ఫైనల్లో విరాట్ సేన
► సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ
బర్మింగ్హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో ఎటువంటి తడబాటు లేకుండా ఆద్యంతం ఆకట్టుకున్న విరాట్ సేన.. పాక్ తో ఆదివారం జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది.
బంగ్లాదేశ్ విసిరిన 265 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టుకు శుభారంభం లభించింది. రోహిత్ శర్మ(123 ; 129 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సు నాటౌట్) అజెయ సెంచరీ, కెప్టెన్ విరాట్ కోహ్లి (96; 78 బంతుల్లో 13 ఫోర్లు నాటౌట్) లు రాణించడంతో భారత్ 9.5 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్(46; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), తొలి వికెట్ కు 87 పరుగులు జోడించడంతో భారత్ కు గట్టి పునాది పడింది.
ఈ మ్యాచ్ లో ధావన్ తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయినప్పటికీ రోహిత్ శర్మ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి మంచి సహకారం లభించడంతో భారత గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. వీరిద్దరూ సునాయాసంగా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. విరాట్-రోహిత్ ల దూకుడుకు బంగ్లాదేశ్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఇద్దరూ చక్కటి కవర్ డ్రైవ్లు, స్ట్రైట్ డ్రైవ్లతో అలరిస్తూ బ్యాటింగ్ లో మజాను అభిమానులకు అందించారు. ఈ క్రమంలోనే ముందుగా రోహిత్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై కోహ్లి కూడా అర్థ శతకంతో మెరిశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(70;82 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫికర్ రహీమ్(61;85 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ శతకాలతో రాణించి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలి రెండు వికెట్లను సాధించి బంగ్లాకు షాకిచ్చాడు. అయితే ఆ తరుణంలో తమీమ్ కు జత కలిసిన రహీమ్ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు.
ఈ జోడి 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా పయనించింది. కాగా, తమీమ్ అవుటైన తరువాత షకిబుల్ హసన్(15), ముష్ఫికర్ రహీమ్ లు కూడా పెవిలియన్ చేరండంతో బంగ్లాదేశ్ స్కోరులో వేగం తగ్గింది. అయితే చివరి వరుస ఆటగాళ్లు మొహ్మదుల్లా(21),మొసడక్ హుస్సేన్(15), మోర్తజా(30 నాటౌట్), తస్కీన్ అహ్మద్(11నాటౌట్) లు బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్,బూమ్రా, కేదర్ జాదవ్ లు తలో రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది.