హైదరాబాద్ అమ్మాయిలు ఆధునిక కాలానికి తగ్గట్టు తమను తాము సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నారు. సుతిమెత్తగానో, సున్నితంగానో ఉంటేనో సరిపోయే కాలం కాదని వారికి అర్థమైంది. నిర్భయ కావచ్చు. ఫొటో జర్నలిస్ట్ కావచ్చు... రోజుకో చోట చోటుచేసుకుంటున్న మృగాళ్ల అకృత్యాల వల్ల కావచ్చు... సిటీ అమ్మాయిల ఆలోచనా ధోరణిలో సమూల మార్పు.. నరనరాన బలం పుంజుకుంటున్నారు. ప్రపంచం ఎంత విస్తరిస్తున్నా అంతకంతకూ కుంచించుకుపోతున్న కొందరు మగవాళ్ల అనాగరిక ప్రవర్తనల్ని ఎదుర్కోవడానికి సర్వశక్తులూ కూడదీసుకుంటున్నారు. కఠినమైన మార్గాన్ని ఎంచుకుని విజేతలుగా నిలిచిన నగరంలోని మహిళల విజయాలు వీరికి స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఒక్కసారిగా ఆడపిల్లల్లో వచ్చిన మార్పుకు నిదర్శనంగా సిటీలోని మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్, అడ్వంచర్స్ క్లబ్బులు అమ్మాయిల సందడితో హల్ చల్ చేస్తున్నాయి.
సిగ్గుల మొగ్గవుతూ... గుమ్మం చాటున నిలబడి కాలిగోళ్లతోనే ముగ్గులు వేసే బాపూబొమ్మల శకం అంతరించింది. అబ్బాయిలతో సమానంగా రఫ్ఫాడిస్తున్న రఫ్ అండ్ టఫ్ గాళ్స్ రాజ్యం మొదలైంది. ఆడ, మగ అంతరాల్ని తగ్గించే క్రమంలో... ఇద్దరి మధ్యా ఉన్న వ్యత్యాసాలు కూడా అంతరించిపోతున్న నేపథ్యంలో... నగర జీవనశైలి అమ్మాయిల్ని ఉక్కు మహిళలుగా మార్చేస్తోంది. రేపటి తరం ఆడపిల్లలు అనుక్షణం అణిచివేతల్ని, వేటగాళ్ల వేధింపుల్ని తట్టుకోలేక తమను తాము మగవాళ్లకు దీటుగా మలచుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆడవాళ్లు కలలో కూడా ఊహించలేని రంగాల్లోకి ప్రవేశిస్తూ విజయాలు సాధిస్తున్నారు. మరింత మందికి ప్రేరణ కలిగిస్తున్నారు.
ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందనగానే కలిగేంత బాధ ఇప్పుడు లేదు. పుట్టిన దగ్గర్నుంచీ ఆ అమ్మాయిని అబ్బాయిలాగా పెంచాలనే తపన తప్ప. ‘మా అమ్మాయిని చిన్నప్పటి నుంచీ ఆడపిల్ల అనుకోలేదు. అబ్బాయిలతో సమానంగా పెంచాను’ అని చెప్పారు బేగంపేట నివాసి రాకేష్ గులాటి. ప్రస్తుతం ఆయన కుమార్తె ఆ పెంపకానికి తగ్గట్టే... క్రీడల్లో అబ్బాయిలతో సమానంగా దూసుకుపోతోంది. తన కూతురు భద్రతకు సంబంధించి తనకు ఎలాంటి భయం.. బెంగాలేవని ఆయన ధీమాగా చెబుతున్నారు.
ఒత్తిడి, వేధింపులే పాఠంగా...
కాలు కదిపితే చాలు కామపుచూపులు, వేలు తాకినా చాలన్నట్టు వేధింపులు... అమ్మాయిల్లో వ్యవస్థను జయించాలన్నంత కసి పెరిగేందుకు కొంతవరకూ దోహదం చేస్తున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. పొద్దున లేస్తే ఉరుకులపరుగుల జీవనం. కెరీర్ కోసమో, కుటుంబం కోసమో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకునే ఆడపిల్లలు తమ ఓర్పే తమ శక్తిగా మార్చుకుంటున్నారు. ఏ శారీరక సామర్థ్యం చూసుకునైతే కొందరు మగవాళ్లు విర్రవీగుతున్నారో, తమపై భౌతిక దాడులకు దిగుతున్నారో ఆ సామర్థ్యాన్ని తాము సైతం సంతరించుకోవడానికి అమ్మాయిలు తహతహలాడుతున్నట్టు కరాటే శిక్షకురాలు సుగుణ చెప్పారు. ఇటీవలి కాలంలో నగరంలోని కరాటేస్కూల్స్‌లో చేరుతున్న ఆడపిల్లల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని పలువురు ట్రైనర్స్ తెలిపారు.
సాహసాలు... విజయాలు...
గత కొన్నేళ్లుగా హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్‌లో నమోదు చేసుకుంటున్న సభ్యుల్లో అమ్మాయిల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని క్లబ్ ప్రతినిధి చెప్పారు. ఒకప్పుడు మొత్తం సభ్యుల్లో వీరి సంఖ్య 5 శాతం లోపు ఉండేదని, అయితే ఇటీవల అది బాగా పెరిగి 25 శాతానికి చేరిందన్నారు. మగవాళ్లు సైతం తటపటాయించే రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్... వంటి కొన్ని ప్రమాదభరిత సాహసాలకు సైతం అమ్మాయిలు సై అంటున్నారని వివరించారాయన. విమానం, రైలు... వంటి వాహనాలు నిన్నా మొన్నటి దాకా పురుషులే నడిపేవారు. అయితే మన నగరానికి చెందిన మహిళ సత్యవతి రైలుని, పాతబస్తీ అమ్మాయి సల్వా ఫాతిమా విమానం నడిపే అర్హత సాధించారు.
ఇక బ్లాక్‌బెల్ట్‌లు, మార్షల్ ఆర్ట్స్‌లో బ్రూస్‌లీ వారసత్వాన్ని కొనసాగించడానికి విల్లా మేరీ కాలేజీ అమ్మాయి సయ్యదా ఫాలక్ వంటి వారు సిద్ధంగా ఉన్నారు. ఆమె ఇప్పటికే పలు మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో విజయాలు నమోదు చేసింది. మగవాళ్లకే సొంతం అని అందరూ భావిస్తూ వచ్చిన సిక్స్‌ప్యాక్‌ని సాధించి, తొలి సిక్స్‌ప్యాక్ మహిళగా నగరానికి చెందిన కిరణ్‌డెంబ్లా అవతరించారు. ఇలా అదీ ఇదీ అని కాకుండా నిన్నా మొన్నటి వరకు స్త్రీకి నేనే రక్ష అనుకుంటూ చెలరేగిపోయిన మగవాళ్లు విస్తుపోయేలా మానసికంగానే కాదు శారీరకంగానూ తన సత్తా నిరూపించుకుంటోంది నగర వనిత.
‘నిర్భయంగా...
మా నాన్నగారు సివిల్ ఇంజినీర్. ఇంట్లో ఇద్దరం ఆడపిల్లలమే. అయినా మాకు ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. ఏ పనైనా మేమే స్వయంగా చేసుకునేలా తీర్చిదిద్దారు. స్కూల్లో ఎక్స్‌కర్షన్స్, పిక్నిక్‌లు ఏవున్నా పంపేవారు. ప్రపంచాన్ని చూడండి అని ప్రోత్సహించేవారు. ‘ఖాళీగా ఉన్నప్పుడు బస్‌లో వెళ్లి మొత్తం రోడ్లన్నీ తిరిగిరా సిటీ అంతా తెలుస్తుంది’ అని చెబుతారు. ఇవాళయినా, రేపయినా స్వయంగా నువ్వు అన్నీ పరిష్కరించుకోవాలనేది ఆయన చెప్పే మాట.
ఎవరెన్ని చెప్పినా ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అవెలా ఉన్నాయంటే... ఒక ఆడపిల్లగా... సిటీలో తిరిగితే తప్ప అర్థం కావు. అవన్నీ మేం భరిస్తూ వచ్చాం. అయితే అలాంటివి ఇంటివరకూ తీసుకురాం. స్వయంగా మేమే చూసుకుంటాం. పోకిరీలకు ఎలా సమాధానం చెప్పాలో మాకు తెలుసు. అమ్మాయిలా వయ్యారంగా తయారై వెళితే మరింతగా కామెంట్స్ చేస్తారు. అందుకే మేం కావాలని బైక్ నేర్చుకున్నాం. రాత్రి సమయాల్లో కూడా జర్కిన్ లాంటివి ధరించి రఫ్‌గా కనిపిస్తాం.
అంతేకాదు స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్‌లో ఎక్కువ మంది అబ్బాయిలే. మా అక్క నేను ఇద్దరం బైక్ నడుపుతాం. ప్రస్తుతం జరుగుతున్న ఉదంతాలు చూస్తుంటే ప్రభుత్వం ఏమీ చేయదని అర్థమైపోయింది. ఒంటరిగా ఉన్నవారే కాదు అబ్బాయిలతో ఉన్నా రక్షణ లేదని తెలుస్తోంది. మమ్మల్ని మేం రక్షించుకునే విధానాల్ని అలవాటు చేసుకున్నాం.
- మేడికొండ దివ్య, వినీలా, బంజారాహిల్స్
ఇలా పెంచితే... భళా...
* ఆడపిల్ల అంటూ అతి జాగ్రత్తలు చెప్పడం కంటే తమను తాము రక్షించుకోవాలని చెప్పడమే మేలు
* మగపిల్లలకు దూరంగా ఉంచడం వల్ల లాభం లేదు. వారితో ఉంటూనే వారి వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియజెప్పాలి
* చిన్నప్పటి నుంచీ క్రీడలు, సాహసయాత్రలు అలవాటు చేయాలి. ఒంటరిగా ప్రయాణాలకు భయపడకూడదని చెప్పాలి.
* వంచిన తల ఎత్తకుండా, పోకిరీలను, రోమియోల కామెంట్లను భరిస్తూంటే... అవి ముదిరి పాకానపడతాయి కాబట్టి... ఆయా సందర్భాలను స్వయంగా ఎదుర్కొనేందుకు సిద్ధం చేయాలి.
* కసరత్తులు, క్రీడలు, మార్షల్ ఆర్ట్స్... ఇవన్నీ ఇప్పుడు మగవారికన్నా ఆడవాళ్లకే బాగా అవసరం. కాబట్టి అలాంటి రంగాలపై మక్కువ పెంచేలా ఆయా రంగాల్లో విజయాలు సాధించినవారి కథలు వినిపించాలి.
నాడు బాపూ బొమ్మలు... నేడు బాప్‌రే భామలు...
Published Sun, Sep 1 2013 12:15 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM