సందేశ్‌ఖాలీలో తుపాను!
బరాసత్/కోల్‌కతా: సందేశ్‌ఖాలీలో తుపాను మొదలైందని, అది పశ్చిమ బెంగాల్‌ను చుట్టుముట్టడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అరాచకాలు, అకృత్యాలకు మారుపేరైన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహిళా శక్తి మట్టి కరిపించడం తథ్యమని అన్నారు. బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లా కేంద్రమైన బరాసత్ పట్టణంలో బుధవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారీశక్తి వందన్ సభలో ఆయన ప్రసంగించారు.
సందేశ్‌ఖాలీలో మహిళలపై నేరాలు సిగ్గుచేటన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, మహిళల భద్రతను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. బాధితుల్లో తిరుగుబాటు మొదలైందని, సందేశ్‌ఖాలీలో పుట్టిన తుఫాను రాష్ట్రాన్ని ముంచెత్తి తృణమూల్‌ను గద్దె దింపుతుందని అన్నారు. సందేశ్‌ఖాలీ అంశంలో హైకోర్టులో, సుప్రీంకోర్టులో మమత ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయని గుర్తుచేశారు.
బాధితులకు న్యాయం చేకూరుస్తాం
పశి్చమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లో అత్యాచారాలకు, అకృత్యాలకు గురైన మహిళలకు న్యాయం చేకూరుస్తామని, తగిన భద్రత కలి్పస్తామని ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు. అనంతరం సందేశ్‌ఖాలీ నుంచి వచి్చన మహిళలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐదుగురు బాధితులతో స్వయంగా మాట్లాడారు.
తృణమూల్ కాంగ్రెస్ నాయకుల అరాచకాలపై నిర్భయంగా పోరాడుతున్న సందేశ్‌ఖాలీ మహిళలను దుర్గా మాతతో పోల్చారు. బాధితుల గోడు విని ఆయన చలించిపోయారు. ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసా కలి్పంచారు. మరోవైపు సందేశ్‌ఖాలీ నుంచి నారీశక్తి వందన్ సభకు బస్సుల్లో వస్తున్న మహిళలను బెంగాల్ పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. బీజేపీ నాయకులు వారితో ఘర్షణకు దిగారు. కొంతమంది మహిళలు మాత్రమే సభకు
రాగలిగారు.
లాలూ కుటుంబం నేరగాళ్లమయం
బేటియా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు బిహార్‌లో అతిపెద్ద నేరుగాళ్లని మోదీ ఆరోపించారు. పదేళ్ల ఆర్జేడీ పాలనలో బిహార్‌ను జంగిల్‌రాజ్ మార్చేశారని మండిపడ్డారు. బిహార్‌లో పశ్చిమ చంపారన్ జిల్లాలోని భేటియాలో రూ.12,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.
అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అప్పట్లో ఆర్జేడీ–కాంగ్రెస్ దుష్పరిపాలన వల్ల బిహార్ యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వారసత్వ రాజకీయాలు చేసేవారు తనపై మాటల దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇండియా కూటమి నేతలు రాముడిని కూడా కించపరుస్తున్నారన్నారు. దేశం పేదరికం నుంచి బయటపడాలంటే, మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో అతి పెద్దదిగా వ్యవస్థగా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు కట్టబెట్టాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.
కోల్‌కతాలో అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ప్రారంభం
దేశంలోనే మొట్టమొదటి జలాంతర్భాగ మెట్రో రైలు సొరంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. కోల్‌కతా మెట్రోరైల్ నెట్‌వర్క్‌లో భాగంగా హుగ్లీ నది దిగువన ఈ సొరంగాన్ని నిర్మించారు. ఎస్‌ప్లానాడి నుంచి హౌరా మైదాన్ స్టేషన్ వరకు మెట్రో రైలులో మోదీ ప్రయాణించారు. రైలులో తనతోపాటు ప్రయాణించిన పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. అదే మార్గంలో ఎస్‌ప్లానాడి స్టేషన్‌కు తిరిగివచ్చారు.
ఈస్ట్–వెస్ట్ కారిడార్‌లో అంతర్భాగమైన 4.8 కిలోమీటర్ల ఎస్‌ప్లానాడి–హౌరా మైదాన్ మెట్రో మార్గాన్ని రూ.4,960 కోట్లతో నిర్మించారు. ఈ మార్గంలో దేశంలోనే అత్యంత లోతైన రైల్వే స్టేషన్ ఉంది. ఉపరితలం నుంచి 32 మీటర్ల దిగువన హౌరా మెట్రో స్టేషన్‌ను నిర్మించారు. కోల్‌కతాలో బుధవారం మరికొన్ని రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మొత్తం రూ.15,400 కోట్ల విలువైన మెట్రో రైలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు.