ఇన్నాళ్లూ ఒక లెక్క... ఇప్పుడొక లెక్క!
► బ్యాట్స్‌మన్‌గా ధోనికి కఠిన పరీక్ష
► కెప్టెన్‌గా ప్రతి నిర్ణయంపైనా దృష్టి
సచిన్‌ను మినహాయిస్తే భారత క్రికెట్‌లో అత్యంత ఎక్కువ ఆదరణ ఉన్న క్రికెటర్ ధోని. ఆరేడు సంవత్సరాలుగా భారత క్రికెట్‌లో అతనేం చెబితే అది శాసనం. ఇన్నాళ్లూ ఇదే లెక్క. కానీ ఇప్పుడు సీన్ మారిపోతోంది. టెస్టుల నుంచి వైదొలిగిన ధోనికి గతంలో మాదిరిగా జట్టుపై పట్టు ఉండదు. అలాగే బోర్డులోనూ పెద్దలు మారిపోయారు. ఆటగాడిగా ధోని ఫామ్ పాతాళంలో ఉంది. కాబట్టి ఇకపై అతను బ్యాట్స్‌మన్‌గా కఠిన పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. అంతే కాదు... నాయకుడిగా అతను తీసుకోబోయే ప్రతి నిర్ణయంపైనా విమర్శకుల దృష్టి ఉంటుంది.
సాక్షి క్రీడావిభాగం : భారత క్రికెట్‌లో ఆటగాళ్లకు, మీడియాకు మధ్య దూరం బాగా పెరిగింది. ఏడేళ్ల క్రితం అంతా కలిసిమెలిసి ఉండేవారు. కానీ ధోని కెప్టెన్ అయ్యాక మీడియాను బాగా దూరం పెట్టాడు. క్రికెటర్లకు మీడియా అవసరం కంటే మీడియాకే క్రికెటర్ల అవసరం ఎక్కువ అనే భావన ధోనిది. దీంతో ఒక ఆట ఆడాడు. దీనిని బలవంతంగానే మీడియా భరించింది. ఇప్పుడు క్రమంగా ధోని ప్రాభవం తగ్గిపోతోంది. అటు బోర్డులో కొత్తగా వచ్చిన పెద్దలతో పాటు టెస్టు కెప్టెన్ కోహ్లి కూడా మీడియా ‘ఫ్రెండ్లీ’ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తెచ్చారు.
దీంతో ఇన్నాళ్లూ సెలైంట్‌గా ఉన్న భారత దేశ క్రికెట్ మీడియా ఒళ్లు విరిచింది. ఇక ‘టార్గెట్’ ధోని అంటూ ప్రతిదాడి చేయడానికి దాదాపుగా రంగం సిద్ధమైంది. బ్యాట్స్‌మన్‌గా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న ధోనికి ఇప్పుడు మీడియా టార్గెట్‌కు దొరక్కుండా తప్పించుకోవడం కూడా చాలా పెద్ద పని.
కెప్టెన్ కూల్... కెప్టెన్ హాట్
నిజానికి భారత క్రికెట్‌లో చాలా మంది కుర్రాళ్లకు లైఫ్ ఇచ్చింది ధోని. ఒక రకంగా దిగ్గజాలు రిటైరైన సమయంలో జట్టు లయ దెబ్బతినకుండా కాపాడగలిగాడు. అయితే ఇదే సమయంలో ఆటగాడిగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఒక దశలో అయితే కెప్టెన్ కాకపోతే ధోని కంటే మంచి వికెట్ కీపర్‌కు స్థానం ఇచ్చేవాళ్లు. కానీ కెప్టెన్ కూల్ తన బుర్రతో భారత్‌కు అనేక విజయాలు అందించాడు. టెస్టుల నుంచి వైదొలగడం కూడా తనంతట తాను తీసుకున్న నిర్ణయమే.
భారత్‌కు భవిష్యత్‌లో అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ అని భావిస్తున్న విరాట్ కోహ్లి శైలి ధోనికి పూర్తిగా భిన్నం. మైదానంలో ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం దగ్గరి నుంచి తన నిర్ణయాల వరకు అన్నింట్లోనూ దూకుడు చూపించి కెప్టెన్ హాట్ అనే పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు వన్డేల్లో ధోని సారథ్యంలోనే కోహ్లి ఆడాలి. ఇది కొత్తేం కాదు. 2008 నుంచి కోహ్లి ఆడుతూనే ఉన్నాడు. కానీ ఇప్పటి నుంచి పాత లెక్క ఉండకపోవచ్చు. నిస్సందేహంగా కోహ్లి అన్ని ఫార్మాట్లలోనూ భారత్ తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్. ఇక నుంచి ధోని తీసుకున్న ఏ నిర్ణయం బెడిసికొట్టినా విమర్శకులు చెలరేగిపోతారు. టెస్టుల విషయంలో భవిష్యత్ గురించి ఆలోచించినప్పుడు... వన్డేల గురించి ఎందుకు ఆలోచించలేదనే ప్రశ్న ఇప్పటికే వినిపిస్తోంది.
ఇదే తొలి పరీక్ష
ఇన్నాళ్లూ భారత జట్టు ఎక్కడ ఉన్నా అందులో ధోని ఉన్నాడు. ఇప్పుడు తొలిసారి మహీ లేకుండా బంగ్లాదేశ్‌లో జట్టు గడిపింది. సహజంగానే ఇప్పుడు గతంలో మాదిరిగా క్రికెటర్లపై పూర్తి పట్టు ఉండదు. గతంలో ప్రతి చిన్న విషయానికీ ధోనిని ఆశ్రయించిన సహచరులు ఇప్పుడు కోహ్లిని కూడా కలుస్తారు. ఒకే డ్రెస్సింగ్ రూమ్‌లో అనధికారికంగా రెండో ‘పవర్ సెంటర్’ ఉంటుంది. ఆటగాడిగా కూడా బంగ్లాదేశ్ సిరీస్ తనకు తొలి పరీక్ష. తొలుత ఆటగాడిగా, అలాగే నాయకుడిగా కూడా ఇప్పుడు పరీక్షకు సిద్ధం అవుతున్నాడు.
కాబట్టి బంగ్లాతో మ్యాచ్‌లలో బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త ముందుగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే బంగ్లాదేశ్ వన్డేల్లో ప్రమాదకరమైన జట్టుగా ఎదుగుతోంది. ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడం, అక్కడ భారత్ చేతిలో ఓటమికి అంపైర్లే కారణమని నిందించడం ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. అలాగే తాజాగా సొంతగడ్డపై పాకిస్తాన్‌ను వన్డేల్లో చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ఉంది. కాబట్టి ధోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. తనని తాను నిరూపించుకునే క్రమంలో పొరపాటు చేసి భారత్ గనక ఓడిపోతే.... వన్డేలకూ కోహ్లి కెప్టెన్ కావాలనే డిమాండ్ ఢాకా నుంచే మొదలవుతుంది.