barge
-
‘పీ 305’ ప్రమాదంలో 49 మంది మృతి
ముంబై: భీకర టౌటే తుపాను కారణంగా సముద్రంలో మునిగిపోయిన పీ–305 బార్జ్‌లోని సిబ్బందిలో మరో 26 మంది ఆచూకీ తెలియలేదని నౌకాదళం గురువారం పేర్కొంది. బార్జ్‌లో ఉన్న మొత్తం 261 మందిలో 49 మంది చనిపోయారని, మిగతా 186 మందిని రక్షించామని తెలిపింది. వరప్రద టగ్ బోట్ నుంచి మరో ఇద్దరిని కాపాడామని పేర్కొంది. అందులోని మరో 11 మంది కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపింది. సెర్చ్లైట్ల సాయంతో రాత్రింబవళ్లు గాలింపు జరుపుతున్నామని, ప్రమాదం జరిగి నాలుగు రోజులైనందున గల్లంతైన వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు తక్కువేనని పేర్కొంది. టౌటే తుపాను ప్రభావంతో సముద్రంలో కొట్టుకుపోయిన పీ–305 బార్జ్ సోమవారం మునిగిపోయిన విషయం తెలిసిందే. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన నౌకాదళ విపత్తు సహాయ బృందం గాలింపు, రక్షణ చర్యలు ప్రారంభించింది. యుద్ధనౌకలు ఐఎన్ఎస్ కొచి, ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ బియాస్, ఐఎన్ఎస్ బెట్వా, ఐఎన్ఎస్ తేజ్‌లతో పాటు పీ–81 నిఘా విమానం, ఇతర నౌకాదళ హెలికాప్టర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. మొత్తంగా 600 మందికిపైగా ఓఎన్జీసీ సిబ్బందిని కాపాడామని నౌకాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు. పశ్చిమతీరంలోని చమురు వెలికీతీత కేంద్రాల్లోని మొత్తం 6,961 ఉద్యోగులు, ఇతర సిబ్బంది క్షేమంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కెప్టెన్ తేలిగ్గా తీసుకున్నాడు టౌటే తుపాను హెచ్చరికను పీ–305 బార్జ్ కెప్టెన్ బల్విందర్ సింగ్ తేలికగా తీసుకున్నారని దాని చీఫ్ ఇంజనీర్ రహమాన్ షేక్ ఆరోపించారు. గాలుల వేగం పెద్దగా ఉండదని, తుపాన్ ప్రభావం గంటసేపు మాత్రమే ఉంటుందని చెబుతూ... హెచ్చరికలను తేలికగా తీసుకొని ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి కారణమయ్యారని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రహమాన్ ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. కెప్టెన్ బల్విందర్ గల్లంతైన వారిలో ఉన్నారు. -
Cyclone Tauktae: కడలి కబళించింది
ముంబై: టౌటే తుపాను కారణంగా సముద్రంలో కొట్టుకుపోయి, మునిగిపోయిన పీ 305 బార్జ్‌లోని సిబ్బందిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 49 మంది ఆచూకీ తెలియరాలేదు. 186 మందిని నౌకాదళం రక్షించింది. సముద్రంలో అత్యంత తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నౌకాదళ సభ్యులు ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ బార్జ్‌పై మొత్తం 261 మంది (తొలుత 273 మంది అని ప్రకటించినా దీనిని నిర్వహిస్తున్న కంపెనీ 261 మందే ఉన్నారని బుధవారం తెలిపింది) సిబ్బంది ఉన్నారు. ‘గల్లంతైన వారిని గుర్తించి, రక్షించే కార్యక్రమం కొనసాగుతోంది. అయితే సమయం గడుస్తున్న కొద్దీ వారిని రక్షించే అవకాశాలు సన్నగిల్లుతాయి’ అని నౌకాదళ అధికార ప్రతినిధి బుధవారం తెలిపారు. సముద్రంలో కొట్టుకుపోయిన మరో రెండు బార్జ్‌లు, ఒక ఆయిల్ రిగ్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారన్నారు. జీఏఎల్ కన్స్ట్రక్టర్ బార్జ్‌లోని మొత్తం 137 మంది సిబ్బందిని మంగళవారమే నేవీ, కోస్ట్‌గార్డ్స్ రక్షించిన విషయం తెలిసిందే. ఎస్ఎస్ (సపోర్ట్ స్టేషన్) 3 బార్జ్‌లోని 196 మంది సిబ్బంది, సాగర్ భూషణ్ ఆయిల్ రిగ్‌పై ఉన్న 101 మంది సురక్షితంగా ఉన్నారని నేవీ వెల్లడించింది. చనిపోయిన 26 మంది మృతదేహాలను ఐఎన్ఎస్ కొచి యుద్ధనౌకలో ముంబైకి తీసుకువచ్చారు. ఐఎన్ఎస్ తేజ్, ఐఎన్ఎస్ బెట్వా, ఐఎన్ఎస్ బియాస్, ఐఎన్ఎస్ తల్వార్, పీ 81 యుద్ధ విమానం, సీ–కింగ్ చాపర్లు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఓఎన్జీసీ, ఎస్సీఐ వినియోగిస్తున్న నౌకలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పీ 305 బార్జ్ సోమవారం సాయంత్రం నుంచి సముద్రంలో మునగడం ప్రారంభమయింది. గత నాలుగు దశాబ్దాల్లో ఇది అత్యంత క్లిష్టమైన గాలింపు, సహాయ కార్యక్రమమని డెప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ మురళీధర్ సదాశివ్ పవార్ వ్యాఖ్యానించారు. సహాయం కోరుతూ అభ్యర్థన వచ్చిన వెంటనే రంగంలోకి దిగామని, సోమవారం నుంచి సమన్వయంతో, సముద్రంలో నెలకొన్న దారుణమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ గాలింపు, సహాయ చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. సహాయ చర్యలపై పీఎం ఆరా టౌటే తుపాను వల్ల అరేబియా సముద్రంలో మునిగిపోయిన బార్జ్ పీ 305లోని సిబ్బందిని రక్షించే సహాయ చర్యలపై బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. నేవీ సీనియర్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం బార్జ్ మునిగిపోతోంది. మరో మార్గం లేదు... అరేబియా సముద్రంలోకి దూకేయడమే. చుట్టూ చిమ్మచీకటి, 15 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు. బలమైన గాలులు. లైఫ్ జాకెట్లు వేసుకున్నా... కల్లోల కడలిలో ఏం జరుగుతోందోననే భయం. ఎవరైనా సాయానికి వస్తారా? ఎప్పటికి చేరుకుంటారు? అసలు బతికి బట్టకడతామా? జలసమాధి కావాల్సిందేనా? ఎన్నెన్నో ప్రశ్నలు. భయాలు. ఏకంగా 12 గంటలపాటు జీవన్మరణ పోరాటం... చివరకు మంగళవారం ఉదయం నేవీ రక్షణ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. రక్షించిన వారిలో 125 మందిని ఐఎన్ఎస్ బుధవారం ముంబైకి తీసుకొచ్చింది. ముంబైకి నైరుతి దిశలో 70 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో హీరా ఆయిల్‌ఫీల్డ్ ఉంది. ఇందులో పనిచేసే వారికోసం పీ–305 బార్జ్పైన తాత్కాలిక నివాసాలున్నాయి. టౌటే తుపాను తీవ్రతకు సోమవారం దీని లంగరు తెగిపోయి సముద్రంలోకి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. రాత్రికి మునిగిపోయింది. అప్పుడు దీనిపై 261 మంది ఉన్నారు. వీరిలో 186 మందిని నేవీ రక్షించింది. అచ్చు టైటానిక్ దృశ్యాలే ‘‘టైటానిక్ ఓడ మునిగిపోవడం, అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో నీళ్లలో దూకేయడం, చుట్టూ శవాలు, వాటి మధ్యలో కొందరి జీవన్మరణ పోరాటం... ఇవన్నీ ప్రజలు సినిమాలో చూసుంటారు. కానీ మా కళ్ల ముందే ఇదంతా జరిగింది. టైటానిక్ కంటే దారుణంగా ఉండింది పరిస్థితి. చుట్టూ నీళ్లపై మా సహచరుల మృతదేహాలు తేలియాడుతున్నాయి. లైఫ్‌జాకెట్ సహాయంతో 14 గంటలు అలా నీళ్లపై తేలుతూ ఉన్నాను. ఏమీ కాదు.. బతుకుతామని ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం. చివరకు నేవీ సిబ్బంది దేవుళ్లలా వచ్చి కాపాడారు’ అని 28 ఏళ్ల విశ్వజీత్ బంద్‌గార్ తెలిపారు. ‘అత్యంత భీతావహ పరిస్థితి. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం. బతికి బయటపడతానని అనుకోలేదు. ఏడు, ఎనిమిది గంటల పాటు అలా నీళ్లలో ఈదుతూ ఉన్నాను. చివరికి నేవీ వచ్చి రక్షించింది.’ అని మనోజ్ గీతే తెలిపాడు. కొల్హాపూర్‌కు చెందిన 19 గీతే నెలరోజుల కిందటే హెల్పర్‌గా ఆయిల్రిగ్పై పనికి కుదిరాడు. పీడకల లాంటి అనుభవం తర్వాత మళ్లీ తాను రిగ్‌పైకి వెళ్లబోనని తేల్చిచెప్పాడు. ‘బతికున్నాను... అదే సంతోషం’ అన్నాడు. తుపాను దెబ్బకు తన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్ సముద్రంలో కలిసిపోయాయన్నాడు. నేవీ వల్లే బతికాం.. లేకపోతే ఏమయ్యేదో... అంటూ ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పాడు మరో కార్మికుడు. -
తౌక్టే ఎఫెక్ట్ : 273 మంది ఉన్న నౌక కొట్టుకుపోయింది
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. ఇప్పటికే ఈ తుఫాన్ ధాటికి మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ , గోవా, గుజరాత్, రాష్ట్రాల తీర ప్రాంతాలు విలవిలలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగిసిపడుతున్నాయి. బలమైన గాలుల ధాటికి ముంబై పశ్చిమ తీరంలో 'పి 305' అనే వ్యాపార నౌక కొట్టుకుపోయింది. అందులో సుమారు 273 మంది ఉన్నట్లు సమాచారం. సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఎఆర్) వారు పంపించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కొచ్చి గాలింపు చర్యలను ప్రారంభించింది. ఈ రాత్రికి గుజరాత్‌లోని పోరుబందర్- మహువా మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ( చదవండి: Cyclone Tauktae: అత్యంత తీవ్ర తుపానుగా తౌక్టే ) -
పులిని కూడా కుక్కే అనుకోని..
పిలిబిత్: పులి చొరబడినప్పటికీ ఆ ఇంట్లో వాళ్లంతా అది కుక్క అనుకున్నారు. అది ఏం చక్కా ఓ గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ ఆ విషయం గమనించకుండా ఆ ఇంట్లో వాళ్లు తమ పని తాము చేసుకుపోయారు. చివరకు అది ఒకసారి గాండ్రించిన తర్వాతగాని ఇంట్లోకి వచ్చింది కుక్కకాదు పులి అని అర్థమైంది. ఆ వెంటనే అంతా సురక్షితంగా భయంతో ఒక్కచోట చేరి అధికారులకు సమాచారం ఇచ్చి బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే పిలిబిత్ కు 30 కిలోమీటర్ల దూరంలోని మల్పూర్ ఖాజురియా అనే గ్రామంలో జగదీశ్ ప్రదేశ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ఇంట్లో వాళ్లంతా ఉదయాన్ని లేచి తమ పనులు నిమగ్నమై పోయి టీ తాగుతున్నారు. ఆ సమయంలో ఓ పెద్ద పులి ఇంట్లోకి దిగింది. అయితే, నిండా దట్టమైన మంచుఅల్లుకొని ఉన్న కారణంగా అది వీధి కుక్కేమో అని జగదీశ్ అనుకున్నాడు. కానీ, కొద్ది సేపటికి అది గాండ్రించడంతో పులి అనే విషయం అర్థమై అది బయటకు రాకముందే చాకచక్యంగా తలుపేసి తాళం వేశారు. అనంతరం అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దాదాపు గంటన్నరపాటు శ్రమపడి పులిని బందించారు. మత్తుమందిచ్చి తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. పులులు తిరిగే ఉత్తరాఖండ్ అడవుల పక్కనే పెద్దపెద్ద చెరుకు తోటలు ఉన్నాయి. ఆ చెరుకు తోటలోకి వెళ్లిన పులి తిరిగి అడవిలోకి వెళ్లే దారి తప్పి ఆ గ్రామంలోకి వచ్చిందని అధికారులు చెప్పారు. -
విద్యుత్ సౌధలో ఉద్రిక్తత