నాయర్‌ లేదా రహానే? | 'We remember what Rahane has done' - Kumble | Sakshi
Sakshi News home page

నాయర్‌ లేదా రహానే?

Published Wed, Feb 8 2017 12:21 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

నాయర్‌ లేదా రహానే?

నాయర్‌ లేదా రహానే?

తుది జట్టు ఎంపిక ఆసక్తికరం
జోరు కొనసాగిస్తామన్న కుంబ్లే
రెండో రోజూ భారత్‌ ప్రాక్టీస్‌   


సాక్షి, హైదరాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుతమైన ‘ట్రిపుల్‌ సెంచరీ’తో కరుణ్‌ నాయర్‌ సత్తా చాటాడు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో మరో సందేహం లేకుండా అతను తుది జట్టులో ఉండాలి. కానీ భారత కోచ్‌ అనిల్‌ కుంబ్లే మాత్రం అది తప్పనిసరి కాదని పరోక్షంగా సూచనలు ఇచ్చారు. నాయర్‌కు ముందు అజింక్య రహానే ఆడిన మ్యాచ్‌లను మరచిపోవద్దని ఆయన అన్నారు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల తర్వాత రహానే గాయపడటంతో నాయర్‌కు అవకాశం లభించగా, దానిని అతను పూర్తిగా సద్వినియోగ పరుచుకున్నాడు. ‘తనకు ఇచ్చిన అవకాశాన్ని నాయర్‌ ఉపయోగించుకోవడం మంచి పరిణామం. ఒక కుర్రాడు ట్రిపుల్‌ సెంచరీ సాధించడం అభినందించాల్సిన అంశమే. అలాంటి వాళ్లు ఉండటం వల్ల జట్టు బలం ఏమిటో తెలిసింది.

అయితే రహానే జట్టుకు ఏం చేశాడో అందరికీ తెలుసు. అన్ని రకాల పరిస్థితుల్లో రహానే అద్భుత ప్రదర్శన కనబర్చాడు’ అని కుంబ్లే వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితుల మధ్య వీరిద్దరిలో ఎవరు తుది జట్టులో ఉంటారో చూడాలి. గురువారం నుంచి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం కుంబ్లే మీడియాతో మాట్లాడారు. సొంతగడ్డపై తమ జోరును ఈ టెస్టులోనూ కొనసాగిస్తామని కోచ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఇప్పటి వరకు మేం చాలా బాగా ఆడాం. ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతాం. బంగ్లాదేశ్‌తో టెస్టు కోసం మేం ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. మా వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయి.

దాని ప్రకారం వెళితే కచ్చితంగా విజయం దక్కుతుంది’ అని కుంబ్లే అన్నారు. గతంతో పోలిస్తే బంగ్లాదేశ్‌ ఎంతో మెరుగైందని, దానిని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. ఓపెనర్లుగా విజయ్, రాహుల్‌ విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, ముందు జాగ్రత్త కోసమే ముకుంద్‌ను తీసుకున్నట్లు కుంబ్లే వెల్లడించారు. ఈ సీజన్‌లో స్పిన్నర్లతో పాటు మన పేసర్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచారన్న కోచ్‌... అశ్విన్, జడేజాలపై ప్రశంసలు కురిపించారు. టెస్టు ఫార్మాట్‌లో కూడా మంచి ఆల్‌రౌండర్‌ అయ్యే లక్షణాలు హార్దిక్‌ పాండ్యాలో ఉన్నాయని, మున్ముందు అతడిని కూడా పరీక్షించే అవకాశం ఉందని కుంబ్లే వెల్లడించారు.

వరుసగా రెండో రోజు కూడా భారత జట్టు ఉప్పల్‌ స్టేడియంలో సుదీర్ఘ సమయం పాటు సాధన చేసింది. నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌తో పాటు ప్రధాన మైదానంలో ఆటగాళ్ళంతా ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. బంగ్లాదేశ్‌ జట్టు మాత్రం మంగళవారం విశ్రాంతి తీసుకుంది.

‘మళ్లీ జరగొచ్చు... జరగకపోవచ్చు’
సరిగ్గా 18 ఏళ్ల క్రితం అనిల్‌ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. దానిని గుర్తు చేసుకుంటూ కుంబ్లే తన ఆనందం వ్యక్తం చేశారు. ‘అభిమానులు ఇలా వార్షికోత్సవాలు కూడా గుర్తుంచుకోవడం, మేం కూడా వేడుకగా జరుపుకోవడం చాలా బాగుంటుంది. అప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చొని 10 వికెట్లు తీస్తానని నేను అసలు ఊహించలేదు. అది అలా జరిగిపోయిందంతే. నాకు రాసి పెట్టి ఉంది. అదో అరుదైన సందర్భం. అయితే భవిష్యత్తులో అలాంటిది మళ్లీ సాధ్యం కావచ్చు లేదా ఎప్పటికీ కాకపోవచ్చు’ అని కుంబ్లే వ్యాఖ్యానించారు.  

అశ్విన్‌కు అచ్చొచ్చిన మైదానం...
భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఉప్పల్‌ స్టేడియంలో మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మైదానంలో ఆడిన 2 టెస్టులలో కలిపి అశ్విన్‌ 18 వికెట్లు పడగొట్టాడు. అతను తన కెరీర్‌లో తొలిసారి మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టింది ఇక్కడే. పైగా తన శైలికి ఇది సరిగ్గా సరిపోతుందని అతను చెబుతున్నాడు. ‘నేను ఈ స్టేడియాన్ని ఇష్టపడేందుకు ఇక్కడి మంచి రికార్డు ఉండటం ఒక్కటే కారణం కాదు. మొత్తం సౌకర్యాలన్నీ బాగుంటాయి. మంచి పచ్చికతో అవుట్‌ఫీల్డ్‌ ఆకట్టుకుంటుంది. స్పిన్నర్ల కోణంలో ఇది చాలా పెద్ద మైదానం. బంతిని గాల్లో ఎక్కువ సేపు ఉంచుతూ బౌలింగ్‌ చేయవచ్చు. వికెట్‌లో ఉండే బౌన్స్‌ వల్ల కొత్తగా ప్రయత్నించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ బౌలింగ్‌ చేయడాన్ని నేను ఇష్టపడతాను’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.

పరిశీలకుడిగా రత్నాకర్‌ శెట్టి...
భారత్, బంగ్లాదేశ్‌ టెస్టు మ్యాచ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు బీసీసీఐ జనరల్‌ మేనేజర్‌ (గేమ్‌ డెవలప్‌మెంట్‌) రత్నాకర్‌ శెట్టిని పరిశీలకుడిగా బోర్డు నియమించింది. హెచ్‌సీఏలో గుర్తింపు పొందిన కార్యవర్గం లేకపోవడంతో హైకోర్టు చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శెట్టికి తోడుగా బోర్డు చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ సంతోష్‌ రంగ్‌నేకర్‌ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షిస్తారు.

కాచుకో బంగ్లాదేశ్‌...  
అద్భుతమైన ఆటతో చెలరేగిపోతున్న విరాట్‌ కోహ్లి గతంలో బంగ్లాదేశ్‌తో ఒకే ఒక టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ధోని రిటైర్మెంట్‌ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత కోహ్లికి అదే తొలి టెస్టు కావడం విశేషం. 2015 జూన్‌లో ఫతుల్లాలో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ ఆధిక్యం ప్రదర్శించినా, వర్షం కారణంగా చివరకు ‘డ్రా’గా ముగిసింది. విజయ్, ధావన్‌ శతకాలు బాదిన ఆ మ్యాచ్‌లో కోహ్లి 14 పరుగులు చేసి బౌల్డయ్యాడు. ఇప్పుడు మరోసారి కెప్టెన్‌ హోదాలో బంగ్లాను విరాట్‌ ఎదుర్కోబోతున్నాడు. అతని తాజా ఫామ్‌ నేపథ్యంలో కోహ్లిని బంగ్లా బౌలర్లు అసలు ఆపగలరా!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement