Bapu Bomma
-
Bapu: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము
‘నేనయితే కింద సంతకం లేకపోయినా సరే! బాపు బొమ్మని గుర్తుపడతాను’ అని కొంతమంది అమాయకంగా అమాయకమై పోతుంటారు. అలా అవనవసరం లేదు. రేఖ పండిన చిత్రకారులకి సంతకం అవసరం లేదు. వారి బొమ్మే సంతకం అవుతుంది. మరి బాపు గొప్పతనమంతా సంతకంలో కాక మరెక్కడుంది అని మీరెవరైనా అడిగితే నేను ఇలా చెబుతాను. అనగనగా అనేక కథలు మన సాహిత్యానికి ఉన్నాయి. ఒకానొక బంగారు కాలంలో ఆ కథలన్నిటికీ అరచేయంత కొలత దగ్గరి నుండి, రెండు పేజీల వరకు వ్యాపించిన డబుల్ డమ్మీ ఇలస్ట్రేషన్లను బాపు బొమ్మలు కట్టేరు. తన క్రియేటివిటీతో సమకాలీన తెలుగు సాహిత్యాన్ని అమరం చేశారు. కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశాన్ని అడుగుతాడు ‘ఏమి వాయ్! క్రియేషన్ అనగానేమీ?’ దానికి వెంకటేశం ఏమి చెప్పాడో మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు మాత్రం నేను చెప్పేది వినండి. క్రియేషన్ అనగా తెల్లని కాగితంపై మూడు అక్షరాల నల్లని అచ్చుగా మాత్రమే ఉండిన గిరీశం అనే ఒక పేరుకి ‘ఇదిగో ఇంత ఎత్తు, ఇది నుదురు, ఇలా పంచె అని కట్టి, చేతిలో చుట్ట పెట్టి మన మెవ్వరమూ ఎప్పటికీ ఊహించలేని ఒక ఊహకు రూపం ఇచ్చి మనకు పరిచయం చేయడమన్నది బాపు చేసిన క్రియేషన్. గిరీశం కానీ, మధురవాణి కానీ, సౌజన్యరావు పంతులు కానీ, బుచ్చమ్మ కానీ ఇలా ఉంటారు అని ఆ గురజాడ అప్పారావు తమ పుస్తకంలో ఎక్కడా వర్ణన చేయలేదు. కానీ బాపు వారందరికీ ఒక రంగూ, ఒక రూపం, ఒక లక్షణం, ఒక ధోరణి, ఒక రీతి ఇచ్చి వారిని బొమ్మలుగా మలిచి మనకు మప్పారు. ఒకసారి బాపు బొమ్మల్లో వారిని చూశాక... వారు అలా కాక మరి ఇంకోలా ఉండటానికి మన ఇమాజినేషన్లో కుదరదు. బాపు బొమ్మ అంటే ఒక సంతకం కాదు. పేరు కాదు. కాసింత కాగితం, కలం మాత్రమే కలిసి దిద్దిన కల్పన కాదు. అంత కాక మరెంత? అనడిగితే, అదీ చెబుతా. తొంబైల నాటి తరం మాది. మేము చదువుకున్న కథా సాహిత్యమంతా కొకు కథా సంపుటాలు, శ్రీపాద కథా సంపుటాలు, రావిశాస్త్రి కథా సంపు టాలు. మా తరానికి ఆ కథలు తొలినాళ్లల్లో అచ్చ యిన ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, యువ, జ్యోతి లాంటి అనేకానేక పుస్తక పుటలు తిరగేయడం కుదరలేదు. తరవాత్తరువాత ఆ పాత పుస్తకాలు, అందులో వాటికి వేసిన బొమ్మలు చూసే అవకాశం దొరికినపుడు, ఒకోసారి ఇంటర్నెట్లో పైన కథ పేరు కూడా లేని చాలా బాపు బొమ్మలను చూసినపుడు... నా కళ్ళకు కనపడింది బొమ్మ కాదు అచ్చంగా కథలే. చలపతి, దాసూ పూర్వాశ్రమంలో సహధ్యాయులు, వారిద్దరి మధ్య పెద్ద స్నేహమేం ఏర్పడలేదు. చదువుల అనంతరం ఎన్నో ఏళ్ళ తరువాత అనుకోకుండా చలపతికి దాసు కనపడతాడు. చలపతికి పెళ్ళి కావాల్సిన రాజ్యం అనే చెల్లెలు ఉంది. చలపతి దాసూని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంట్లో చలపతి, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు, రాజ్యం ఉంటారు. అ చదువుకున్న మధ్యతరగతి ఇల్లు, ఈ దంపతులు, ఆ పిల్లలు, వంటగదిలోంచి రెండు లోటాలతో కాఫీ తెస్తున్న రాజ్యం, కుర్చీలో కూచుని బుగ్గన సొట్టతో నవ్వుతున్న దాసు. ఈ బొమ్మని, వీటితో పాటూ అదే కథకు బాపు చిత్రించిన మరికొన్ని బొమ్మలని చూసిన నాకు ఒక్కసారిగా ఆ కథ మొత్తం నోటికి తగిలింది. బొమ్మ బొమ్మలో వెంకమ్మ, భాగ్యమ్మ, గోపీ, సత్యం అనే అందరినీ గుర్తు పట్టగలిగాను. ఈ కథే కాదు. బాపు వేసిన ఎన్నో బొమ్మల్లో ఆ కథలనూ, అందులోని మనుష్యులనూ గుర్తుపట్టి థ్రిల్లవుతూ వారిని చేయి పట్టి ఊపి షేక్ హాండ్ ఇచ్చిన అనుభవాలు నాకు కొల్లలు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) దీనిని మించిన మరో అద్భుత సంఘటనను మీకు చెబుతా. భారత దేశానికి గాలిబ్ కవితా, తాజమహలూ మరవరాని అందాలు అని ఒక మహానుభావుడు అన్నాడుట. మరి గాలిబ్ కవితకు ఏమిటి అందం? ఏ చేతులది చందం? అని వెదుక్కుంటూ బంగారం వంటి కవి దాశరథి, గొప్ప పబ్లిషర్ ఎంఎన్ రావు బాపును కలిశారు, ఆయనకు గాలిబ్ గీతాల అనువాదం ఇచ్చారు. వాటన్నిటికీ బాపు బొమ్మలు వేశారు. ఆ తరువాత ఆ పుస్తకం సాధించిన ఘన కీర్తి, తెలుగు వారి హృదయాలలో సంపాదించుకున్న సుస్థిర యశస్సు అందరికీ తెలిసినదే. అయితే చాలా మందికి తెలియని ఒక గొప్ప విషయం, బాపు బొమ్మకే అందిన అందలం ఏమిటంటే, దాశరథి గాలిబ్ గీతాల తెలుగు అనువాదం పుచ్చుకుని ఒక్క తెలుగు అక్షరం కూడా ఎరుగని ఎక్కడెక్కడి ఉర్దూ కవులూ కేవలం బాపు బొమ్మల్ని చూసి గాలిబ్ ఉరుదూ మూలం చదివేవారుట. ఇంతకూ చెప్పదలుచుకున్నదేమిటంటే... ‘ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, మరియొకడు బాపుయగుట ఎంతో దుష్కరమ్ము సుమ్ము.’ – అన్వర్ (డిసెంబర్ 16న బాపు జయంతి; తెలుగు యూనివర్సిటీలో బాపు–రమణ పురస్కారాల ప్రదానం) -
చీరపైన బాపూ బొమ్మ
బాపు బొమ్మల అందం గురించి ఎంత వర్ణించినా.. మనవైన చేనేతల ఘనత గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు. ఇక, ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చిన కళా సోయగాలను ఎంత చూసినా తనివి తీరవు. ఆ అందమైన కాంబినేషన్‌ను నారాయణపేట చేనేత చీరల మీదకు వచ్చేలా రూపుకట్టారు హైదరాబాద్ వాసి, ఫ్యాషన్ డిజైనర్ హేమంత్‌సిరి. ఈ కొత్త కాంబినేషన్ గురించి, ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఆమె మాటల్లోనే.. ‘నాలుగేళ్లుగా ప్రతి యేడాది ఆగస్టు నెలలో మన తెలుగురాష్ట్రాల చేనేత కారులతో కలిసి ‘తస్రిక’ పేరుతో ఒక వేడుక నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా గతంలో హ్యాండ్లూమ్స్ని యువత కోసం ఇండోవెస్ట్రన్ డ్రెస్‌లు రూపొందించాను. ఈ క్రమంలోనే నారాయణ పేట చేనేతకారులను కలిసినప్పుడు, వారి డిజైన్స్ చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నారాయణ పేట చీరలు సాధారణంగా ప్లెయిన్లోనే ఉంటాయి. అయితే అందరినీ ఆకర్షించాలంటే వీటిలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు అనిపించింది. దీంతో కిందటేడాది లేపాక్షి డిజైన్స్‌ని నారాయణ పేట్ కాటన్ శారీస్మీదకు తీసుకువచ్చాం. బాపూ స్మరణం ఈ నెలలో బొమ్మల బాపూ వర్ధంతి ఉంది. హ్యాండ్లూమ్ డే కూడా ఈ ఆగస్టు నెలలోనే. బాపూగారిని తలుచుకోగానే మనకు ఆ ముగ్గులు, బొమ్మలు.. మన మదిలో అలా నిలిచిపోతాయి. దీంతో ఈ యేడాది బాపూ బొమ్మలను డిజిటల్ ప్రింట్లుగా నారాయణ పేటæపట్టు చీరల మీదకు తీసుకువచ్చాను. ఆ బొమ్మల రూపును నా డ్రెస్ డిజైన్స్పైకి తీసుకురావాలనే ఆలోచన కొన్నాళ్లుగా ఉంది. కానీ, నారాయణ పేట హ్యాండ్లూమ్స్కైతే మరింత బాగుంటుందని అనుకున్నాను. నారాయణæపేట పట్టు చీరల మీద డిజిటల్ ప్రింట్ల అందం గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకున్నది కూడా దీని వెనక ఉన్న ఉద్దేశ్యం. ఈ బాపూ బొమ్మల కాన్సెప్ట్‌ని ఐఎఎస్ హరిచందన, ఇతర అధికారులు చాలా అభినందించారు. చేనేత కారులకు మార్కెటింగ్ ప్లెయిన్‌గా ఉన్న హ్యాండ్లూమ్స్కి మరిన్ని హంగులు అద్దడం వల్ల ప్రజల్లోకి వీరి చేనేతలు మరింత వేగంగా వెళతాయి. చీరలపై డిజిటల్ ప్రింట్లు సులువుగానూ వేయచ్చు. స్థానికంగా బ్లాక్‌ప్రింట్, డిజిటల్ ప్రింట్ యూనిట్స్‌ని ప్రభుత్వం గానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఏర్పాటు చేయగలిగితే చేనేత కారులకు మరిన్ని అవకాశాలు మెరుగవుతాయి. నారాయణ పేటæ చీరలు అనగానే పెద్దవాళ్లు కట్టుకునేవి అనే అభిప్రాయం ఉండేది. ఆ ఆలోచన మార్చాలనే టీనేజర్స్ కూడా ఇష్టపడేలా పేస్టల్ కలర్స్, మోటిఫ్స్లోనూ మార్పులు తీసుకురావడంపై కృషి జరుగుతోంది. చేనేతకారులకు అవకాశాలు మెరుగవడానికి చేస్తున్న చిరు ప్రయత్నం ఇది’ అని వివరించారు ఈ ఫ్యాషన్ డిజైనర్. – నిర్మలారెడ్డి -
నాడు బాపూ బొమ్మలు... నేడు బాప్రే భామలు...
హైదరాబాద్ అమ్మాయిలు ఆధునిక కాలానికి తగ్గట్టు తమను తాము సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నారు. సుతిమెత్తగానో, సున్నితంగానో ఉంటేనో సరిపోయే కాలం కాదని వారికి అర్థమైంది. నిర్భయ కావచ్చు. ఫొటో జర్నలిస్ట్ కావచ్చు... రోజుకో చోట చోటుచేసుకుంటున్న మృగాళ్ల అకృత్యాల వల్ల కావచ్చు... సిటీ అమ్మాయిల ఆలోచనా ధోరణిలో సమూల మార్పు.. నరనరాన బలం పుంజుకుంటున్నారు. ప్రపంచం ఎంత విస్తరిస్తున్నా అంతకంతకూ కుంచించుకుపోతున్న కొందరు మగవాళ్ల అనాగరిక ప్రవర్తనల్ని ఎదుర్కోవడానికి సర్వశక్తులూ కూడదీసుకుంటున్నారు. కఠినమైన మార్గాన్ని ఎంచుకుని విజేతలుగా నిలిచిన నగరంలోని మహిళల విజయాలు వీరికి స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఒక్కసారిగా ఆడపిల్లల్లో వచ్చిన మార్పుకు నిదర్శనంగా సిటీలోని మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్, అడ్వంచర్స్ క్లబ్బులు అమ్మాయిల సందడితో హల్ చల్ చేస్తున్నాయి. సిగ్గుల మొగ్గవుతూ... గుమ్మం చాటున నిలబడి కాలిగోళ్లతోనే ముగ్గులు వేసే బాపూబొమ్మల శకం అంతరించింది. అబ్బాయిలతో సమానంగా రఫ్ఫాడిస్తున్న రఫ్ అండ్ టఫ్ గాళ్స్ రాజ్యం మొదలైంది. ఆడ, మగ అంతరాల్ని తగ్గించే క్రమంలో... ఇద్దరి మధ్యా ఉన్న వ్యత్యాసాలు కూడా అంతరించిపోతున్న నేపథ్యంలో... నగర జీవనశైలి అమ్మాయిల్ని ఉక్కు మహిళలుగా మార్చేస్తోంది. రేపటి తరం ఆడపిల్లలు అనుక్షణం అణిచివేతల్ని, వేటగాళ్ల వేధింపుల్ని తట్టుకోలేక తమను తాము మగవాళ్లకు దీటుగా మలచుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆడవాళ్లు కలలో కూడా ఊహించలేని రంగాల్లోకి ప్రవేశిస్తూ విజయాలు సాధిస్తున్నారు. మరింత మందికి ప్రేరణ కలిగిస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందనగానే కలిగేంత బాధ ఇప్పుడు లేదు. పుట్టిన దగ్గర్నుంచీ ఆ అమ్మాయిని అబ్బాయిలాగా పెంచాలనే తపన తప్ప. ‘మా అమ్మాయిని చిన్నప్పటి నుంచీ ఆడపిల్ల అనుకోలేదు. అబ్బాయిలతో సమానంగా పెంచాను’ అని చెప్పారు బేగంపేట నివాసి రాకేష్ గులాటి. ప్రస్తుతం ఆయన కుమార్తె ఆ పెంపకానికి తగ్గట్టే... క్రీడల్లో అబ్బాయిలతో సమానంగా దూసుకుపోతోంది. తన కూతురు భద్రతకు సంబంధించి తనకు ఎలాంటి భయం.. బెంగాలేవని ఆయన ధీమాగా చెబుతున్నారు. ఒత్తిడి, వేధింపులే పాఠంగా... కాలు కదిపితే చాలు కామపుచూపులు, వేలు తాకినా చాలన్నట్టు వేధింపులు... అమ్మాయిల్లో వ్యవస్థను జయించాలన్నంత కసి పెరిగేందుకు కొంతవరకూ దోహదం చేస్తున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. పొద్దున లేస్తే ఉరుకులపరుగుల జీవనం. కెరీర్ కోసమో, కుటుంబం కోసమో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకునే ఆడపిల్లలు తమ ఓర్పే తమ శక్తిగా మార్చుకుంటున్నారు. ఏ శారీరక సామర్థ్యం చూసుకునైతే కొందరు మగవాళ్లు విర్రవీగుతున్నారో, తమపై భౌతిక దాడులకు దిగుతున్నారో ఆ సామర్థ్యాన్ని తాము సైతం సంతరించుకోవడానికి అమ్మాయిలు తహతహలాడుతున్నట్టు కరాటే శిక్షకురాలు సుగుణ చెప్పారు. ఇటీవలి కాలంలో నగరంలోని కరాటేస్కూల్స్లో చేరుతున్న ఆడపిల్లల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని పలువురు ట్రైనర్స్ తెలిపారు. సాహసాలు... విజయాలు... గత కొన్నేళ్లుగా హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్లో నమోదు చేసుకుంటున్న సభ్యుల్లో అమ్మాయిల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని క్లబ్ ప్రతినిధి చెప్పారు. ఒకప్పుడు మొత్తం సభ్యుల్లో వీరి సంఖ్య 5 శాతం లోపు ఉండేదని, అయితే ఇటీవల అది బాగా పెరిగి 25 శాతానికి చేరిందన్నారు. మగవాళ్లు సైతం తటపటాయించే రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్... వంటి కొన్ని ప్రమాదభరిత సాహసాలకు సైతం అమ్మాయిలు సై అంటున్నారని వివరించారాయన. విమానం, రైలు... వంటి వాహనాలు నిన్నా మొన్నటి దాకా పురుషులే నడిపేవారు. అయితే మన నగరానికి చెందిన మహిళ సత్యవతి రైలుని, పాతబస్తీ అమ్మాయి సల్వా ఫాతిమా విమానం నడిపే అర్హత సాధించారు. ఇక బ్లాక్బెల్ట్లు, మార్షల్ ఆర్ట్స్‌లో బ్రూస్లీ వారసత్వాన్ని కొనసాగించడానికి విల్లా మేరీ కాలేజీ అమ్మాయి సయ్యదా ఫాలక్ వంటి వారు సిద్ధంగా ఉన్నారు. ఆమె ఇప్పటికే పలు మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో విజయాలు నమోదు చేసింది. మగవాళ్లకే సొంతం అని అందరూ భావిస్తూ వచ్చిన సిక్స్‌ప్యాక్‌ని సాధించి, తొలి సిక్స్‌ప్యాక్ మహిళగా నగరానికి చెందిన కిరణ్డెంబ్లా అవతరించారు. ఇలా అదీ ఇదీ అని కాకుండా నిన్నా మొన్నటి వరకు స్త్రీకి నేనే రక్ష అనుకుంటూ చెలరేగిపోయిన మగవాళ్లు విస్తుపోయేలా మానసికంగానే కాదు శారీరకంగానూ తన సత్తా నిరూపించుకుంటోంది నగర వనిత. ‘నిర్భయంగా... మా నాన్నగారు సివిల్ ఇంజినీర్. ఇంట్లో ఇద్దరం ఆడపిల్లలమే. అయినా మాకు ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. ఏ పనైనా మేమే స్వయంగా చేసుకునేలా తీర్చిదిద్దారు. స్కూల్లో ఎక్స్కర్షన్స్, పిక్నిక్లు ఏవున్నా పంపేవారు. ప్రపంచాన్ని చూడండి అని ప్రోత్సహించేవారు. ‘ఖాళీగా ఉన్నప్పుడు బస్‌లో వెళ్లి మొత్తం రోడ్లన్నీ తిరిగిరా సిటీ అంతా తెలుస్తుంది’ అని చెబుతారు. ఇవాళయినా, రేపయినా స్వయంగా నువ్వు అన్నీ పరిష్కరించుకోవాలనేది ఆయన చెప్పే మాట. ఎవరెన్ని చెప్పినా ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అవెలా ఉన్నాయంటే... ఒక ఆడపిల్లగా... సిటీలో తిరిగితే తప్ప అర్థం కావు. అవన్నీ మేం భరిస్తూ వచ్చాం. అయితే అలాంటివి ఇంటివరకూ తీసుకురాం. స్వయంగా మేమే చూసుకుంటాం. పోకిరీలకు ఎలా సమాధానం చెప్పాలో మాకు తెలుసు. అమ్మాయిలా వయ్యారంగా తయారై వెళితే మరింతగా కామెంట్స్ చేస్తారు. అందుకే మేం కావాలని బైక్ నేర్చుకున్నాం. రాత్రి సమయాల్లో కూడా జర్కిన్ లాంటివి ధరించి రఫ్‌గా కనిపిస్తాం. అంతేకాదు స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్‌లో ఎక్కువ మంది అబ్బాయిలే. మా అక్క నేను ఇద్దరం బైక్ నడుపుతాం. ప్రస్తుతం జరుగుతున్న ఉదంతాలు చూస్తుంటే ప్రభుత్వం ఏమీ చేయదని అర్థమైపోయింది. ఒంటరిగా ఉన్నవారే కాదు అబ్బాయిలతో ఉన్నా రక్షణ లేదని తెలుస్తోంది. మమ్మల్ని మేం రక్షించుకునే విధానాల్ని అలవాటు చేసుకున్నాం. - మేడికొండ దివ్య, వినీలా, బంజారాహిల్స్ ఇలా పెంచితే... భళా... * ఆడపిల్ల అంటూ అతి జాగ్రత్తలు చెప్పడం కంటే తమను తాము రక్షించుకోవాలని చెప్పడమే మేలు * మగపిల్లలకు దూరంగా ఉంచడం వల్ల లాభం లేదు. వారితో ఉంటూనే వారి వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియజెప్పాలి * చిన్నప్పటి నుంచీ క్రీడలు, సాహసయాత్రలు అలవాటు చేయాలి. ఒంటరిగా ప్రయాణాలకు భయపడకూడదని చెప్పాలి. * వంచిన తల ఎత్తకుండా, పోకిరీలను, రోమియోల కామెంట్లను భరిస్తూంటే... అవి ముదిరి పాకానపడతాయి కాబట్టి... ఆయా సందర్భాలను స్వయంగా ఎదుర్కొనేందుకు సిద్ధం చేయాలి. * కసరత్తులు, క్రీడలు, మార్షల్ ఆర్ట్స్... ఇవన్నీ ఇప్పుడు మగవారికన్నా ఆడవాళ్లకే బాగా అవసరం. కాబట్టి అలాంటి రంగాలపై మక్కువ పెంచేలా ఆయా రంగాల్లో విజయాలు సాధించినవారి కథలు వినిపించాలి.