ఈసారైనా పీసీ సర్కార్ మాయ చేస్తారా?
తాజ్ మహల్ తో సహా ఎన్నింటినో మాయం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇంద్ర జాలికుడు పీసీ సర్కార్ జూనియర్ గత ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. గతంలో పలుపార్టీల తరపు నుంచి పోటి చేసి ఓటమి పాలైన పీసీ సర్కార్ మళ్లీ 2014లో తన అదృష్ణాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు. అయితే బీజేపీ ఎన్నడూ గెలువని బరసాత్ లోకసభ స్థానం నుంచి పోటికి సిద్దమయ్యారు. సామాన్య ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తానని సర్కార్ హమీల వర్షం కురిపిస్తున్నారు.
బరసాత్ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడానికి వచ్చాను. ఓటరు నాడిని పట్టుకుని విజయం సాధిస్తాననే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎన్నికల తర్వాత బరసాత్ నియోజకవర్గం నుంచి మాయం కాను అని సర్కార్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 23 ఏళ్లలో ఈ స్థానంలో బీజేపీ విజయం సాధించిన దాఖలాలు లేవు. 1991లో మాత్రం హరాసిత్ ఘోష్ అనే అభ్యర్థి బీజేపీకి 14 శాతం ఓట్లను సంపాదించిపెట్టారు. అయితే 2009లో బీజేపీకి కేవలం 5.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అనేక సంవత్సరాలు వామపక్షాలతో కలిసి ఉన్న సర్కార్.. దేశంలో మోడీ ప్రభంజనం వీస్తుండటంతో ఇటీవల బీజేపీ లో చేరారు.