Bangladesh Test
-
దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్
ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2–0తో గెలుచుకున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను కూడా 3–0తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో సఫారీలు 200 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి జోరు ప్రదర్శించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 369 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (91; 10ఫోర్లు, 1సిక్స్) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగగా, డికాక్ (73; 9 ఫోర్లు, 1 సిక్స్)... తొలి వన్డే ఆడిన మార్క్రమ్ (66; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్, టస్కీన్ అహ్మద్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం టాపార్డర్ విఫలమవడంతో బంగ్లాదేశ్ 40.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. షకీబుల్ హసన్ (63; 8 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా, షబ్బీర్ రహమాన్ (39) రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డేన్ పీటర్సన్ 3, ఇమ్రాన్ తాహిర్, మార్క్రమ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ రెండు జట్ల మధ్య ఈనెల 26 నుంచి రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. -
నాయర్ లేదా రహానే?
తుది జట్టు ఎంపిక ఆసక్తికరం జోరు కొనసాగిస్తామన్న కుంబ్లే రెండో రోజూ భారత్ ప్రాక్టీస్ సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుతమైన ‘ట్రిపుల్ సెంచరీ’తో కరుణ్ నాయర్ సత్తా చాటాడు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో మరో సందేహం లేకుండా అతను తుది జట్టులో ఉండాలి. కానీ భారత కోచ్ అనిల్ కుంబ్లే మాత్రం అది తప్పనిసరి కాదని పరోక్షంగా సూచనలు ఇచ్చారు. నాయర్‌కు ముందు అజింక్య రహానే ఆడిన మ్యాచ్‌లను మరచిపోవద్దని ఆయన అన్నారు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల తర్వాత రహానే గాయపడటంతో నాయర్‌కు అవకాశం లభించగా, దానిని అతను పూర్తిగా సద్వినియోగ పరుచుకున్నాడు. ‘తనకు ఇచ్చిన అవకాశాన్ని నాయర్ ఉపయోగించుకోవడం మంచి పరిణామం. ఒక కుర్రాడు ట్రిపుల్ సెంచరీ సాధించడం అభినందించాల్సిన అంశమే. అలాంటి వాళ్లు ఉండటం వల్ల జట్టు బలం ఏమిటో తెలిసింది. అయితే రహానే జట్టుకు ఏం చేశాడో అందరికీ తెలుసు. అన్ని రకాల పరిస్థితుల్లో రహానే అద్భుత ప్రదర్శన కనబర్చాడు’ అని కుంబ్లే వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితుల మధ్య వీరిద్దరిలో ఎవరు తుది జట్టులో ఉంటారో చూడాలి. గురువారం నుంచి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం కుంబ్లే మీడియాతో మాట్లాడారు. సొంతగడ్డపై తమ జోరును ఈ టెస్టులోనూ కొనసాగిస్తామని కోచ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఇప్పటి వరకు మేం చాలా బాగా ఆడాం. ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతాం. బంగ్లాదేశ్‌తో టెస్టు కోసం మేం ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. మా వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయి. దాని ప్రకారం వెళితే కచ్చితంగా విజయం దక్కుతుంది’ అని కుంబ్లే అన్నారు. గతంతో పోలిస్తే బంగ్లాదేశ్ ఎంతో మెరుగైందని, దానిని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. ఓపెనర్లుగా విజయ్, రాహుల్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, ముందు జాగ్రత్త కోసమే ముకుంద్‌ను తీసుకున్నట్లు కుంబ్లే వెల్లడించారు. ఈ సీజన్లో స్పిన్నర్లతో పాటు మన పేసర్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచారన్న కోచ్... అశ్విన్, జడేజాలపై ప్రశంసలు కురిపించారు. టెస్టు ఫార్మాట్లో కూడా మంచి ఆల్‌రౌండర్ అయ్యే లక్షణాలు హార్దిక్ పాండ్యాలో ఉన్నాయని, మున్ముందు అతడిని కూడా పరీక్షించే అవకాశం ఉందని కుంబ్లే వెల్లడించారు. వరుసగా రెండో రోజు కూడా భారత జట్టు ఉప్పల్ స్టేడియంలో సుదీర్ఘ సమయం పాటు సాధన చేసింది. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో పాటు ప్రధాన మైదానంలో ఆటగాళ్ళంతా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. బంగ్లాదేశ్ జట్టు మాత్రం మంగళవారం విశ్రాంతి తీసుకుంది. ‘మళ్లీ జరగొచ్చు... జరగకపోవచ్చు’ సరిగ్గా 18 ఏళ్ల క్రితం అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. దానిని గుర్తు చేసుకుంటూ కుంబ్లే తన ఆనందం వ్యక్తం చేశారు. ‘అభిమానులు ఇలా వార్షికోత్సవాలు కూడా గుర్తుంచుకోవడం, మేం కూడా వేడుకగా జరుపుకోవడం చాలా బాగుంటుంది. అప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని 10 వికెట్లు తీస్తానని నేను అసలు ఊహించలేదు. అది అలా జరిగిపోయిందంతే. నాకు రాసి పెట్టి ఉంది. అదో అరుదైన సందర్భం. అయితే భవిష్యత్తులో అలాంటిది మళ్లీ సాధ్యం కావచ్చు లేదా ఎప్పటికీ కాకపోవచ్చు’ అని కుంబ్లే వ్యాఖ్యానించారు. అశ్విన్‌కు అచ్చొచ్చిన మైదానం... భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉప్పల్ స్టేడియంలో మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మైదానంలో ఆడిన 2 టెస్టులలో కలిపి అశ్విన్ 18 వికెట్లు పడగొట్టాడు. అతను తన కెరీర్లో తొలిసారి మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టింది ఇక్కడే. పైగా తన శైలికి ఇది సరిగ్గా సరిపోతుందని అతను చెబుతున్నాడు. ‘నేను ఈ స్టేడియాన్ని ఇష్టపడేందుకు ఇక్కడి మంచి రికార్డు ఉండటం ఒక్కటే కారణం కాదు. మొత్తం సౌకర్యాలన్నీ బాగుంటాయి. మంచి పచ్చికతో అవుట్‌ఫీల్డ్ ఆకట్టుకుంటుంది. స్పిన్నర్ల కోణంలో ఇది చాలా పెద్ద మైదానం. బంతిని గాల్లో ఎక్కువ సేపు ఉంచుతూ బౌలింగ్ చేయవచ్చు. వికెట్లో ఉండే బౌన్స్ వల్ల కొత్తగా ప్రయత్నించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ బౌలింగ్ చేయడాన్ని నేను ఇష్టపడతాను’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. పరిశీలకుడిగా రత్నాకర్ శెట్టి... భారత్, బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు బీసీసీఐ జనరల్ మేనేజర్ (గేమ్ డెవలప్మెంట్) రత్నాకర్ శెట్టిని పరిశీలకుడిగా బోర్డు నియమించింది. హెచ్‌సీఏలో గుర్తింపు పొందిన కార్యవర్గం లేకపోవడంతో హైకోర్టు చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శెట్టికి తోడుగా బోర్డు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతోష్ రంగ్నేకర్ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. కాచుకో బంగ్లాదేశ్... అద్భుతమైన ఆటతో చెలరేగిపోతున్న విరాట్ కోహ్లి గతంలో బంగ్లాదేశ్‌తో ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత కోహ్లికి అదే తొలి టెస్టు కావడం విశేషం. 2015 జూన్‌లో ఫతుల్లాలో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ఆధిక్యం ప్రదర్శించినా, వర్షం కారణంగా చివరకు ‘డ్రా’గా ముగిసింది. విజయ్, ధావన్ శతకాలు బాదిన ఆ మ్యాచ్‌లో కోహ్లి 14 పరుగులు చేసి బౌల్డయ్యాడు. ఇప్పుడు మరోసారి కెప్టెన్ హోదాలో బంగ్లాను విరాట్ ఎదుర్కోబోతున్నాడు. అతని తాజా ఫామ్ నేపథ్యంలో కోహ్లిని బంగ్లా బౌలర్లు అసలు ఆపగలరా! -
ఇన్నాళ్లూ ఒక లెక్క... ఇప్పుడొక లెక్క!
► బ్యాట్స్‌మన్‌గా ధోనికి కఠిన పరీక్ష ► కెప్టెన్‌గా ప్రతి నిర్ణయంపైనా దృష్టి సచిన్‌ను మినహాయిస్తే భారత క్రికెట్లో అత్యంత ఎక్కువ ఆదరణ ఉన్న క్రికెటర్ ధోని. ఆరేడు సంవత్సరాలుగా భారత క్రికెట్లో అతనేం చెబితే అది శాసనం. ఇన్నాళ్లూ ఇదే లెక్క. కానీ ఇప్పుడు సీన్ మారిపోతోంది. టెస్టుల నుంచి వైదొలిగిన ధోనికి గతంలో మాదిరిగా జట్టుపై పట్టు ఉండదు. అలాగే బోర్డులోనూ పెద్దలు మారిపోయారు. ఆటగాడిగా ధోని ఫామ్ పాతాళంలో ఉంది. కాబట్టి ఇకపై అతను బ్యాట్స్‌మన్‌గా కఠిన పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. అంతే కాదు... నాయకుడిగా అతను తీసుకోబోయే ప్రతి నిర్ణయంపైనా విమర్శకుల దృష్టి ఉంటుంది. సాక్షి క్రీడావిభాగం : భారత క్రికెట్లో ఆటగాళ్లకు, మీడియాకు మధ్య దూరం బాగా పెరిగింది. ఏడేళ్ల క్రితం అంతా కలిసిమెలిసి ఉండేవారు. కానీ ధోని కెప్టెన్ అయ్యాక మీడియాను బాగా దూరం పెట్టాడు. క్రికెటర్లకు మీడియా అవసరం కంటే మీడియాకే క్రికెటర్ల అవసరం ఎక్కువ అనే భావన ధోనిది. దీంతో ఒక ఆట ఆడాడు. దీనిని బలవంతంగానే మీడియా భరించింది. ఇప్పుడు క్రమంగా ధోని ప్రాభవం తగ్గిపోతోంది. అటు బోర్డులో కొత్తగా వచ్చిన పెద్దలతో పాటు టెస్టు కెప్టెన్ కోహ్లి కూడా మీడియా ‘ఫ్రెండ్లీ’ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తెచ్చారు. దీంతో ఇన్నాళ్లూ సెలైంట్‌గా ఉన్న భారత దేశ క్రికెట్ మీడియా ఒళ్లు విరిచింది. ఇక ‘టార్గెట్’ ధోని అంటూ ప్రతిదాడి చేయడానికి దాదాపుగా రంగం సిద్ధమైంది. బ్యాట్స్‌మన్‌గా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న ధోనికి ఇప్పుడు మీడియా టార్గెట్‌కు దొరక్కుండా తప్పించుకోవడం కూడా చాలా పెద్ద పని. కెప్టెన్ కూల్... కెప్టెన్ హాట్ నిజానికి భారత క్రికెట్లో చాలా మంది కుర్రాళ్లకు లైఫ్ ఇచ్చింది ధోని. ఒక రకంగా దిగ్గజాలు రిటైరైన సమయంలో జట్టు లయ దెబ్బతినకుండా కాపాడగలిగాడు. అయితే ఇదే సమయంలో ఆటగాడిగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఒక దశలో అయితే కెప్టెన్ కాకపోతే ధోని కంటే మంచి వికెట్ కీపర్‌కు స్థానం ఇచ్చేవాళ్లు. కానీ కెప్టెన్ కూల్ తన బుర్రతో భారత్‌కు అనేక విజయాలు అందించాడు. టెస్టుల నుంచి వైదొలగడం కూడా తనంతట తాను తీసుకున్న నిర్ణయమే. భారత్‌కు భవిష్యత్‌లో అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ అని భావిస్తున్న విరాట్ కోహ్లి శైలి ధోనికి పూర్తిగా భిన్నం. మైదానంలో ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం దగ్గరి నుంచి తన నిర్ణయాల వరకు అన్నింట్లోనూ దూకుడు చూపించి కెప్టెన్ హాట్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వన్డేల్లో ధోని సారథ్యంలోనే కోహ్లి ఆడాలి. ఇది కొత్తేం కాదు. 2008 నుంచి కోహ్లి ఆడుతూనే ఉన్నాడు. కానీ ఇప్పటి నుంచి పాత లెక్క ఉండకపోవచ్చు. నిస్సందేహంగా కోహ్లి అన్ని ఫార్మాట్లలోనూ భారత్ తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్. ఇక నుంచి ధోని తీసుకున్న ఏ నిర్ణయం బెడిసికొట్టినా విమర్శకులు చెలరేగిపోతారు. టెస్టుల విషయంలో భవిష్యత్ గురించి ఆలోచించినప్పుడు... వన్డేల గురించి ఎందుకు ఆలోచించలేదనే ప్రశ్న ఇప్పటికే వినిపిస్తోంది. ఇదే తొలి పరీక్ష ఇన్నాళ్లూ భారత జట్టు ఎక్కడ ఉన్నా అందులో ధోని ఉన్నాడు. ఇప్పుడు తొలిసారి మహీ లేకుండా బంగ్లాదేశ్‌లో జట్టు గడిపింది. సహజంగానే ఇప్పుడు గతంలో మాదిరిగా క్రికెటర్లపై పూర్తి పట్టు ఉండదు. గతంలో ప్రతి చిన్న విషయానికీ ధోనిని ఆశ్రయించిన సహచరులు ఇప్పుడు కోహ్లిని కూడా కలుస్తారు. ఒకే డ్రెస్సింగ్ రూమ్‌లో అనధికారికంగా రెండో ‘పవర్ సెంటర్’ ఉంటుంది. ఆటగాడిగా కూడా బంగ్లాదేశ్ సిరీస్ తనకు తొలి పరీక్ష. తొలుత ఆటగాడిగా, అలాగే నాయకుడిగా కూడా ఇప్పుడు పరీక్షకు సిద్ధం అవుతున్నాడు. కాబట్టి బంగ్లాతో మ్యాచ్‌లలో బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందుగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే బంగ్లాదేశ్ వన్డేల్లో ప్రమాదకరమైన జట్టుగా ఎదుగుతోంది. ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడం, అక్కడ భారత్ చేతిలో ఓటమికి అంపైర్లే కారణమని నిందించడం ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. అలాగే తాజాగా సొంతగడ్డపై పాకిస్తాన్‌ను వన్డేల్లో చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ఉంది. కాబట్టి ధోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. తనని తాను నిరూపించుకునే క్రమంలో పొరపాటు చేసి భారత్ గనక ఓడిపోతే.... వన్డేలకూ కోహ్లి కెప్టెన్ కావాలనే డిమాండ్ ఢాకా నుంచే మొదలవుతుంది. -
బీసీబీపై భారత్ ఆగ్రహం
బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టును ఫతుల్లాలో నిర్వహించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢాకా నగరంలో ఫతుల్లా, మిర్పూర్ ప్రాంతాలలో రెండు స్టేడియాలు ఉన్నాయి. సాధారణంగా ఏ పెద్ద జట్టు వచ్చినా మిర్పూర్‌లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తారు. భారత్‌తో మూడు వన్డేలకు కూడా మిర్పూర్ స్టేడియం వేదిక. కానీ టెస్టు మ్యాచ్‌ను ఫతుల్లాలో ఏర్పాటు చేశారు. ఇక్కడ సౌకర్యాలు సరిగా లేవు. జూన్‌లో భారీ వర్షాలు ఉంటాయని తెలిసి కూడా సరైన సౌకర్యాలు లేని స్టేడియంను ఎందుకు ఎంచుకున్నారని బీసీసీఐ ప్రశ్నించినట్లు సమాచారం. ఇక్కడి స్టేడియంలో కేవలం ఒక్క సూపర్ సాపర్ మాత్రమే ఉంది. దీంతో వర్షం ఆగినా స్టేడియంను సిద్ధం చేయడానికి సమయం పడుతోంది. మిర్పూర్లో సూపర్ సాపర్ యంత్రాలు చాలా ఉన్నాయి. కనీసం వాటిని ఇక్కడికి తీసుకొచ్చినా బాగానే ఉండేది. కానీ బీసీబీ ఇవేం చేయలేదు. కానీ బంగ్లా బోర్డు వాదన మరోలా ఉంది. మిర్పూర్తో పోలిస్తే ఫతుల్లాలో డ్రైనేజ్ వ్యవస్థ బాగుందని, ఇక్కడ స్టేడియంను సిద్ధం చేయడానికి ఒక్క సూపర్‌సాపర్ సరిపోతుందని చెబుతోంది. అయితే భారీ వర్షం వల్ల తామేమీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. మొత్తం మీద వర్షంతో పాటు సౌకర్యాల లేమి కూడా భారత్‌ను చిరాకు పరుస్తోంది. -
వెంటనే డిక్లేర్ చేస్తే మేలు
వరుణుడి పుణ్యమాని బంగ్లాదేశ్‌తో టెస్టులో ఫలితం వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. మూడు రోజులు ముగిసేసరికి కేవలం 103 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మిగిలిన రెండు రోజులు పూర్తిగా ఆట జరిగినా 180 ఓవర్లు పడతాయి. ప్రస్తుతం వాతావరణం చూస్తే చివరి రెండు రోజులు కూడా ఆట పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే అద్భుతం జరగాలి. అలా జరగాలంటే వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలి. ప్రస్తుతం మన ఖాతాలో 462 పరుగులు ఉన్నాయి. డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌ను 263 పరుగుల లోపు ఆలౌట్ చేస్తే ఫాలోఆన్ ఆడించవచ్చు. నిజానికి ఈ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ ఏకంగా 8 మంది బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగింది. ఇదే సమయంలో భారత్ ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడుతోంది. అందులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. మూడో రోజు ఆటలో బంగ్లా స్పిన్నర్లు బంతిని తిప్పిన విధానం చూస్తే... చివరి రెండు రోజులు స్పిన్నర్లు పండగ చేసుకోవచ్చు. కాబట్టి భారత్ ఓ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. -సాక్షి క్రీడావిభాగం