవుల ద్వారా సాధిస్తున్న ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎగుమతిదారుల సందేహాలను పోర్టు సీఈఓ నివృత్తి చేశారు.