ఫుట్ ఓవర్ బ్రిడ్జీల పనులు వేగిరం
* హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం
* మరి.. సర్వీసు రోడ్లు ఎప్పటికి పూర్తయ్యేనో..
* నేటికీ పూర్తికాని భూసేకరణ
చౌటుప్పల్ మండలం మల్కాపురం నుంచి కృష్ణాజిల్లా నందిగామ వరకు 181.5కి.మీ.ల మేర బీఓటీ పద్ధ్దతిన జీఎంఆర్ కాంట్రాక్ట్ సంస్థ నాలుగులేన్ల రహదారి విస్తరణను రూ.2200కోట్ల వ్యయంతో ఏడాదిన్నర క్రితం పూర్తి చేసింది. కానీ, నేటికీ సర్వీసు రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. పాదచారులు కూడా రోడ్డును దాటేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. డివైడర్‌పైనున్న బారీకేడ్లను దాటుతూ పడరానిపాట్లు పడుతున్నారు. దీంతో జాతీయ రహదారుల సంస్థ పాదచారుల కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
చౌటుప్పల్‌లో 2, చిట్యాలలో 1, కేతేపల్లిలో 1 చొప్పున, ఒక్కోదాన్ని రూ.1.05కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. చౌటుప్పల్‌లోని బస్టాండ్ వద్ద, భాస్కర్ థియేటర్ వద్ద మరోటి నిర్మిస్తున్నారు. చిట్యాలలో కూడ ఒకదాని నిర్మాణం పూర్తికావొచ్చింది. మరోటి నిర్మాణంలో ఉంది. కేతేపల్లిలో కూడ పూర్తి కావొచ్చింది. కాగా, చౌటుప్పల్, చిట్యాలలో ఏర్పాటు చేయద ల్చిన ఎట్ గ్రేడ్ జంక్షన్ల నిర్మాణం నేటికీ ప్రారంభం కాలేదు.
సర్వీసు రోడ్లు ఎప్పుడో...
చౌటుప్పల్, చిట్యాల, మునగాల, నల్లబండగూడెం, పిల్లలమర్రి, రాయినిగూడెం, నకిరేకల్‌లలో రోడ్డును విస్తరించినా సర్వీసురోడ్ల నిర్మాణం చేపట్టడం లేదు. చౌటుప్పల్‌లో రెండు వైపులా నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసినప్పటికీ, తంగడపల్లి క్రాస్‌రోడ్డు ఎదురుగా ఉన్న ఓ భవనం యజమాని కోర్టుకెళ్లడంతో, అధికారులు ఆ భవనం వైపు కన్నెత్తి చూడడం లేదు. బస్టాండ్ సమీపంలో సమాధులను కూడా తొలగించలేదు. సర్వీసు రోడ్డు వేసేందుకు ప్రస్తుతం మట్టిపనులు జరుగుతున్నా, ఇవి మాత్రం అడ్డంకిగా మారాయి.
చిట్యాల మండల కేంద్రంలోనూ ఒక వైపు సర్వీసురోడ్డు నిర్మాణం పూర్తయింది. మరోవైపు కిలోమీటరున్నర మేర భూసేకరణ పూర్తికాక, భవన నిర్మాణాలే కూల్చివేయలేదు. నిర్వాసితులు కోర్టుకెళ్లడమే ఇందుకు కారణం. ఫలితంగా వర్షం కురిస్తే, వరద నీరు రోడ్లవెంటే నిల్వ ఉంటోంది. రోడ్డుకంటే తక్కువ ఎత్తులో భవన నిర్మాణాలుండడంతో, దుకాణాల్లోకి వర్షపు నీరు చేరుతోంది. చౌటుప్పల్‌లోనూ ఇదే పరిస్థితి.
ప్రమాదాలు నిత్యకృత్యం
గతంలో ఉన్న ఇరుకు రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపులుండేవి. డేంజర్ జోన్లని బోర్డులుండేవి. హైవే విస్తరణ సమయంలో క్రాసింగ్‌లన్నింటినీ సరిచేస్తామని ఇరువైపులా భూసేకరణ కూడా అధికంగా చేశారు. కానీ కొన్నిచోట్ల డేంజర్ జోన్లు కాదు.. ఏకంగా డెత్ క్రాసింగ్‌లుగా మారాయి. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి దిగగానే వాహనాలు తిరగలేని మూలమలుపు ఉంది. హైవే విస్తరణతో 120కిలోమీటర్లకు మించి వేగంతో వస్తున్న వాహనదారులు నేరుగా వచ్చి బోల్తా కొడుతున్నారు. చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న మూలమలుపు పరిస్థితి అంతే.
నార్కట్‌పల్లిలో బైపాస్ చివర, నార్కట్‌పల్లి నుంచి వచ్చే వాహనాలు కలిసే చోట జంక్షన్‌ను సరిగ్గా వేయలేదు. బ్రిడ్జి దిగే క్రమంలో వాహనాలు అతివేగంగా వస్తుంటాయి. ఇదే సమయంలో ఇక్కడ ఇరువైపులా నుంచి వచ్చే వాహనదారులు రోడ్డు దాటాలంటే ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. సర్వీసురోడ్లు పూర్తికాకపోవడంతో ఇప్పటి వరకు చౌటుప్పల్‌లో 10మందికిపైగా, చిట్యాలలో 15 మందికిపైగా మంది మృత్యువాతపడ్డారు.