లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటు దేశంలో ముస్లింలపై అణిచివేతకు నిరసనగా బరేలిలో ముస్లిం మతపెద్ద తఖీర్ రజా శుక్రవారం జైల్ భరో పిలుపునిచ్చారు. తన అభిమానులంతా బరేలీలోని వీధుల్లోకి వచ్చి అరెస్టవ్వాలని కోరారు.
దీంతో వేలాది సంఖ్యలో రజా అభిమానులు బరేలీలోని ఇస్లామియా మైదానంలో గుమిగూడారు. శుక్రవారం నమాజ్‌కు కొద్దిసేపటి ముందే రజా జైల్ భరో పిలుపునివ్వడంతో ఆయన అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీంతో బరేలీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రజా అభిమానులు గుమిగూడిన ఇస్లామియా కాలేజ్ మైదానాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
బరేలీలోని మసీదుల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. జైల్ భరో పిలుపు కారణంగా రజాను పోలీసులు అరెస్టు చేసి కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. ప్రస్తుతం బరేలీలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. కాగా, బరేలీకి ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చెలరేగిన హింసపైనా రజా స్పందించారు. దేశంలో బుల్డోజర్‌ల దాడిని ఇక ఎంత మాత్రం సహించేది లేదన్నారు. సుప్రీం కోర్టే తమను పట్టించుకోకపోతే ఇక తమను తామే కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment