Bank of America Merrill Lynch
-
2019 నాటికి రెండో స్థానానికి అమెజాన్!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఆన్లైన్ రిటైల్ పోర్టల్ ‘అమెజాన్’ 2019 నాటికి భారత్‌లో రెండో అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా అవతరిస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా వేసింది. అలాగే అమెజాన్‌కు అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ అవుతుందని అభిప్రాయపడింది. ‘గడచిన రెండు నెలల్లో అమెజాన్ ఇండియా స్థూల అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ కన్నా (మింత్రా మినహా) ఎక్కువగా ఉన్నాయి. 2015లో 21 శాతంగా ఉన్న అమెజాన్ జీఎంవీ (గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యు) మార్కెట్ వాటా 2019 నాటికి 37 శాతానికి పెరగొచ్చు. ఇది ఫ్లిప్‌కార్ట్ కన్నా కొంత తక్కువ’ అని వివరించింది. ఇక 2025 నాటికి అమెజాన్ ఇండియా జీఎంవీ విలువ 81 బిలియన్ డాలర్లకు, ఆపరేటింగ్ ప్రాఫిట్ 2.2 బిలియన్ డాలర్లకు చేరొచ్చని తెలిపింది. ఇక దేశీ ఈ-కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ అగ్రస్థానంలో కొనసాగుతోందని పేర్కొంది. -
మన ఐటీ రంగంపై పరిమితంగానే గ్రీసు సంక్షోభ ప్రభావం
న్యూఢిల్లీ: గ్రీసు సంక్షోభ ప్రభావం భారత్‌లోని ఐటీ కంపెనీల ఆదాయాలపై 1-2 శాతంగా ఉంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్’ (బీఓఎఫ్ఏ-ఎంఎల్) తెలిపింది. యూరో-రూపీ మారకపు రేట్ల ప్రభావం, యూరప్‌లోని ఇతర దేశాల అభివృద్ధి వంటి అంశాలు ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతాయని వివరించింది. భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలు యూరప్‌తో సంబంధాలను కలిగి ఉన్నాయని, గ్రీసుతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని పేర్కొంది. భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉత్తర యూరప్ దేశాలు, స్విట్జర్లాండ్ వంటి దేశాలతో సంబంధాలను కలిగి ఉన్నాయని తెలిపింది. -
సెన్సెక్స్ కంపెనీల్లో ఎఫ్ఐఐల రికార్డు పెట్టుబడులు
న్యూఢిల్లీ: లాభాల దూకుడు చూపుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు సైతం పుంజుకుంటున్నాయి. సెప్టెంబర్ క్వార్టర్ ముగిసేసరికి సెన్సెక్స్ షేర్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు 27%కు చేరుకున్నాయి. ఇది సరికొత్త రికార్డుకాగా, జూన్ క్వార్టర్ చివరికి ఇవి 22.5%గా నమోదయ్యాయి. ఈ వివరాలను గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ మెరిల్లించ్ ఒక నివేదికలో వెల్లడించింది. ఎఫ్ఐఐలు అత్యధిక స్థాయిలో పెట్టుబడులకు దిగిన రంగాల జాబితాలో సాఫ్ట్వేర్, ఇంధనం చోటు చేసుకున్నాయి. ఇంధన సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ షేర్లను ఎఫ్ఐఐలు కొనుగోలు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఇక కన్జూమర్, టెలికాం, ఫైనాన్షియల్ రంగాలు సైతం ఎఫ్ఐఐలకు ఫేవరెట్‌గా నిలిచినట్లు పేర్కొంది. -
ఏడాది చివరికల్లా 27,000కు సెన్సెక్స్
ముంబై: మోడీ ప్రభుత్వం తీసుకురానున్న సంస్కరణల నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 27,000 పాయింట్లను తాకే అవకాశముందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్(బీవోఎఫ్‌ఏఎంఎల్) పేర్కొంది. అయితే రుతుపవనాల మందగమనం, ఇరాక్ సంక్షోభం వంటి అంశాల కారణంగా సమీపకాలంలో మార్కెట్లో కన్సాలిడేషన్‌కు అవకాశమున్నదని ఇండియా స్ట్రాటజీ నివేదికలో ఈ అమెరికన్ బ్రోకరేజీ సంస్థ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైల్వే ప్రయాణికుల టికెట్ ధరలతోపాటు, సరుకు రవాణా చార్జీలను కూడా పెంచడంతో బడ్జెట్‌కంటే ముందుగానే మార్కెట్‌పై సానుకూల ప్రభావం పడిందని వ్యాఖ్యానించింది. పన్ను రేట్లు స్థిరంగానే ఉన్నాయని, బడ్జెట్లో వీటి విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని తెలిపింది. దీంతో కంపెనీ ఆదాయాలపై నామమాత్ర ప్రభావమే ఉంటుందని అంచనా వేసింది. బడ్జెట్‌తో ప్రభుత్వ లక్ష్యాలు మరింత స్పష్టమవుతాయని తెలిపింది. ద్రవ్యలోటు కట్టడిపై దృష్టి జూలై 10న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ద్రవ్యలోటు కట్టడిపై దృష్టిపెట్టే అవకాశమున్నదని బీవోఎఫ్‌ఏఎంఎల్ అంచనా వేసింది. స్థూల ద్రవ్యలోటును జీడీపీలో 4.1%కు కట్టడి చేయడానికే ప్రస్తుత బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందని అభిప్రాయపడింది. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన పన్ను లక్ష్యాల విషయంలో జైట్లీ కొంత వెసులుబాటు కల్పించవచ్చునని బీవోఎఫ్‌ఏఎంఎల్ అభిప్రాయపడింది. అన్నీ మంచి శకునములే: ఫిచ్, మూడీస్ ముంబై: నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభావంతో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రగతి బాటన పయనిస్తుందన్న విశ్వాసాన్ని ప్రముఖ రేటింగ్ సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.5 శాతానికి మెరుగుపడుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ మంగళవారం అంచనావేసింది. ఇక మరో ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్- కొత్త ప్రభుత్వం సబ్సిడీల్లో కోత నిర్ణయం దేశ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) క్రెడిట్ పాజిటివ్‌గా మారుస్తుందని పేర్కొంది. తొలి అడుగులు అదుర్స్: అరవింద్ సుబ్రమణ్యన్ ఇదిలాఉండగా, ఆర్థిక రంగంలో మోడీ ప్రభుత్వ తొలి అడుగులు బాగున్నట్లు అమెరికాలో స్థిరపడిన ప్రముఖ భారత ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. వృద్ధి బాటలో సుదీర్ఘకాలం ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ, నెల రోజుల కాలంలో ఆర్థిక నిర్ణయాలు వృద్ధికి దోహదపడేవిగా ఉన్నట్లు తన స్కోర్ కార్డ్‌లో తెలిపారు. గడచిన 30 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిందని అన్నారు.