శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్‌ సెంచూరియన్‌ | County Championship Division One 2023: Karun Nair Slams Century Against Surrey - Sakshi
Sakshi News home page

ఇరగదీస్తున్న టీమిండియా ట్రిపుల్‌ సెంచూరియన్‌.. అజేయ సెంచరీతో..!

Published Wed, Sep 20 2023 7:01 PM | Last Updated on Wed, Sep 20 2023 7:11 PM

Karun Nair Slams Hundred Vs Surrey In County Division 1 Match - Sakshi

టీమిండియా తరఫున ఆడిన మూడో టెస్ట్‌ మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ చేసి, భారత్‌ తరఫున సెహ్వాగ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ప్రసిద్ధి చెంది, ఆతర్వాత మరో 4 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడి కనుమరుగైపోయిన కరుణ్‌ నాయర్‌.. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌ 1 పోటీల్లో ఇరగదీస్తున్నాడు. భారత దేశవాలీ క్రికెట్‌లో సొంత జట్టు కర్ణాటక కాదనుకుంటే విదర్భకు వలస వెళ్లి, అక్కడ కెరీర్‌ పునఃప్రారంభించిన నాయర్‌.. ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని తనను కాదనుకున్న వారికి బ్యాట్‌తో సమాధానం​ చెప్పాడు.

ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ఆడే అవకాశాన్ని దక్కించుకున్న నాయర్‌.. తానాడిన తొలి మ్యాచ్‌లో (వార్విక్‌షైర్‌) అర్ధసెంచరీ (78), రెండో మ్యాచ్‌లో ఏకంగా అజేయ సెంచరీ (144 నాటౌట్‌; 22 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ ప్రదర్శనతో అయినా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్న నాయర్‌.. తన మనసులోని మాటను ఇటీవలే ట్విటర్‌ వేదికగా బహిర్గతం చేశాడు. డియర్‌ క్రికెట్‌.. నాకు మరో ఛాన్స్‌ ఇవ్వు అంటూ నాయర్‌ తనలోని అంతర్మథనానికి వెల్లగక్కాడు. ప్రస్తుత కౌంటీ సీజన్‌లో నార్తంప్టన్‌షైర్‌ తరఫున కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్న నాయర్‌.. తాజాగా ప్రదర్శనతో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. 

టెస్ట్‌ల్లో టీమిండియాను మిడిలార్డర్‌ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో సెలెక్టర్లు నాయర్‌ ప్రదర్శనను ఏమేరకు పరిగణలోకి తీసుకుంటారో వేచి చూడాలి. నాయర్‌.. సుదీర్ఘ ఫార్మాట్‌తో పాటు పొట్టి క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. ఇటీవల ముగిసిన కర్ణాటక టీ20 టోర్నీలో (మహారాజా ట్రోఫీ) అతను 12 మ్యాచ్‌ల్లో 162.69 స్ట్రయిక్‌రేట్‌తో ఏకంగా 532 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. గుల్భర్గా మిస్టిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో అతను చేసిన సెంచరీ టోర్నీ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. భారత్‌ తరఫున 6 టెస్ట్‌లు, 2 వన్డేలు ఆడిన నాయర్‌.. మొత్తంగా 420 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. 31 ఏళ్ల నాయర్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో చేసిన ఏకైక సెంచరీ ట్రిపుల్‌ సెంచరీ (303 నాటౌట్‌) కావడం​ విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement