ఏడాది చివరికల్లా 27,000కు సెన్సెక్స్ | Reforms to drive Sensex to 27000 at year end: BofAML | Sakshi
Sakshi News home page

ఏడాది చివరికల్లా 27,000కు సెన్సెక్స్

Published Wed, Jul 2 2014 2:09 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

ఏడాది చివరికల్లా 27,000కు సెన్సెక్స్ - Sakshi

ఏడాది చివరికల్లా 27,000కు సెన్సెక్స్

ముంబై: మోడీ ప్రభుత్వం తీసుకురానున్న సంస్కరణల నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 27,000 పాయింట్లను తాకే అవకాశముందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్(బీవోఎఫ్‌ఏఎంఎల్) పేర్కొంది. అయితే రుతుపవనాల మందగమనం, ఇరాక్ సంక్షోభం వంటి అంశాల కారణంగా సమీపకాలంలో మార్కెట్లో కన్సాలిడేషన్‌కు అవకాశమున్నదని ఇండియా స్ట్రాటజీ నివేదికలో ఈ అమెరికన్ బ్రోకరేజీ సంస్థ అభిప్రాయపడింది.

 కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైల్వే ప్రయాణికుల టికెట్ ధరలతోపాటు, సరుకు రవాణా చార్జీలను కూడా పెంచడంతో బడ్జెట్‌కంటే ముందుగానే మార్కెట్‌పై సానుకూల ప్రభావం పడిందని వ్యాఖ్యానించింది. పన్ను రేట్లు స్థిరంగానే ఉన్నాయని, బడ్జెట్‌లో వీటి  విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని తెలిపింది. దీంతో కంపెనీ ఆదాయాలపై నామమాత్ర ప్రభావమే ఉంటుందని అంచనా వేసింది. బడ్జెట్‌తో ప్రభుత్వ లక్ష్యాలు మరింత స్పష్టమవుతాయని తెలిపింది.

 ద్రవ్యలోటు కట్టడిపై దృష్టి
 జూలై 10న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ద్రవ్యలోటు కట్టడిపై దృష్టిపెట్టే అవకాశమున్నదని బీవోఎఫ్‌ఏఎంఎల్  అంచనా వేసింది. స్థూల ద్రవ్యలోటును జీడీపీలో 4.1%కు కట్టడి చేయడానికే ప్రస్తుత బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందని అభిప్రాయపడింది. మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను లక్ష్యాల విషయంలో జైట్లీ కొంత వెసులుబాటు కల్పించవచ్చునని బీవోఎఫ్‌ఏఎంఎల్  అభిప్రాయపడింది.

 అన్నీ మంచి శకునములే: ఫిచ్, మూడీస్
 ముంబై: నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభావంతో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రగతి బాటన పయనిస్తుందన్న విశ్వాసాన్ని ప్రముఖ రేటింగ్ సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు  5.5 శాతానికి మెరుగుపడుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ మంగళవారం అంచనావేసింది. ఇక మరో ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్-  కొత్త ప్రభుత్వం సబ్సిడీల్లో కోత నిర్ణయం దేశ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) క్రెడిట్ పాజిటివ్‌గా మారుస్తుందని పేర్కొంది.

 తొలి అడుగులు అదుర్స్: అరవింద్ సుబ్రమణ్యన్
 ఇదిలాఉండగా, ఆర్థిక రంగంలో మోడీ ప్రభుత్వ తొలి అడుగులు బాగున్నట్లు అమెరికాలో స్థిరపడిన ప్రముఖ భారత ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. వృద్ధి బాటలో సుదీర్ఘకాలం ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ, నెల రోజుల కాలంలో ఆర్థిక నిర్ణయాలు వృద్ధికి దోహదపడేవిగా ఉన్నట్లు తన స్కోర్ కార్డ్‌లో తెలిపారు. గడచిన 30 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement