బీజేపీ జాతీయ కార్యదర్శికి గాయాలు
కోల్ కతా: పోలీసులతో జరిగిన ఘర్షణలో బీజేపీ నాయకులు గాయపడిన ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. 'చట్ట అతిక్రమణ' కార్యక్రమంలో భాగంగా నార్త్ 24 పరగణ జిల్లాలోని బరసాత్ లో ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది.
ఈ ఘటనలో బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ నాథ్ సింగ్ సహా 15 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తోపులాటలో 10 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. పోలీసులు తమపై లాఠిచార్జి చేశారని సిద్ధార్థ నాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని విమర్శించారు. రాజకీయ నేతలను, కార్యకర్తలను నేరస్తులుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. తీవ్రవాదులు, నేరస్తులను తృణమూల్ కాంగ్రెస్ అల్లుళ్ల మాదిరిగా చూస్తోందని మండిపడ్డారు.
లాఠిచార్జి చేయలేదని, తోపులాటలో బీజేపీ నాయకులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, దుష్పరిపాలన సాగుతోందని ఆరోపిస్తూ బీజేపీ 'చట్ట అతిక్రమణ' ఆందోళనకు దిగింది.