పోలీసులు పట్టుకుంటారని...
లక్నో: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు గురువారం తెలిపారు.
బుధవారం రాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసులను నుంచి తప్పించుకునేందుకు దినేశ్, సతీశ్ అనే వ్యక్తులు రామ్ గంగా నదిలోకి దూకారు. నీటిలో మునిగి వీరిద్దరూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. 12 మోటార్ బైకులు, పలు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.
డీఐజీ ఆర్కేఎస్ రాథోడ్, ఐజీ విజయ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా భద్రతా బలగాలను తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.