కుడి ఎడమయ్యాయి..
♦ వృద్ధుడి అంతర్ అవయవాల కూర్పులో తేడా
♦ అరుదైన వ్యక్తికి బైపాస్ సర్జరీ
కర్నూలు (హాస్పిటల్): నీ గుండెపై చెయ్యి వేసుకుని చెప్పు అని ఎవరైనా అంటే.. వెంటనే కుడి చేతిని ఎడమ వైపు ఛాతీపై పెట్టుకుంటారు. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా సి.బెళగల్‌కు చెందిన 67 ఏళ్ల బన్నూరు నాగప్ప మాత్రం ఎడమ చేతిని కుడివైపు ఛాతీపై ఉంచుకుంటారు. ఇదేమి టి.. గుండె ఎడమ వైపున కదా ఉండాల్సింది అని ఆలోచిస్తున్నారా? మీరనుకున్నట్టు ఎడమ వైపునే ఉండాలి. కానీ, ఈయనకు మాత్రం కుడివైపున ఉంది.
గుండె మాత్రమే కాదు.. జీర్ణాశయం కూడా కుడి వైపునే ఉంది. కుడిపక్కన ఉండాల్సిన కాలేయం ఎడమ వైపున.. ఇలా కుడివైపున ఉండాల్సిన అవయవాలు ఎడమ వైపున, ఎడమ వైపున ఉండాల్సిన అవయవాలు కుడి వైపున ఉన్నాయి. ఇన్నేళ్లుగా ఆయనకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. కానీ, ఇటీవల గుండె నొప్పి రావడంతో కుటుంబసభ్యులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు అవయవాల అమరిక చూసి ఆశ్చర్యపోయారు. పది వేల మందిలో ఒకరికి ఇలా అవయవాల అమరిక ఉంటుందని చెప్పారు.
గుండెలో మూడు రక్తనాళాలు పూడుకుపోయి ఉండటంతో ఆరు రోజుల క్రితం బైపాస్ సర్జరీ చేసి ప్రాణం పోశారు. ఆసుపత్రిలో గురువారం కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీనారాయణాచారి మీడి యాకు ఈ వివరాలను వెల్లడించారు. కుడి వైపు ఉన్న గుండెకు బైపాస్ సర్జరీని పూర్తిగా అద్దంలో చూసినట్లుగా చేయాలని చెప్పారు. సమావేశంలో కార్డియాలజిస్టులు డాక్టర్ చైతన్యకుమార్, డాక్టర్ తేజానం ద్‌రెడ్డి, డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.