ఒంటరి మహిళలే లక్ష్యం
చైన్‌స్నాచర్ అరెస్ట్ రూ.4 లక్షల 50 వేల విలువైన చోరీసొత్తు స్వాధీనం
బెంగళూరు(బనశంకరి) : ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్‌స్నాచింగ్‌లు, ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న గంగొండనహళ్లి కి చెందిన సయ్యవ్నాసీర్ను కళాసీపాళ్య పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.4 లక్షల 50 వేల విలువైన చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. సయ్యవ్నాసీర్ గత నెల 26 తేదీ కలాసీపాళ్యలోని ఎల్బీఎప్ రోడ్డులో స్నేహితుడు సాజిద్‌తో కలిసి బైక్ విక్రయిస్తుండగా గస్తీ పోలీసులు దాడులు నిర్వహించారు.
దీంతో ఆ ఇద్దరూ ఉడాయించారు. ఎట్టకేలకు పోలీసులు గాలింపు చేపట్టి సయ్యవ్నాసీర్ను అరెస్ట్ చేసి 155 గ్రాముల 7 బంగారుచైన్లు, చెవికమ్మలు, జుమీకీలు కలిపి రూ.4లక్షల 50 వేల విలువ చేసే చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్‌తో 7 చైన్‌స్నాచింగ్ కేసులు, ఓ ఇంటి చోరీ తో పాటు 8 కేసులు వెలుగుచూశాయి. సయ్యద్నాజీర్ తన స్నేహితుడు సాజిద్ తో కలిసి బసవేశ్వరనగర, విజయనగర, కామాక్షీపాళ్య, హుళిమావు తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలను గుర్తించి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని డీసీపీ.లాబూరామ్ తెలిపారు. పరారీలో ఉన్న సాజిద్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.