Bareilly district
-
Up: బరేలీలో ఉద్రిక్తత.. జ్ఞానవాపిపై జైల్‌భరోకు పిలుపు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటు దేశంలో ముస్లింలపై అణిచివేతకు నిరసనగా బరేలిలో ముస్లిం మతపెద్ద తఖీర్ రజా శుక్రవారం జైల్ భరో పిలుపునిచ్చారు. తన అభిమానులంతా బరేలీలోని వీధుల్లోకి వచ్చి అరెస్టవ్వాలని కోరారు. దీంతో వేలాది సంఖ్యలో రజా అభిమానులు బరేలీలోని ఇస్లామియా మైదానంలో గుమిగూడారు. శుక్రవారం నమాజ్‌కు కొద్దిసేపటి ముందే రజా జైల్ భరో పిలుపునివ్వడంతో ఆయన అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీంతో బరేలీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రజా అభిమానులు గుమిగూడిన ఇస్లామియా కాలేజ్ మైదానాన్ని పోలీసులు చుట్టుముట్టారు. బరేలీలోని మసీదుల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. జైల్ భరో పిలుపు కారణంగా రజాను పోలీసులు అరెస్టు చేసి కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. ప్రస్తుతం బరేలీలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. కాగా, బరేలీకి ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చెలరేగిన హింసపైనా రజా స్పందించారు. దేశంలో బుల్డోజర్ల దాడిని ఇక ఎంత మాత్రం సహించేది లేదన్నారు. సుప్రీం కోర్టే తమను పట్టించుకోకపోతే ఇక తమను తామే కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. ఉత్తరాఖండ్‌లో హింస.. ఐదుగురి మృతి -
హిజ్రా అని అందరూ నవ్వుతున్నారు..
బరేలీ: అమ్మాయి లక్షణాలున్న తనను అందరూ హిజ్రా అని పిలుస్తున్నారంటూ ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. చావుకు గల కారణాలు వివరిస్తూ రాసిన సూసైడ్ నోట్ అతడి గదిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీలోని సుభాష్ నగర్‌కు చెందిన పదహారేళ్ల బాలుడు పదవ తరగతి చదువుతున్నాడు. సోమవారం అతని తండ్రి మార్కెట్ వెళ్లగా, సోదరుడు మరో గదిలో చదువుకుంటున్నాడు. ఈ సమయంలో అతను గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో పోలీసులకు ఆత్మహత్య లేఖ లభించింది. అందులో.. "నాన్న.. నేను మంచి కొడుకును కానందుకు నన్ను క్షమించు. నీలాగా నేను సంపాదించలేను. నా ముఖం అమ్మాయిలా కనిపించడమే కాక, అమ్మాయి లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. (దారుణం: హిజ్రాలకు కరోనాతో ముడిపెట్టారు!) నేను హిజ్రానా అని నాకూ అనుమానమేస్తోంది. నా వల్ల నీ జీవితం చీకటిమయం కాకూడదు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా. మరో జన్మంటూ ఉంటే నేను అమ్మాయిగా పుట్టాలని నన్ను ఆశీర్వదించు. మన కుటుంబంలో ఆడపిల్ల పుడితే నేనే మళ్లీ జన్మించానని భావించండి" అని రాసుకొచ్చాడు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి మాట్లాడుతూ.. "తన కొడుకు మామూలుగానే ఉండేవాడు. కానీ కొంతమంది వాడిని తప్పుగా అర్తం చేసుకుని కించపరుస్తూ మాట్లాడేవారు. అతడు తన తమ్ముడిని బాగా చూసుకునేవాడు. నేను లేనప్పుడు వంట కూడా చేసేవాడు. కొన్నిసార్లు మాత్రం స్త్రీలలాగా మేకప్ వేసుకుని డ్యాన్స్ చేసేవాడు" అని పేర్కొన్నాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్లాగా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని మృతుడి సోదరుడు పేర్కొన్నాడు. (వలస కార్మికులపై బ్లీచ్ స్ప్రే) -
ముఖం, శరీరంపై 101 కత్తి గాట్లు.. ఆపై..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూత వైద్యంలో భాగంగా రేణు అనే మహిళను ఆమె కుటుంబ సభ్యులే పాశవికంగా హింసించిన ఘటన బరేలీ జిల్లాలో జరిగింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఓ మహిళను గురువారం బరదార్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గురించి ఎస్సై నరేష్ త్యాగీ మాట్లాడుతూ.. ‘ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ గ్రామానికి చెందిన రేణుకు ఎనిమిదేళ్ల క్రితం సంజయ్‌తో వివాహం జరిగింది. గత కొద్ది రోజులుగా సంజయ్ తండ్రి జగదీష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో బాధితురాలి వదిన మోనీ(సంజయ్ సోదరి) తన తండ్రి అనారోగ్యాన్ని నయం చేయడానికి భూతవైద్యాన్ని నేర్చుకుంది. రేణుపై తన విద్యను ప్రదర్శించబోయింది. ఈ క్రమంలో రేణు ముఖం, ఇతర శరీర భాగాలపై మోనీ దాదాపు101 కత్తి గాట్లు పెట్టింది’ అని ఎస్సై పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో నిందితురాలు మోనీకి ఆమె భర్త, సోదరుడు సంజయ్‌లు కూడా సహకరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పరుగెత్తే క్రమంలో ఆమె రోడ్డుపై స్పృహ\ కోల్పోయిందని.. ఆ సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు రేణును గుర్తించి హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. రేణు పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూకి తరలించారని.. రేణు సోదరుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా రెండు రోజుల తర్వాత మెలకువలోకి వచ్చిన రేణు ఫిర్యాదు మేరకు ఈ కేసుపై విచారణ జరిపి.. మోనీని అరెస్టు చేయగా.. ఆమె భర్త, సోదరుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై నరేష్ మీడియాకు తెలిపారు. -
కాస్గంజ్ అల్లర్లు.. కలెక్టర్ పోస్టుతో ప్రకంపనలు
లక్నో : కాస్గంజ్ మత ఘర్షణలపై బరేలీ కలెక్టర్ తన ఫేస్బుక్లో చేసిన ఓ పోస్టు ప్రకంపనలు రేపుతోంది. అల్లర్లపై కలెక్టర్ ఆర్ విక్రమ్ సింగ్ ఆదివారం అల్లర్లపై ఓ సందేశం పోస్టు చేశారు. ముస్లింల ప్రాంతాల్లోకి వెళ్లి వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేయాల్సిన అవసరం ఏంటన్న? ప్రశ్నను ఆయన సంధించటంతో అది కాస్త వివాదాస్పదంగా మారింది. పోస్ట్ పూర్తి సారాంశం... ‘‘ఓ కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చింది. ఘర్షణలు చెలరేగినప్పుడల్లా కొందరు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. మాట్లాడితే ఇస్లాం ప్రజల ఇళ్ల ముందుకు వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? వారేమైన పాకిస్థాన్ వాసులా? కాదు కదా! అని పేర్కొంటూ ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్టు ఒకదానిని పెట్టారు. గతేడాది బరేలీలో జరిగిన ఘర్షణల ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చారు. కొందరు కన్వరియాలు(శైవ భక్తులు) ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలోకి పాక్ వ్యతిరేకంగా వెళ్లి నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలోనే నా నివాసం కూడా ఉంది. బయటికొచ్చిన నేను వారిని అలా చేయొద్దని వారించాను. కానీ, వారు నా మాట వినలేదు. ఇంతగా మత పిచ్చి వాళ్లకు ఎందుకు? ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తాయి అంటూ పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. రాజ్యాంగబద్ధమైన పదవి హోదాలో మతపరమైన వ్యాఖ్యలు చేయటాన్ని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తప్పుబడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి రాజేష్ అగర్వాల్(బరేలీ ఎమ్మెల్యే కూడా) ‘సింగ్ పోస్టు’పై స్పందించారు. ‘‘ఆయన(ఆర్వీ సింగ్) చేసిన పోస్ట్‌ను చూడలేదు. ఆర్మీలో పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. సొంత దేశానికి వ్యతిరేకంగా.. పాక్‌కు అనుకూలంగా ఆయన మాట్లాడి ఉంటాడని నేను అనుకోను’ అని మంత్రి మీడియాతో చెప్పారు. విక్రమ్ సింగ్ అధికారిక ఫేస్ బుక్‌లోని కొంత భాగం స్క్రీన్ షాట్ ఇక విమర్శలపై సింగ్ స్పందించారు.‘ఇది చాలా చిన్న విషయం. అయినా భూతద్ధంలో చూస్తున్నారు. కాస్గంజ్ ఎస్పీని బదిలీ చేశారు. నిజాయితీగా పని చేస్తున్న నాలాంటి అధికారిపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ అభివృద్ధికి ఆటంకాలే’అని సింగ్ చెప్పారు. గణతంత్ర్య దినోత్సవ వేడుకలో భాగంగా విద్యార్థి సంఘాలు బద్దూ నగర్లో ‘తిరంగ ర్యాలీ’ నిర్వహించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి అది కాస్త హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో యువకులు గాయపడ్డారు. మరుసటి రోజు చెలరేగిన ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలను నిలిపవేశారు. మొత్తం 80 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరిస్థితి సర్దుమణగటంతో మంగళవారం ఉదయం నుంచి కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ప్రకటించారు. -
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మిస్సింగ్
సాక్షి, యూపీ: భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కీలక నేత మిస్సింగ్ కేసు ఉత్తర ప్రదేశ్ లో సంచలనంగా మారింది. బరేలీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర సింగ్ రాథోడ్ గత మూడు రోజులుగా కనిపించకుండాపోయారు. మంగళవారం రాథోడ్ మధురకు బయలుదేరారు. అయితే అప్పటి నుంచే ఆయన ఆచూకీ లభించకుండా పోయింది. కుటుంబ సభ్యులతోపాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆయన కోసం వెతకటం ప్రారంభించారు. అయినా లాభం లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. ప్రత్యేక బృందాలు ఆయన ఆచూకీ కోసం రంగంలోకి దిగినా లాభం లేకపోయింది. రాథోడ్ గాలింపు కోసం మరిన్ని బృందాలను నియమించినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆకతాయికి అమ్మాయి చెప్పుదెబ్బ
బరేలి: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. దుండగుల దాడిలో ఎందరో మహిళలు బలవుతున్నారు. కాగా కొంతమంది అమ్మాయిలు తమను వేధించినవారిని తగినబుద్ధి చెప్పి, ఇతరుల్లో ధైర్యం కలిగిస్తున్నారు. ఓ అమ్మాయి ఆకతాయిపై తిరగబడి తగినశాస్తి చేసింది. యూపీలోని బరేలి జిల్లాలో అసభ్యకర మాటలతో వేధించిన ఆకతాయిని అమ్మాయి చితకబాదింది. బాధితురాలు తనను వేధించిన ఆకతాయి గురించి స్నేహితులు, కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు నిందితుడిని పట్టుకుని ఓ చోట కూర్చోబెట్టి ఆ అమ్మాయితో దేహశుద్ధి చేయించారు. బాధితురాలు చెప్పు తీసుకుని పలుమార్లు నిందితుడిని కొట్టింది. మొహంపై ఉమ్మేసి చివాట్లు పెట్టింది. అక్కడున్న యువకులు కొందరు నిందితుడిని కాళ్లతో తన్నారు. కాగా ఇది ఏ ప్రాంతంలో, ఎప్పుడు జరిగింది అన్న విషయాలు తెలియరాలేదు. అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. -
పోలీసులు పట్టుకుంటారని...
లక్నో: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు గురువారం తెలిపారు. బుధవారం రాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసులను నుంచి తప్పించుకునేందుకు దినేశ్, సతీశ్ అనే వ్యక్తులు రామ్ గంగా నదిలోకి దూకారు. నీటిలో మునిగి వీరిద్దరూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. 12 మోటార్ బైకులు, పలు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. డీఐజీ ఆర్కేఎస్ రాథోడ్, ఐజీ విజయ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా భద్రతా బలగాలను తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.